పట్టణీకరణ-పరిణామాలు | India mainly poverty unemployment | Sakshi
Sakshi News home page

పట్టణీకరణ-పరిణామాలు

Published Thu, Nov 5 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

India mainly poverty unemployment

స్వాతంత్య్రానంతరం భారత్ ప్రధానంగా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటుతనం వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ సైన్స్  అండ్ టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించే భారత్‌లో ప్రైవేటు రంగం అభివృద్ధి చెందింది. దీని ఫలితంగా దేశంలో పట్టణీకరణ వేగవంతమైంది.
 
 1901 జనాభా లెక్కల ప్రకారం భారత్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 11.4 శాతంగా ఉంది. ఇది 2001 నాటికి 28.53 శాతానికి, 2011 నాటికి 31.6 శాతానికి పెరిగింది. స్వాతంత్య్రానంతరం దేశ స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గగా పారిశ్రామిక, సేవారంగాల వాటా క్రమేణా పెరుగుతూ వెళ్లింది. 1941 తర్వాత నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో వృద్ధి అధికమైంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తద్వారా భారత్‌లో ఆర్థికవృద్ధి పెరగటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. పబ్లిక్ రంగంలో వృద్ధి కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా, రోడ్లు, వాటర్ సప్లై, విద్యుత్ వంటి అవస్థాపన సౌకర్యాలు మెరుగయ్యాయి.
 
 ప్రపంచబ్యాంకు-పట్టణీకరణ
 ఆర్థికవృద్ధి ప్రక్రియలో పట్టణీకరణ భాగమని ప్రపంచబ్యాంకు పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థలో పట్టణ ప్రాంతాల భాగస్వామ్యం విస్మరించలేనిది. భారత్ ఆర్థిక ఉత్పత్తిలో నగరాల వాటాను 2/3గా ప్రపంచబ్యాంకు పేర్కొంది. పెరుగుతున్న జనాభాకు ఆశ్రయం కల్పించటం, నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించటం వంటి అంశాల్లో భారత్‌లోని నగరాల పాత్రను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పట్టణ జనాభా 377 మిలియన్ల (2011లో) నుంచి 590 మిలియన్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అవసరాల కారణంగా భారత్‌లోని గ్రామీణ జనాభా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీంతో భారత్‌లోని పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రపంచబ్యాంకు పేర్కొంది. 2050 నాటికి భారత్‌తో పాటు చైనా, ఇండోనేసియా, నైజీరియా, అమెరికాలలో పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంది.
 
 ప్రపంచ పట్టణ జనాభా
 ఒక అంచనా ప్రకారం 2011-50 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభా 3.6 బిలియన్ల నుంచి 6.3 బిలియన్లకు పెరగనుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. 2020 నాటికి ఆసియాలో సగం జనాభా, 2035 మధ్యనాటికి ఆఫ్రికాలో సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం 2011-30 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభాలో 1.4 బిలియన్ల పెరుగుదల ఉండనుంది. ఈ మొత్తంలో చైనా వాటా 279 మిలియన్లు కాగా భారత్ వాటా 218 మిలియన్లుగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా పెరుగుదలలో భారత్ వాటా 15.5 శాతానికి పైగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి 2012లో తెలిపింది.
 
 పట్టణ జనాభా పెరుగుదలకు ముఖ్యకారణాలు
 1. పట్టణ ప్రాంత జనాభాలో సహజ పెరుగుదల
 2. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తిరిగి వర్గీకరించటం
 3. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నికర వలసలు
 
 ఉపాధి రహిత వృద్ధి
 భారత్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అధికంగా నమోదవుతుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఉపాధి రహిత వృద్ధిని చవిచూశాయి. గత దశాబ్దకాలంలో స్థూలదేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధి 5 శాతానికి పైగా నమోదైంది. అదే సమయంలో ఉపాధివృద్ధిలో పెరుగుదల స్వల్పంగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయరంగంలో 23.3 మిలియన్లు, తయారీ రంగంలో 4.02 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారు. ఇతర రంగాల్లో కొత్తగా 1.74 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 1999-2000, 2009-2010 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో (గ్రామీణ మహిళలు మినహా) నిరుద్యోగిత రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది.
 
  అల్ప ఉద్యోగిత రేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. భారత్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగిత రేటు శ్రామిక మార్కెట్ స్థితి, ఉపాధి అవకాశాలను కచ్చితంగా స్పష్టపరచటం లేదు. 2011లో ఎన్‌ఎస్‌ఎస్‌వో నిర్వహించిన సర్వే ప్రకారం పురుషులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.9 శాతం, మహిళలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.5 శాతం మంది అదనపు పని కోసం ఆసక్తి ప్రద ర్శించారు.
 
 ఈ సర్వేలో శ్రామికుల్లో అనేక మంది ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా తగినంత ప్రతిఫలం లభించటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. 2005-06లో భారత ప్రభుత్వం ప్రారంభించిన జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ రెన్యువల్ మిషన్ కింద కేంద్రీకృత ప్రణాళికలో భాగంగా మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ పట్టణ సంబంధాలు మెరుగయ్యాయి.
 
 పట్టణ జనాభా
 భారత్‌లోని మొత్తం పట్టణ జనాభాలో 2011 లెక్కల ప్రకారం మహారాష్ట్రకు 13.5 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 11.8 శాతం, తమిళనాడుకు 9.3 శాతం వాటా ఉంది. 2011లో పట్టణ ప్రాంతాల్లో 377 మిలియన్ల మంది నివసించగా, ఒక మిలియన్ జనాభాకు పైగా ఉన్న నగరాల్లో 43 శాతం మంది నివసిస్తున్నారు. 2001లో మిలియన్ జనాభా గల నగరాలు సంఖ్య 35 ఉండగా, 2011 నాటికి 53కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, కేరళల్లో చెరో 7 నగరాలు, మహారాష్ట్రలో ఆరు నగరాలు ఉన్నాయి. 53 పట్టణ పరిధి కలిగిన ప్రాంతాల్లో మూడు అతిపెద్ద మెగాసిటీలు (పది మిలియన్లకు పైగా జనాభా గల ప్రాంతాలు)గా గ్రేటర్ ముంబై (18.4 మిలియన్లు), ఢిల్లీ (16.3 మిలియన్లు), కోల్‌కతా (14.1 మిలియన్లు)లు నిలిచాయి. జనాభా పరంగా చెన్నై 8.7 మిలియన్లు, బెంగళూరు 8.5 మిలియన్లు కలిగి ఉన్నాయి. పది మిలియన్ జనాభాపైగా గల నగరాల్లో జనాభివృద్ధి, 2001-2011 మధ్యకాలంలో తగ్గింది. గ్రేటర్ ముంబై పట్టణ పరిధి జనాభివృద్ధి 1991-2001 మధ్య 30.47 శాతం కాగా, 2001-2011 మధ్య 12.05 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి ఢిల్లీ పట్టణ పరిధి జనాభివృద్ధి 52.24 శాతం నుంచి 26.69 శాతానికి తగ్గింది. కోల్‌కతాలో 19.60 శాతం నుంచి 6.87 శాతానికి తగ్గింది.
 
 పట్టణీకరణ పెరగటానికి కారణాలు
 పట్టణీకరణ భారతీయ సమాజంలో సాధారణ లక్షణంగా కనిపిస్తుంది. పరిశ్రమల సంఖ్యలో వృద్ధి కారణంగా నగరాల సంఖ్య పెరిగింది. పారిశ్రామికీకరణ ఫలితంగా ప్రజలు ఉపాధి కోసం పారిశ్రామిక ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా పట్టణాలు, నగరాల సంఖ్య పెరుగుతోంది. పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను విస్తృతపరిచింది. దీంతో పట్టణ జనాభా పెరుగుతూ వెళ్తోంది.
 
 సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్య సౌకర్యాల అందుబాటు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లభ్యత కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.గ్రామీణ ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడాలి. భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో వలసలు పెరిగాయి.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుతో పాటు మెరుగైన అవస్థాపనా సౌకర్యాల అందుబాటు కారణంగా సౌకర్యవంతమైన జీవనం సాగించవచ్చనే అభిప్రాయంతో గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు.
 
 పట్టణాలు, నగరాల సంఖ్య ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు గ్రామీణ సమాజం పట్టణ సంస్కృతిని అలవర్చుకుంటోంది. పట్టణ ప్రజల వాణిజ్య సంస్కృతిని అవలంబించటం గ్రామీణ సమాజంలో కనిపిస్తోంది. విద్యావ్యాప్తి కారణంగా అక్షరాస్యత రేటు పెరిగి, గ్రామీణ ప్రజల్లో ఆధునికత పెరిగింది.
 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం.
 మహిళల్లో ఆలోచనా పరిజ్ఞానం పెరగటం.
 ఆధునిక రవాణా, సమాచార సౌకర్యాల పెరుగుదల.
 రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనటం.
 బ్యాంకులు, అనేక విత్త సంస్థలు అందుబాటులో ఉండటం.
 గ్రామీణ వినియోగదారుల్లో అవేర్‌నెస్ పెరగటం.
 అధునాతన వస్తు ఉత్పత్తులకు డిమాండ్.
 
 భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటంలో భాగంగా పట్టణీకరణ లక్ష్యాన్ని పదకొండో ప్రణాళికలో ఎంచుకోవటం. సంస్కరణల అమలు కాలంలో ప్రైవేటురంగ ప్రాధాన్యత పెరగటంతో పాటు ప్రైవేటు రంగ పెట్టుబడులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమవటం.
 దేశవిభజన సమయంలో ప్రజల వలస.
 సహజంగా పట్టణ జనాభా పెరగటానికి మరణరేటు తగ్గుదలతోపాటు జననాల రేటు ఎక్కువగా ఉండటం కారణమైంది.
 
 పట్టణీకరణ ప్రభావం
 
 ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ అంశాలు పట్టణీకరణపై ప్రభావం చూపుతాయి. సామాజికంగా, సాంస్కృతికంగా మీడియా పట్టణీకరణను ప్రోత్సహిస్తోంది.
 పెద్ద నగరాల్లో చెత్త పెద్ద సమస్యగా నిలిచింది. వాయు, నీటి, ధ్వని కాలుష్యం వంటి సమస్యలు పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలుగజేస్తాయి.
 మురికివాడలు పెరగటంతోపాటు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెరిగి ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది.
 అధిక పట్టణీకరణ కారణంగా నేరాల రేటు పెరుగుతోంది. నేరాల రేటు పెరుగదలకు పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ వైఫల్యం కారణమవుతోంది.
 
 పట్టణీకరణ ప్రయోజనాలు
 ఆర్థికవ్యవస్థలో వృద్ధిరేటు పెరుగుదల.
 వాణిజ్యకార్యకలాపాల్లో వృద్ధి.
 సాంఘిక, సాంస్కృతిక సమన్వయం (ఇంటిగ్రేషన్).
 సమర్థమైన సేవల అందుబాటు.
 వనరుల అభిలషణీయ వినియోగం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement