సైన్స్ అండ్ టెక్నాలజీ
శాస్త్రవేత్త సంజీవ్‌కు బిర్లా అవార్డు 2014 సంవత్సరానికి జి.డి.బిర్లా అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త సంజీవ్ గలాండే ఎంపికయ్యారు. ఈయన పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కణ జీవశాస్త్రం, ఎపిజెనిటిక్స్ రంగాల్లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
తీర గస్తీ నౌక రాణి దుర్గావతి ప్రారంభం
సముద్ర తీర గస్తీ నౌక రాణి దుర్గావతిని విశాఖపట్నంలో జూలై 6న తూర్పు నౌకదళాధిపతి అడ్మిరల్ సతీశ్ సోనీ ప్రారంభించారు. గోండు వంశానికి చెందిన వీరనారి రాణి దుర్గావతి పేరును ఈ నౌకకు పెట్టారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
క్రీడలు
చిలీకి కోపా అమెరికన్ కప్ ఫుట్‌బాల్ కోపా అమెరికన్ కప్‌ను తొలిసారి చిలీ గెలుచుకుంది. ఈ కప్‌ను చిలీ 99 ఏళ్ల అనంతరం గెలుచుకోగలిగింది. జూలై 5న శాంటియాగో (చిలీ)లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను చిలీ ఓడించింది.
ఒలింపిక్స్‌కు మహిళల హాకీ జట్టు అర్హత
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌లో విజయం సాధించి భారత హాకీ మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో జూలై 4న జరిగిన పోటీలో జపాన్ జట్టును ఓడించి భారత్ అయిదో స్థానం దక్కించుకుంది. దీంతో 35 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
భారత్‌కు ఎస్‌ఏబీఏ చాంపియన్‌షిప్ టైటిల్
4వ దక్షిణాసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎస్‌ఏబీఏ) టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో జూలై 5న జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మూడో స్థానంలో నేపాల్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, అయిదో స్థానంలో మాల్దీవులు, ఆరో స్థానంలో భూటాన్ నిలిచాయి. దీంతో భారత్ ఈ ఏడాది చివర చైనాలో జరిగే ఆసియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.
అమెరికాకు మహిళల ప్రపంచ
కప్ ఫుట్‌బాల్ టైటిల్ మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. వాంకోవర్‌లో జూలై 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను అమెరికా 5-2 తేడాతో ఓడించింది. ఈ కప్‌ను అమెరికా గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 1991, 1999లో గెలుచుకుంది. మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా అమెరికా నిలిచింది.
జాతీయం
జాతీయ నైపుణ్య విధానానికి కేబినెట్ ఆమోదం జాతీయ నైపుణ్య విధానానికి కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంచుతారు. తద్వారా సృజనాత్మక పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సంతులనం సాధించడం, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను తొలగించడం, గుణాత్మకమైన పనితనం, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం కల్పించడం, శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన
మధ్య ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 6న ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇస్లామ్ కరిమోవ్‌తో ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు. అణు ఇంధన శక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాదం, అఫ్గానిస్థాన్ పరిస్థితి సహా పలు ప్రాంతీయ అంశాలపై ఇరు దేశాల నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంస్కృతి, పర్యాటక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు
అత్యాచారం, అత్యాచార యత్నం కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదర్చడం వీలుపడదని సుప్రీంకోర్టు జూలై 1న పేర్కొంది. ఈ నేరాలు అపరాధ రుసుంతో సరిపోయేవి కావని, అందువల్ల రాజీ కుదర్చడం సరికాదని పేర్కొంటూ, కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు రాజీ చేసుకోవడానికి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతించడంపై ప్రభుత్వం అప్పీలు చేసిన కేసులో సుప్రీం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ కేసును తిరిగి పరిశీలించాలని హైకోర్టుకు తిప్పి పంపింది.
డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రారంభించిన ప్రధాని
డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 1న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అవినీతి నిర్మూలనకు, పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు, పేద-ధనికుల మధ్య వ్యత్యాసాలను అంతం చేసేందుకు డిజిటల్ విప్లవం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్స్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ ఇండియా వీక్ ప్రారంభ కార్యక్రమంలో దేశంలోని రిలయన్స్, బిర్లా, మిట్టల్, విప్రో తదితర సంస్థల అధిపతులు పాల్గొని, 18 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు డిజిటల్ రంగంలో దాదాపు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారత్ నెట్, డిజిటల్ లాకర్, ఉపకారవేతనాల పోర్టల్, డిజిటల్ ఇండియా పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
వీధిబాలల గుర్తింపు కోసం ఆపరేషన్ ముస్కాన్
దేశవ్యాప్తంగా వీధిబాలలను సంరక్షించడం, తప్పిపోయిన వారి కుటుంబాలకు చేర్చడం కోసం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 1 నుంచి 31 వరకు కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులు, ప్రార్థనా స్థలాలు తదితర ప్రదేశాలలో వీధి పిల్లల ఫోటోలు తీసి వివరాలు సేకరిస్తారు.
పీఎంకేఎస్‌వైకు కేబినెట్ ఆమోదం
ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)కు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం ప్రతి గ్రామానికి నీటి పారుదల సౌకర్యం కల్పిస్తారు. దీనికోసం వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఈ కార్యక్రమం కింద కేంద్రం రాష్ట్రాలకు 75 శాతం నిధులు గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్రాలు భరించాలి. ఈశాన్య, కొండ ప్రాంతాల రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో ఉంటుంది.
జాతీయ వ్యవసాయ మార్కెట్‌కు ఆమోదం
జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ జూలై 1న ఆమోదం తెలిపింది. కొత్త విధానం ద్వారా రాష్ట్రం మొత్తం మార్కెట్ కార్యకలాపాలకు సింగిల్ లెసైన్స్, ఒకే రకమైన పన్ను విధానం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వేలం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరుగుతుంది. దీంతో రాష్ట్రం మొత్తం ఒకే మార్కెట్‌లా మారుతుంది. దేశంలోని 585 హోల్‌సేల్ వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్ జాతీయ వ్యవసాయ మార్కెట్‌కు రూ.200 కోట్లు కేటాయించింది.
సామాజిక, ఆర్థిక, కుల గణన-2011 విడుదల
సామాజిక, ఆర్థిక, కుల గణన - 2011ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ జూలై 3న విడుదల చేశారు. 1934 తర్వాత సామాజిక, ఆర్థిక, కుల గణనను విడుదల చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ లెక్కల్లో కులాలకు సంబంధించిన వివరాలు లేవు. ముఖ్యాంశాలు: దేశంలో మొత్తం కుటుంబాల సంఖ్య: 24.39 కోట్లు; గ్రామీణ కుటుంబాలు: 17.91 కోట్లు; పేదరికంలో ఉన్న గ్రామీణ కుటుంబాలు: 10.69 కోట్లు; ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు: 3.86 కోట్లు; భూమి లేని, శారీరక కష్టంపై జీవించే గ్రామీణ కుటుంబాలు: 5.37 కోట్లు; నెల జీతం పొందే గ్రామీణ కుటుంబాలు: 2.5 కోట్లు; శారీరక శ్రమపై ఆధారపడే రోజువారీ కూలీలు: 9.16 కోట్లు; 18-59 ఏళ్ల వయసువారు లేని కుటుంబాలు: 65.15 లక్షలు; 25 ఏళ్ల వయసు పైబడిన నిరక్షరాస్య వయోజనులున్న కుటుంబాలు: 4.21 కోట్లు; గ్రామీణ జనాభాలో మహిళలు: 48 శాతం.
ఆర్థికం
బెయిల్ అవుట్ ప్యాకేజీ షరతుల తిరస్కరణ
ఐరోపా యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు విధించిన షరతులను జూలై 5న నిర్వహించిన రిఫరెండంలో గ్రీసు ప్రజలు తిరస్కరించారు. రిఫరెండంలో 61 శాతం మంది ప్రజలు షరతులను తిరస్కరించగా, 39 శాతం మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. బెయిలవుట్ ప్యాకేజీని కొనసాగించేందుకు ఈయూ, ఐఎంఎఫ్‌లు కఠిన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, వ్యయ నియంత్రణ చర్యలు వంటి షరతులను విధించాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న గ్రీసు జూన్ 30 నాటికి ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయిలను చెల్లించలేక డీఫాల్ట్ అయింది.
ఎస్‌ఎంఎస్‌ల ఆలోచన రూపకర్త మృతి
మొబైల్ నెట్‌వర్క్ ద్వారా ఎస్‌ఎంఎస్ సమాచారం పంపే ఆలోచనను అభివృద్ధి చేసిన మట్టి మెకోనెన్ (63)లండన్‌లో జూన్ 26న అనారోగ్యంతో మరణించారు. ఫిన్‌లాండ్‌కు చెందిన మెకోనెన్ అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎస్ సాంకేతికతకు నోకియా సంస్థ ప్రాచుర్యం కల్పించింది. 1994లో ‘నోకియా 2010’ మోడల్ ఫోన్‌లో తొలిసారి ఎస్‌ఎంఎస్ సౌకర్యం కల్పించింది.
రాష్ట్రీయం
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్ రాష్ట్రంలో మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుట్టే హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జూలై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కను నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుంచి 33కు పెంచుతారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచుతారు. చెరువు గట్లు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచుతారు. కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా ప్రభుత్వం చేపడుతోంది.
ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావు రాసిన ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో జూలై 3న ఆవిష్కరించారు. విద్యాసాగరరావు గతంలో వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
అవార్డులు
సర్ ఫాజల్ హసన్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్
బంగ్లాదేశ్‌కు చెందిన సర్ ఫాజల్ హసన్ అబెద్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను వాషింగ్టన్‌లో జూలై 1న ప్రకటించారు. అబెద్ బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, మానవాభివృద్ధికి దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. ఆ సంస్థ 10 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆకలి బాధలు తొలగించేందుకు, ఆహార భద్రత సాధించడంలో కృషిచేసిన వ్యక్తులకు అందిస్తున్నారు.
పాల్ సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం
భారతీయ అమెరికన్ ఆర్.పాల్ సింగ్‌కు ప్రపంచ వ్యవసాయ పురస్కారం లభించింది. లెబనాన్‌లో 2015 జూన్ చివరి వారంలో జరిగిన వ్యవసాయ, జీవన ప్రమాణ శాస్త్రాలకు చెందిన ఉన్నత విద్యా సంఘాల ప్రపంచ సమాఖ్య-2015 సమావేశంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. పాల్ సింగ్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు. విద్యుత్తు పొదుపు, ఆహార ఉత్పత్తుల సంరక్షణ, పంటల కోతల అనంతర టెక్నాలజీ వంటి అంశాలలో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.
సామాజిక, ఆర్థిక, కుల గణన-2011 విడుదల
Published Thu, Jul 9 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement