4జీ సేవలు.. డిజిటల్‌ భారతం | Digital India And Internet Smartphone special Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

4జీ సేవలు.. డిజిటల్‌ భారతం

Published Sun, Oct 18 2020 10:24 AM | Last Updated on Sun, Oct 18 2020 10:43 AM

Digital India And Internet Smartphone special Story In Sakshi Funday

భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు పాతికేళ్ల కిందట ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మొబైల్‌ఫోన్‌లూ వాడుకలోకి వచ్చాయి. తొలినాళ్లలో సంపన్నులకే పరిమితమైన ఇంటర్నెట్, మొబైల్‌ సేవలు అనతికాలంలోనే దేశంలోని సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో 2008 చివర్లో 3జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభం కావడంతో స్మార్ట్‌ఫోన్‌లు వాడుకలోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌లలోనే నేరుగా ఇంటర్నెట్‌ వాడుకునే సౌలభ్యం ఉండటంతో సోషల్‌ మీడియా శరవేగంగా విస్తరించడం మొదలైంది. కాలక్రమంలో 4జీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ‘డిజిటల్‌’ వేగం మరింతగా పెరిగింది. ప్రపంచమంతా డిజిటల్‌మయంగా మారుతుండటంతో భారత ప్రభుత్వం 2015లో ‘డిజిటల్‌ ఇండియా’ ప్రచారం ప్రారంభించింది. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం కూడా మొదలైంది. గడచిన ఐదేళ్లలో దేశంలో డిజిటల్‌ పరుగు మరింతగా వేగం పుంజుకుంది.

తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి ప్రస్తుతం మన దేశంలో మొబైల్‌ఫోన్లు వాడుతున్న వారు 106 కోట్ల మంది ఉంటే, ఇంటర్నెట్‌ యూజర్లు 68.76 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో దాదాపు 78 శాతం మంది వద్ద మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. గత ఏడాది జనవరి నాటితో పోల్చుకుంటే దేశంలో మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య 1.50 కోట్లు (1.4 శాతం) తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది వ్యవధిలో దేశంలో సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లు (48 శాతం) పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా సోషల్‌ మీడియా యూజర్లు ఉన్నారు. సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 
నింగి నుంచి నేల మీదకు...
దేశంలో మొబైల్‌ సేవలు ప్రారంభమైనప్పుడు ధరలు విపరీతంగా ఉండేవి. తొలిసారిగా 1995లో ఈ సేవలు మొదలైనప్పుడు ప్రీపెయిడ్‌ సిమ్‌కార్డు కోసమే రూ.4,900 వెచ్చించాల్సి వచ్చేది. కాల్‌ ధర నిమిషానికి రూ.17 ఉండేది. ఔట్‌గోయింగ్‌కే కాదు, ఇన్‌కమింగ్‌ కాల్‌కు కూడా ఇదే ధర. తొలిసారిగా దేశంలో ఈ సేవలు ప్రారంభమైనప్పుడు కోల్‌కతాలోని రైటర్స్‌ బిల్డింగ్‌ (పశ్చిమ బెంగాల్‌ సచివాలయం) నుంచి అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఢిల్లీలోని సంచార్‌ భవన్‌లో ఉన్న నాటి టెలికం మంత్రి సుఖ్‌రామ్‌కు తొలి మొబైల్‌ ఫోన్‌కాల్‌ చేశారు. అప్పట్లో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సమాజంలోని అత్యంత సంపన్నులు మాత్రమే మొబైల్‌ఫోన్‌లతో కనిపించేవారు. తొలినాటి మొబైల్‌ ఫోన్‌లన్నీ బేసిక్‌ ఫోన్‌లే. వాటి ద్వారా కాల్‌ చేసుకోవడానికి, ఎస్‌ఎంఎస్‌ పంపుకోవడానికి తప్ప మరే వెసులుబాటూ ఉండేది కాదు. అయినా, అప్పట్లో వాటి ధరలు చుక్కలను తాకేవి. తొలినాటి మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లలో భద్రతాపరమైన లోపాలూ ఉండేవి.

వాటిలో ఎలాంటి ట్రాకింగ్‌ సౌకర్యం ఉండేది కాదు. చోరీలకు గురైన మొబైల్‌ ఫోన్‌లను తిరిగి పొందటం కల్లగానే ఉండేది. దేశంలో క్రమంగా మొబైల్‌ఫోన్లకు, సిమ్‌కార్డులకు డిమాండ్‌ పెరుగుతూ వస్తున్న రోజుల్లో మొబైల్‌ఫోన్‌లు, సిమ్‌కార్డుల స్మగ్లింగ్‌ కూడా బాగానే జరిగేది. స్మగుల్డ్‌ హ్యాండ్‌ సెట్‌లు కస్టమ్స్‌ కళ్లుగప్పి మార్కెట్‌లోకి రావడంతో, సహజంగానే వాటి ధర సగానికి సగం తక్కువగా ఉండేది. ‘సిమ్‌’కార్డులతో జీఎస్‌ఎం సేవలు కొనసాగుతుండగానే, 2002లో ‘సిమ్‌’ అవసరం లేని సీడీఎంఏ సేవలు మొదలయ్యాయి. రిలయన్స్, టాటా, హచ్‌ వంటి సంస్థలు సీడీఎంఏ సేవలను అందిస్తూ, 2జీ టెలికం సేవల మార్కెట్‌లో 20 శాతం వాటాను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగాయి.

సీడీఎంఏ సేవలు మొదలవడంతో మొబైల్‌ కాల్‌ ధరలు, ఎస్‌ఎంఎస్‌ ధరలు గణనీయంగా తగ్గి, దేశంలోని సామాన్యులకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరో రెండేళ్లు తిరిగే సరికి– అంటే 2004 నాటికి దేశంలో తొలిసారిగా మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య ల్యాండ్‌ఫోన్‌ కనెక్షన్ల సంఖ్యను అధిగమించడం జరిగింది. దేశంలో 2008లో 3జీ సేవలు మొదలవడంతో స్మార్ట్‌ఫోన్‌లు వాడుకలోకి రావడం మొదలైంది. ఇంటర్నెట్, మొబైల్‌ సేవలను అందించే సంస్థలు పోటాపోటీగా ధరలు తగ్గిస్తూ రావడంతో పాటు 2012 నాటికి 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో 2014 నాటికి మొబైల్‌ఫోన్‌ల డిమాండ్‌ దేశంలో తారస్థాయికి చేరుకుంది. బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు దీటుగా కారుచౌక ధరల్లో చైనా స్మార్ట్‌ఫోన్‌లు కూడా కుప్పలు తెప్పలుగా మార్కెట్‌లోకి రావడం మొదలైంది. మొబైల్‌ సేవల ధరలు దాదాపు పూర్తిగా నింగి నుంచి నేలపైకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌లు పల్లెలకు సైతం చేరడం ప్రారంభమైంది. రిలయన్స్‌ జియో 2016లో మొదలైన తర్వాత మొబైల్‌ సేవల్లో మరింత వేగం పుంజుకుంది. ఫలితంగా, గత ఏడాది నాటికి భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. 

భారత్‌లో ఇంటర్నెట్‌ ప్రస్థానం...
మన దేశంలో ఇంటర్నెట్‌ ప్రస్థానం తొలి ఐదేళ్లలో మందకొడిగానే సాగింది. దేశంలో 1995 నుంచి ఇంటర్నెట్‌ సేవలు మొదలైనా, 2000 నాటికి ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య కేవలం 2 కోట్లు మాత్రమే ఉండేది. మరో పదేళ్లు గడిచే సరికి– అంటే 2010 నాటికి ఈ సంఖ్య 10 కోట్లకు, 2015 నాటికి 31.70 కోట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి, ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, 62.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది చివరినాటి లెక్కల ప్రకారం ఇంటర్నెట్‌ సేవలను క్రియాశీలంగా ఉపయోగించుకునే యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 49.30 కోట్లుగా ఉంటే, వీరిలో పట్టణ ప్రాంతాల్లోని వారు 29.30 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు 20.00 కోట్లుగా ఉన్నట్లు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) ప్రకటించింది.

కనీసం నెలకు ఒకసారైనా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే వారిని యాక్టివ్‌ యూజర్లుగా పరిగణనలోకి తీసుకున్నామని, వీరిలో 70 శాతం మంది దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకుంటున్న వారేనని వెల్లడించింది. దేశంలోని యాక్టివ్‌ యూజర్లలో 43.3 కోట్ల మంది పన్నెండేళ్ల పైబడిన వయసు గలవారు కాగా, 7.1 కోట్ల మంది 5–11 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. గత ఏడాది మార్చి–నవంబర్‌ మధ్య కాలంలోనే ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్యలో 5.30 కోట్ల పెరుగుదల నమోదైందని, దీంతో భారత్‌... అమెరికాను అధిగమించి ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. అయితే, మన దేశంలోని యూజర్లలో పురుషులకు, మహిళలకు అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. యాక్టివ్‌ యూజర్లలో 71 శాతం మంది పురుషులైతే, మహిళలు 29 శాతం మంది మాత్రమే. 
ఇదిలా ఉంటే, దేశంలో అత్యధికంగా 97 శాతం మంది మొబైల్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ సేవలను పొందుతున్నారు. మొబైల్‌ మాత్రమే కాకుండా పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఇంటర్నెట్‌ వినియోగించుకునే వారి సంఖ్య 30.3 కోట్లుగా ఉన్నట్లు ఐఏఎంఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగంలో వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగితే, 2025 నాటికి దేశంలో యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 97.4 కోట్లను అధిగమించగలదని ఐఏఎంఐఐ అంచనా వేస్తోంది.

సమాచారానికి ఆధారం
సమాచారం కోసం వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన రెండేళ్లలో మన దేశంలో వార్తా పత్రికల ప్రింట్‌ ఎడిషన్ల మార్కెట్‌లో 4.4 శాతం పెరుగుదల నమోదైంది. ఇదేకాలంలో సమాచారం కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడే వారి సంఖ్యలో 19 శాతం పెరుగుదల నమోదైంది. న్యూస్‌ వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ వృద్ధికి ఇదొక ఆశాజనకమైన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ యూజర్లలో స్థానిక భాషల్లో కంటెంట్‌ను వినియోగించుకునే వారు మన దేశంలో 60 శాతానికి పైగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ‘కరోనా’ మహమ్మారి తాకిడి మొదలైన తర్వాత వార్తల కోసం యూజర్లు ఇంటర్నెట్‌లో గడిపే సమయం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ‘కరోనా’ వ్యాప్తికి ముందు మూడు నెలలు– జనవరి నుంచి మార్చి వరకు చూసుకుంటే, యూజర్లు వారానికి సగటున 27 నిమిషాలు ఇంటర్నెట్‌లో వార్తల కోసం వెచ్చించేవారు. మార్చి చివర్లో లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఈ సమయం 40 నిమిషాలకు పెరిగిందని ‘బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ (బీఏఆర్‌సీ) వెల్లడించింది. వార్తలను చదువుకోవడం, వార్తలకు సంబంధించిన వీడియో క్లిపింగ్స్‌ను చూడటమే కాకుండా, నచ్చిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఇంటర్నెట్‌లో వార్తల వెదుకులాట సాగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత దేశంలో న్యూస్‌ యాప్స్‌ వినియోగం ఏకంగా 50 శాతం మేరకు పెరిగిందని, న్యూస్‌ వెబ్‌సైట్స్‌ వినియోగం 42 శాతం మేరకు పెరిగిందని ‘బీఏఆర్‌సీ’–నీల్సన్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

సామాజిక మాధ్యమ చైతన్యం
ఇంటర్నెట్‌ సేవలు విస్తృతం కావడమే కాకుండా, స్మార్ట్‌ఫోన్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో భారత యూజర్లలో సామాజిక మాధ్యమ చైతన్యం కూడా పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 40 కోట్లకు పైగా సోషల్‌ మీడియా యూజర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 79.3 శాతం యూజర్లు ఫేస్‌బుక్, 7.35 శాతం యూట్యూబ్, 5.32 పింటరెస్ట్, 3.9 శాతం ఇన్‌స్టాగ్రామ్, 1.91 శాతం ట్విట్టర్‌ వేదికలను వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా, స్మార్ట్‌ఫోన్లను వినియోగించుకునే వారిలో వాట్సాప్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 40 కోట్లను అధిగమించడం విశేషం. సామాజిక మాధ్యమాలను ఎక్కువగా సమాచారాన్ని, సామాజిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, వినోదానికి, నైపుణ్యాల ప్రదర్శనకు ఉపయోగించుకుంటు న్నారు. కొంతమంది వీటిని వ్యాపార విస్తరణ వేదికలుగా, ఆదాయ మార్గాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు.

‘యూట్యూబ్‌’ వీడియోలను స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్నవారు కూడా మన దేశంలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సోషల్‌ మీడియా యూజర్లలో భారతీయులు గత ఏడాది రోజుకు సగటున 2.4 గంటల కాలం గడిపేవారు. ఏడాది వ్యవధిలోనే ఈ సమయం ఏకంగా 87 శాతానికి పెరిగి, రోజుకు 4 గంటలకు చేరుకుంది. ‘కరోనా’ లాక్‌డౌన్‌ కాలానికి ముందు రోజుకు సగటున 150 నిమిషాలు గడిపేవారు కాస్తా, లాక్‌డౌన్‌ కాలం మొదలైనప్పటి నుంచి రోజుకు 280 నిమిషాలు గడుపుతున్నట్లుగా ‘హ్యామర్‌కాఫ్‌ కన్జూమర్‌ స్నాప్‌చాట్‌ సర్వే’ వెల్లడించింది.  ఇదిలా ఉంటే, ‘కరోనా’ దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడటంతో ఈ ఏడాది ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ద్వారా సినిమాలు చూసేవారి సంఖ్య ఏకంగా 71 శాతం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలవడంతో వాట్సాప్, జూమ్‌ వంటి వాటి వినియోగం పెరగడం కూడా ఈ పెరుగుదలకు దోహదపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘కరోనా’తో ఈ–కామర్స్‌కు ఊపు
భారత రిటైల్‌ మార్కెట్‌ వార్షిక విలువ 800 బిలియన్‌ డాలర్లు (రూ.58.47 లక్షల కోట్లు). ఇందులో ఈ–కామర్స్‌ వాటా 3.5 శాతం మాత్రమే. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ–కామర్స్‌ సంస్థలు నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు రకరకాల వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నా, ఆన్‌లైన్‌లో వీటిని తెప్పించుకునేవారు మన దేశంలో తక్కువే. నేరుగా దుకాణాలకు వెళ్లి షాపింగ్‌ చేయడానికే భారతీయులు మొగ్గు చూపుతారు. దుకాణాలకు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లడం, కలియదిరగడం, బేరాలు చేయడం చాలామందికి కాలక్షేపం. ‘కరోనా’ ఈ పరిస్థితిలో పెను మార్పు తెచ్చింది. దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత ఈ–కామర్స్‌ సంస్థల అమ్మకాలు ఏకంగా 90 శాతం మేరకు పెరిగాయి. ఈ–కామర్స్‌ రంగంలో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న ఐదేళ్లలో ఈ రంగం సగటున 30 శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • సామాజిక మాధ్యమాలకు అలవాటుపడిన యువతలో చాలామంది సమాచారం కోసం, వినోదం కోసం మాత్రమే వీటికి పరిమితం కాకుండా ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలవుతున్నారనే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం పబ్‌జీ, టిక్‌టాక్‌ వంటి యాప్స్‌ను బ్యాన్‌ చేసింది గాని, వీటి వాడకం తారస్థాయిలో ఉన్నప్పుడు వీటి ద్వారా దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు, వీటి ఉచ్చులో చిక్కుకుని మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు చాలామందే ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో మితిమీరి సమయం గడిపేవారిలో చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు వార్తాకథనాలు, గణాంకాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement