డిసెంబర్ 7 నుంచి సైన్స్ ఫెస్టివల్
హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని యువతకు పరిచయం చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు.
ఢిల్లీలో డిసెంబరు 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ సైన్స్ ఫెస్టివల్ జరగనుందని హైదరాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. దేశ రాజధానిలో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు, యువతకూ దగ్గర చేసే లక్ష్యంతో ఎన్‌జీఆర్‌ఐ కూడా ఈ నెల 15వ తేదీ ‘ఓపెన్ డే’ పేరుతో అలాంటి కార్యక్రమాన్నే నిర్వహించనుందని వివరించారు.
ఇందులో భాగంగా శాస్త్రవేత్తలతో విద్యార్థుల ముఖాముఖి, సైంటిఫిక్ వర్క్‌షాపులు ఉంటాయని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుక్కునేందుకు జాతీయస్థాయిలో విద్యార్థుల కోసం పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తామన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని తివారీ తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.