వరిపొలంలో కలుపుతీస్తున్న అశోక్, అశోక్ రూపొందించిన పరికరం ఇదే
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు.
సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు.
‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’
కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు.
ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు
కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు.
సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు.
ఇది మూడో ఆవిష్కరణ
అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు.
అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు.
– కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment