
కోల్‌కతా: ‘చంద్రయాన్–2’ విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ను ఉద్దేశించి మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశ శాస్త్రవేత్తలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలను ప్రపంచానికి భారత్ అందించిందన్నారు. ‘చంద్రయాన్ 2 ప్రయోగంలో మన శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. పూర్తిగా మనం ఆశించినట్లుగా జరగకపోయినా.. ఆ ప్రయోగం విజయవంతమైన ప్రాజెక్టే. భారతదేశం సాధించిన శాస్త్ర, సాంకేతిక విజయాల్లో చంద్రయాన్ 2 కూడా ఒక కీలకమైన విజయంగా కచ్చితంగా నిలుస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగుతున్న చివరి క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ‘శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పడుతుంది. అందుకు ఓపికగా ఎదురుచూడాలి’ అని సూచించారు. సైన్స్ లో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. ‘గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు. కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయి’ అన్నారు. అంతర్జాతీయ నిబంధనలు, ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రయోగాలు చేపట్టాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment