‘ముండకోపనిషత్తు‘లో చెప్పినట్లుగా ప్రాణం, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి భగవంతునిలో రూపుదిద్దుకున్నాయి. ఆ రూపాల్లో అతనే నిబిడీకృతమై ఉన్నాడు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడైనా పదార్థం పుడుతుంది.అవి తిరిగి శక్తిని వెదజల్లుతూ పదార్థ రూపాన్ని కోల్పోతాయి.ఉదహరణకు కర్రను తీసుకుని, జ్వలింపజేస్తే ఉష్ణం, కాంతి, శబ్దం, వాయువు తదితరాలుగా విఘటనం చెందుతూ వివిధ శక్తి రూపాలలోకి మారిపోతుంది.జీవ పదార్థాలు పంచభూతాల మేలిమి కలయిక అనుకున్నాం. ఉదాహరణకు నాచును తీసుకుంటే, సముద్రం లోపల కాంతి ప్రసరించే స్థలంలోనే నాచు ఏర్పడుతుంది.
అక్కడే ఏర్పడటానికి కారణం సూర్యరశ్మి, జలం, భూమి, వాయువు, వీటిలో అంతర్లీనంగా ఉన్న ఆకాశం. ఇదే విషయాన్ని భౌతిక పదార్థాలు, శక్తుల విషయంలో అన్వయించుకుంటే, విద్యుచ్ఛక్తి ప్రసరిస్తేనే బల్బులు వెలుగుతాయి. విద్యుచ్ఛక్తి ఆగిపోతే బల్బులు వెలగడం మానేస్తాయి. విద్యుచ్ఛక్తి, బల్బులు అనేవి భౌతిక పదార్థాలైన నిర్జీవాలు.కానీ, జీవి విషయంలో విద్యుచ్ఛక్తి లాంటి శక్తి జీవి జీర్ణాశయంలో తయారౌతూ ఉంటుంది.ఆ శక్తి ప్రసారం కావడానికి రక్తం లాంటి అవయవాలు తోడ్పడతాయి.బల్బులో ఫిలమెంట్ తెగిపోతే వెలగదు. అలాగే జీవిలో ముఖ్య అవయవాలు పనిచేయకపోతే ప్రాణం నిలవదు. అంతేగాని, ప్రాణం ఎక్కడికో వెళ్లదు. అది ఒకానొక శక్తిరూపం.‘కేనోపనిషత్తు‘ మెరుపులోనున్న శక్తిలో, జీవిలోనున్న ప్రాణశక్తిలో ఉన్నది ఆత్మేకదా అంటుంది.
ప్రాణం అనేది విద్యుచ్ఛక్తి, కాంతి శక్తి, ఉష్ణశక్తుల లాంటి ఒకానొక శక్తిరూపం మాత్రమే. అది శరీరమనే పదార్థంలో నిండుగా ఉంటుంది. ఇక్కడ శరీరమే ప్రాణశక్తిని తయారు చేసుకుని జీవనం సాగిస్తుంది. ముదిమిలో అలసిన శరీరం ప్రాణశక్తిని సృష్టించుకోలేక నిశ్చలమైపోయి, పంచ భూతాలుగా విఘటనం చెందుతుంది. అంతేగాని, ప్రతీ జీవికో ప్రత్యేక ఆత్మ అనేది ఉండదు. కర్మఫలాలను మన ప్రాణం మోసుకెళ్లలేదు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న సాధకుడు తనలోని అంతర్యామి, తనను ఆవరించి ఉన్న సర్వాంతర్యామి అభేదమని గుర్తెరిగి తోటిజీవులన్నింటి పట్లా ప్రేమను, ఆరాధ్య భావననూ కలిగి, ఆనందాన్ని గ్రోలుతూ ఉంటాడు.
– గిరిధర్ రావుల
Comments
Please login to add a commentAdd a comment