
ఇక అంతా ఆటోమెటిక్
♦ సిటీలో కొత్త డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు!
♦ కేరళ తరహాలో వీడియో సెన్సర్ల ఏర్పాటు
♦ అమలు దిశగా రవాణాశాఖ సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునికీకరించనుంది. డ్రైవింగ్ లెసైన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చెల్‌లోని డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది.
దీంతో సరైన నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లెసైన్సులు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజుల క్రితం కేరళలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్లను అధ్యయనం చేసింది. అక్కడి పద్ధతిలో ఎంవీఐల జోక్యం ఉండదు. వీడియో సెన్సర్లు కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఈ సెన్సర్లు నమోదు చేస్తాయి. ఈ కదలికల ఆధారంగా సదరు వ్యక్తి నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసి సర్టిఫికెట్ ఇస్తారు. రవాణాశాఖ నిర్ధారించిన ప్రమాణాలకు విరుద్ధంగా వాహనాలు నడి పిన వారు ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్‌లు వస్తాయి.
అమలు దిశగా సన్నాహాలు..
కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని కోరుతూ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ‘సాక్షి’తో చెప్పారు.
కచ్చితమైన నిఘా..
ప్రస్తుతం లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాల యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లెసైన్సుల రెన్యువల్ వంటి పౌరసేవల కోసం వినియోగదారులు ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ రకాల సేవల కోసం ఈ సేవ కేంద్రాల్లోనూ, ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లించే పద్ధతి అందుబాటులోకి తెచ్చారు. డ్రైవింగ్ పరీక్షల్లో మాత్రం సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎంవీఐల పరిశీలనే ప్రధానంగా ఉంది.
ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే లెసైన్సులు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌లు దోహదం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల్లోనే వీడియో సెన్సర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు వాహనం నడిపే తీరును సెన్సర్ల ద్వారా పరిశీలించి పాస్, ఫెయిల్‌ను నిర్థారిస్తారు.