నిడమర్రు: ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞాన సంపదను ‘భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ’ ద్వారా పొందవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఖరగ్‌పూర్ ఐఐటీ సమన్వయంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకూ అవసరమైన విలువైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలు, ఉమ్మడి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం.
70 భాషల్లో..జాతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా ఒక్క క్లిక్‌తో విలువైన విద్యా సంబంధిత సమాచారం ఎప్పుడైన ఎక్కడైనా చాలా సులువుగా పొందవచ్చు. ఈ విజ్ఙాన సంపదను 70 భాషల్లో 60 పైగా అంశాలపై 15 లక్షల ఈ– బుక్స్, వేలాది వీడియో పాఠాలు, 10 వేలకు పైగా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ తరగతులు, 2 లక్షల ఆడియో పాఠాలు, టెక్నాలజీ, సైన్స్, వ్యవసాయం, విలువలతో కూడిన విద్య వంటి ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ’టెక్నికల్ రిపోర్ట్స్, మోనోగ్రాఫ్, టెక్నికల్ మాన్యువల్, ఆల్బమ్స్, న్యాయ శాస్త్ర తీర్పులు వంటివి పలు డాక్యుమెంట్స్, వీడియోలు, సాఫ్ట్‌వేర్ రూపంలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంగ్లభాషపై పట్టు సాధించొచ్చు..ఆంగ్ల భాషకు సంబంధించిన సంప్రదాయ పద్ధతులు, స్పీకింగ్ లెర్నింగ్, ఉచ్ఛారణకు సంబంధించిన ఆడియో/వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. భారత విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఈ స్టడీ మెటేరియల్ బాగా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు రాసే జీఆర్‌ఏ, టోఫెల్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి ఈ లైబ్రరీలోని ఈ– బుక్స్ చాలా ఉపయోగకరం..ఎన్నో భాషల్లో ..పలు భారతీయ భాషల్లో టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రం, గణితం, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన పాఠ్యాంశాలు, సైకాలజీ, తత్వశాస్త్రం, సోషల్ సైన్స్, రిలీజియన్, చరిత్ర, భూగోళ శాస్త్రాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు, రికార్డ్స్, వీడియోలు, ప్రాక్టికల్స్ ఈ లైబ్రరీ ద్వారా పొందవచ్చు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకూ హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన ప్రతి పుస్తకం ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ – గ్రంథ్ నుంచి 50 వేలకు పైగా వ్యవసాయ రంగానికి సంబంధిత ఈ– బుక్స్, ఆర్టికల్స్, శాస్త్రవేత్తల కథనాలు పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ ఇలా..భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు పొందాలంటే జ్టి్టpట://జీnఛీ .జీజ్టీజుజp.్చఛి.జీn అనే వెబ్‌సైట్‌లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ– మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చెయ్యాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకునేందుకు మీ ఈ–మెయిల్ ఇన్‌బాక్స్‌కి ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఇలా మీరు జాతీయ డిజిటల్ లైబ్రరీ సేవలు ఉచితంగా పొందవచ్చు.