india international science festival
-
వరిలో కలుపు తీసే పరికరం
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు. సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. ‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’ కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు. ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు. సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు. ఇది మూడో ఆవిష్కరణ అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు. అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు. – కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా -
చంద్రయాన్–2 విఫల ప్రాజెక్టు కాదు
కోల్‌కతా: ‘చంద్రయాన్–2’ విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ను ఉద్దేశించి మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశ శాస్త్రవేత్తలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలను ప్రపంచానికి భారత్ అందించిందన్నారు. ‘చంద్రయాన్ 2 ప్రయోగంలో మన శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. పూర్తిగా మనం ఆశించినట్లుగా జరగకపోయినా.. ఆ ప్రయోగం విజయవంతమైన ప్రాజెక్టే. భారతదేశం సాధించిన శాస్త్ర, సాంకేతిక విజయాల్లో చంద్రయాన్ 2 కూడా ఒక కీలకమైన విజయంగా కచ్చితంగా నిలుస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగుతున్న చివరి క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ‘శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పడుతుంది. అందుకు ఓపికగా ఎదురుచూడాలి’ అని సూచించారు. సైన్స్ లో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. ‘గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు. కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయి’ అన్నారు. అంతర్జాతీయ నిబంధనలు, ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రయోగాలు చేపట్టాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. -
జ్ఞానాన్ని సంపదగా మార్చాలి
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: జ్ఞానాన్ని సంపదగా మార్చడం దేశానికి అత్యవసరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మార్పు నకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోమవారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2018 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో రైతులను ఇంధన వనరుల ఉత్పత్తి వైపు మళ్లిస్తే అటు దేశానికి చమురు దిగుమతుల భారం తగ్గడం మాత్రమే కాకుండా, రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇథనాల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నారు. వెదురు, ఇతర ఆహారేతర వనరుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి ద్వారా రైతులు లబ్ధి పొందాలని సూచించారు. తగిన సాంకేతికత అందుబాటులో ఉంటే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో కేంద్రమంత్రిగా తాను తీసుకున్న చర్యల వల్ల దేశానికి వందల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే ‘సైన్స్ ఇండియా’ వెబ్‌సైట్‌ను గడ్కరీ ఆవిష్కరించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై విజ్ఞాన్’ జోడిస్తే.. ఇప్పుడు దీనికి ‘జై అనుసంధాన్’ కూడా చేర్చాలని సూచిం చారు. పాఠశాలలు, విద్యార్థులు నేరుగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భాస్కర్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సైన్స్ కుంభమేళా.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ఫలాలను దేశం నలుమూలలకు చేర్చే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ ఎఫ్) సంబరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా ఈ నెల 5న మొదలైన ఈ ఉత్సవాలకు సుమారు 13 వేల మంది హాజరైనట్టు అంచనా. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2,300 కాగా, మిగతావారిలో ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలు ఉన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాయు కాలుష్యం, శాస్త్ర ప్రపంచంలో మహిళల పరిస్థితి వంటి 23 అంశాలపై చర్చలు జరిగాయి. సీఎస్ఐఆర్, డీఆర్డీవో, వేర్వేరు ప్రభుత్వ సంస్థలు ఆయా రంగా ల్లో సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐఐఎస్ఎఫ్ ఉత్సవాలను వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
లక్నో విద్యార్థుల గిన్నిస్ రికార్డ్
లక్నో: సుమారు 550 మంది విద్యార్థులు ఏక కాలంలో అరటి పండు నుంచి డీఎన్ఏను వేరు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇండియా ఇంటర్నేషన్ సైన్స్ ఫెస్టివల్లో (ఐఐఎస్ఎఫ్ 2018)లోభాగంగా వీరు ఈ ఘనత సాధించారు. లక్నోకు చెందిన జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్‌కు చెందిన 13–17 ఏళ్ల విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేశారు. శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనుగుణంగా స్లైడర్స్‌తో 61 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. గతంలో అమెరికాకు చెందిన 302 విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఎన్బీఆర్ఐ డైరెక్టర్ ఫ్రొఫెసర్ ఎస్.కె బారిక్, బయోటెక్ పార్క్ సీఈఓ ప్రమోద్ టాండన్‌లు చిన్నారుల ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డు నిర్ణేత రిషీనాథ్ 550 మంది విద్యార్థులకు ధ్రువపత్రాన్ని అందజేశారు. -
సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకం
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: యుగాలుగా గణితం మొదలుకొని లోహ శాస్త్రం వరకూ అనేక శాస్త్ర రంగాలపై తనదైన ముద్ర వేసిన భారతదేశం.. రేపటి తరం టెక్నాలజీలను అం దుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విజ్ఞానాన్ని సృష్టించే సంస్థలు కృషి, భాగస్వామ్యం కూడా అత్యవసరమని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐఐఎస్ఎఫ్ సమావేశాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కుంభమేళాగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమానికి శీతలీకరణ పరిజ్ఞానం సాయపడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో ఎంత పురోగతి సాధిస్తున్నా మౌలిక శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు లో 100 గిగావాట్ల వరకూ ఉండే సౌరశక్తి సద్వినియోగానికి కూడా వినూత్న టెక్నాలజీ సాయపడుతోందని వెల్లడించారు. మహిళా ప్రాతినిధ్యం పెరగాలి..:దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నా.. ఇందులో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. సైన్స్‌కు ఎల్లలు లేవని, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. డీఎన్ఏను వేరు చేయడం ద్వారా రికార్డు గిన్నిస్‌లో స్థానం సాధించిన లక్నో విద్యార్థులు లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. జీవమున్న ప్రతి ప్రాణిలో ఉండే డీఎన్ఏను 550 మంది విద్యార్థులు ఏకకాలంలో వేరు చేయడం ద్వారా ఈ రికార్డు ఏర్పడింది. గతేడాది అమెరికాలోని సియాటిల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్లో 302 మంది విద్యార్థులు ఓ పండు నుంచి డీఎన్ఏను వేరు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్ నమోదు చేయగా.. ఈసారి 500కు పైగా ఈ ప్రయత్నం చేసి విజయం సాధించారు. లక్నో శివార్లలోని జి.డి.గోయాంక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన రిషినాథ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రయోగం మొదలు కాగా.. ఫలితం వెల్లడయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 550 మంది విద్యార్థులను 13 గుంపులుగా విభజించి ఈ ప్రయోగం నిర్వహించారు. ముందుగా అందించిన కిట్లు, అరటిపండు ముక్కలతో విద్యార్థులు ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల నిశిత పరిశీలన తర్వాత కొత్త గిన్నిస్ రికార్డు స్థాపితమైనట్లు రిషినాథ్ ప్రకటించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, విజ్ఞాన భారతిల పేరుతో ఈ రికార్డు నమోదైంది. -
నేటి నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడంతో పాటు, శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ సాధించిన ఘన విజయాలను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తమిళనాడు లోని చెన్నైలో 4 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి సుజనా చౌదరి, దేశ, విదేశాల్లోని శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఐఐటీ మద్రాస్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రుల సదస్సు నిర్వహించ నున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అన్నా వర్సిటీలో యువ శాస్త్రవేత్తల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్లో పార్లమెంట్ టు పంచాయత్, మహిళా సదస్సు, అన్నా వర్సిటీలో శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు ఉంటుందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ విజయాల ప్రదర్శన అన్నా వర్సిటీలో జరుగుతుంది. -
డిసెంబర్ 7 నుంచి సైన్స్ ఫెస్టివల్
హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని యువతకు పరిచయం చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు. ఢిల్లీలో డిసెంబరు 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ సైన్స్ ఫెస్టివల్ జరగనుందని హైదరాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. దేశ రాజధానిలో జరిగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు, యువతకూ దగ్గర చేసే లక్ష్యంతో ఎన్జీఆర్ఐ కూడా ఈ నెల 15వ తేదీ ‘ఓపెన్ డే’ పేరుతో అలాంటి కార్యక్రమాన్నే నిర్వహించనుందని వివరించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలతో విద్యార్థుల ముఖాముఖి, సైంటిఫిక్ వర్క్‌షాపులు ఉంటాయని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుక్కునేందుకు జాతీయస్థాయిలో విద్యార్థుల కోసం పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తామన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను గత ఏడాది నుంచి నిర్వహిస్తున్నామని తివారీ తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.