సైన్స్ అండ్ టెక్నాలజీ
రూ.235 కోట్లతో సార్క్ ఉపగ్రహం సార్క్ దేశాల కోసం భారత్ ప్రయోగించనున్న ఉపగ్రహానికి రూ.235 మేర ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం జూలై 24న పార్లమెంటుకు తెలిపింది. 2014 నవంబరులో నేపాల్‌లో జరిగిన సార్క్ సదస్సులో ఈ ఉపగ్రహంపై ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. 12 కేయూ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లతో ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎంకే-2 ద్వారా ఇస్రో ప్రయోగిస్తుంది. ఉపగ్రహం ద్వారా సార్క్ సభ్యదేశాలకు టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్, విపత్తుల నిర్వహణ వంటివాటికి అవసరమయ్యే సేవలు అందుబాటులోకి వస్తాయి.
దేశీయ యుద్ధనౌకల నిర్మాణానికి 15 ఏళ్ల ప్రణాళిక
భారత నౌకాదళం..స్వదేశీ నిర్మాణ ప్రణాళిక(2015-30) ను జూలై 20న ఆవిష్కరించింది. దేశీయంగా యుద్ధ నౌకలు, ఇతర ఆయుధాల నిర్మాణాన్ని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ద్వారా చేపట్టేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు. దీన్ని ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానిస్తారు. భారతీయ పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తారు.
గ్రహాంతర వాసుల అన్వేషణ ప్రారంభం
గ్రహాంతర వాసుల అన్వేషణకు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు లండన్‌లో జూలై 20న ప్రకటించారు. పదేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టుకు రష్యాకు చెందిన బిలియనీర్ యూరీ మిల్నర్ 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘బ్రేక్ థ్రూ లిజన్’ అని పేరు పెట్టారు. దీనికోసం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోపుల సహాయం తీసుకుంటారు. ఇతర గ్రహాల్లోని మేధో జీవులు వెలువరించే రేడియో సంకేతాల కోసం ఈ పరిశోధనలు చేపడుతున్నారు.
జాతీయం
దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్ర దాడి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జూలై 27న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మరణించారు. వీరిలో ఒక ఎస్పీ, ముగ్గురు పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సాయుధ దళాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు దీనానగర్‌లో రైలు పట్టాలపై బాంబులు అమర్చారు.
క్రిడాకు సర్దార్ పటేల్ పురస్కారం
హైదరాబాద్‌లోని జాతీయ మెట్ట పరిశోధనా కేంద్రం (క్రిడా)కు సర్దార్ పటేల్ ఉత్తమ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జూలై 25న పాట్నాలో క్రిడా సంచాలకుడు శ్రీనివాసరావుకు ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఏటా దేశంలో వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరచిన సంస్థకు ఈ పురస్కారం ప్రకటిస్తోంది.
లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ఎంపీలు
బెంగాలీ నటుడు ‘జార్జ్ బేకర్’, కేరళకు చెందిన ‘రిచర్డ్ హే’లను లోక్‌సభకు రాష్ట్రపతి నామినేట్ చేశారు. జార్జ్ బేకర్ ‘చమేలీ మేమ్‌సాబ్’ చిత్రానికి 1975లో జాతీయ చలనచిత్రోత్సవ అవార్డును పొందారు. రిచర్డ్ హే ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. ఆయన దేశ, విదేశాల్లోని వివిధ అకడమిక్ సంస్థల్లో ఆర్థిక శాస్త్ర అంశాలను బోధిస్తున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి కలాం అస్తమయం
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం (84) షిల్లాంగ్‌లో జూలై 27న మరణించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో లివబుల్ ప్లానెట్ అనే అంశంపై ఉపన్యసిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. ఆయన్ను సమీపంలోని బెథనీ ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ కలాం 1931, అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక 1960లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో చేపట్టిన క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అగ్ని, పృథ్వీ క్షిపణుల రూపకల్పనకు కృషిచేశారు. దీంతో ఆయన మిసైల్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు. 2002 జూలై 25 నుంచి 2007 జూలై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయనకు 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న, 1997లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు, 1998లో వీర్ సావర్కర్ అవార్డు లభించాయి.
టెరీ డీజీ పచౌరీ తొలగింపు
ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టీఈఆర్‌ఐ) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీని తొలగిస్తూ ఆ సంస్థ పాలకమండలి జూలై 23న బెంగళూరులో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడుగా పచౌరీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పచౌరీ స్థానంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్‌ను టెరీ పాలక మండలి నియమించింది.
ఆర్థికం
షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు చైనాలోని షాంఘైలో జూలై 21న ఆవిర్భవించింది. బ్రిక్స్ దేశాలు 100 బిలియన్ డాలర్ల ప్రాథమిక అధీకృత మూలధనంతో ఏర్పాటుచేసిన ఈ బ్యాంకు సభ్యదేశాల మౌలిక సదుపాయాల కోసం నిధులు అందిస్తుంది. పశ్చిమ దేశాల ఆధిపత్యం ఉన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) వంటి సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాల కూటమి ఏర్పాటుచేసిన తొలి బ్యాంకు ఇది. బ్యాంకుకు మొదటి అధ్యక్షుడిగా ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్‌ను భారత్ 2015, మే 11న నామినేట్ చేసింది. కామత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఒప్పందం
దాదాపు 200 టెక్నాలజీ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) జూలై 24న తెలిపింది. అమెరికా, చైనా, ఐరోపా యూనియన్‌కు చెందిన 28 దేశాలతోపాటు మొత్తం 49 దేశాలు ఈ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో టెక్నాలజీ సంబంధ ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో జీపీఎస్ నావిగేషన్ పరికరాలు, మెడికల్ స్కానర్లు, కొత్త తరానికి చెందిన సెమీకండక్టర్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి.
క్రీడలు
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలతోపాటు 36 మందిపై నమోదైన అభియోగాలను జూలై 25న కోర్టు కొట్టేసింది. ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013 మే 16న క్రికెటర్లతోపాటు కొందరు బుకీలు అరెస్టయ్యారు.
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీ
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. అస్తానా (కజకిస్థాన్) లో జూలై 26న ముగిసిన టోర్నమెంటులో మొత్తం తొమ్మిది పతకాలతో భారత్ రన్నరప్‌గా నిలచింది. కజకిస్థాన్ మొదటి స్థానం, మంగోలియా మూడో స్థానాల్లో ఉన్నాయి.
స్క్వాష్ టాస్మేనియన్ ఓపెన్ టోర్నీ టైటిల్
టాస్మేనియన్ ఓపెన్ టోర్నమెంట్ స్క్వాష్ టైటిల్‌ను భారత్‌కు చెందిన కుష్ కుమార్ గెలుచుకున్నాడు. ఇది ఆయనకు తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టైటిల్. జూలై 26న ఆస్ట్రేలియాలో ముగిసిన ఫైనల్లో జేమీ హేకాక్స్(ఇంగ్లండ్)ను కుష్ కుమార్ ఓడించాడు.
వెటెల్‌కు హంగేరీ గ్రాండ్‌ప్రి టైటిల్
ఫార్ములా వన్ హంగేరీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 26న ముగిసిన పోటీలో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, క్వియాట్ (రెడ్ బుల్) రెండో స్థానం పొందాడు.
అంతర్జాతీయం
అమెరికా, క్యూబా మధ్య సంబంధాల పునరుద్ధరణ అమెరికా, క్యూబాల రాజధానుల్లో రెండు దేశాల దౌత్య కార్యాలయాలు జూలై 20న తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 54 ఏళ్ల తర్వాత సంబంధాల పునరుద్ధరణ జరిగింది. వాషింగ్టన్‌లోని క్యూబా దౌత్యకార్యాలయంపై ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ జెండా ఎగరేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతాయని, 2014 డిసెంబరు 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చల సందర్భంగా ప్రకటించారు.
హిగ్స్‌కు రాయల్ సొసైటీ కొప్లే మెడల్
ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ కొప్లే మెడల్.. భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్‌కు లభించింది. పదార్థంలోని ఇతర ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని కలిగిస్తున్న మరో కణం ఉందని 1964లో హిగ్స్ ప్రతిపాదించారు. ఆ కణానికి హిగ్స్ బోసన్ అని పేరు పెట్టారు. హిగ్స్ ప్రతిపాదన సరైందేనని 2012లో రుజువైంది. స్విట్జర్లాండ్‌లోని లార్జ్ హాడ్రన్ కొలైడర్‌లో జరిపిన ప్రయోగాల్లో కణం ఉనికిని మొదటిసారి ధ్రువీకరించారు. శాస్త్రరంగంలో అత్యంత పురాతనమైన రాయల్ సొసైటీ పురస్కారాన్ని 1731లో తొలిసారిగా బహూకరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో డార్విన్, ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్నారు.
రాష్ట్రీయం
విప్లవ రచయిత చలసాని మృతి విప్లవ రచయితల సంఘం(విరసం) సహ వ్యవస్థాపకుడు, రచయిత చలసాని ప్రసాద్ (83) విశాఖపట్నంలో జూలై 25న మరణించారు. విప్లవ రచనలు, కవితలతో ఆయన సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు అరెస్టయ్యారు. శ్రీశ్రీ, రంగనాయకమ్మ, రావి శాస్త్రి వంటి అనేకమంది సాహితీవేత్తలకు ఆయన అత్యంత సన్నిహితుడు.
రాజమహేంద్రవరంగా రాజమండ్రి
రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జూలై 25న గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రకటించారు. రాజమహేంద్రవరాన్ని ఆధునిక పర్యాటక నగరంగా, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దీనికోసం తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో గ్రామజ్యోతి కార్యక్రమం
గ్రామాల సమగ్రాభివృద్ధికి గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూలై 26న ప్రకటించారు. రూ.25 వేల కోట్లతో చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రెండు నుంచి ఆరు కోట్ల రూపాయలు అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. గ్రామపంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం, గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, అమలుచేయడం వంటి చర్యలు చేపడతారు. ఈ కార్యక్రమం అమలు, విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు.
షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంక్...
Published Thu, Jul 30 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement