ఇంటింటికీ గంగాజలం
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. జనం వద్దకు గంగాజలం తీసుకువచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇంటింటికీ గంగాజలాన్ని సీసాల్లో అందించే పథకానికి శ్రీకారం చుడుతోంది. గంగానదీ జలాన్ని శాస్త్రీయపద్ధతిలో శుద్ధి చేసి సీసాల్లో నింపి కోరినవారి ఇంటికే బట్వాడా చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ బాట్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చే సేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ప్రేరణ కలిగించింది మాత్రం ఇటీవలి గోదావరి పుష్కరాలే కావటం విశేషం.
‘గాడ్‌జల్’ సూపర్ సక్సెస్‌తో...: జూలై 14 నుంచి 25 వరకు జరిగిన గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని తపాలాశాఖ గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి ‘గాడ్‌జల్’ పేరుతో కోరిన వారికి అందజేసింది. పుష్కరాలకు వెళ్లలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, దూరభారాన్ని మోయలేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని నిర్ణయించి తపాలాశాఖ ఏపీ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) ఈ ఆలోచన చేసింది. ఇందుకోసం రాజమండ్రిలోని ఓ చిన్న బాట్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీనికి అనూహ్య స్పందన లభించింది.
పుష్కరాలు మొదలయ్యేనాటికి ఏడున్నర లక్షల మంది ఆర్డర్ నమోదు చేసుకున్నారు. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా ఒత్తిడి రావటంతో ఆన్‌లైన్ ఆర్డర్లకు అవకాశం క ల్పించారు. గోదావరి పుష్కర నీటికి వచ్చిన డిమాండ్‌తో తపాలా శాఖకు కొత్త ఆలోచన తట్టింది. దేశవ్యాప్తంగా పుణ్యజలంగా భావించే గంగాజలాన్ని ఇంటింటికీ సరఫరా చేయాలని భావించింది. దీంతో గంగానది ప్రారంభమయ్యే గంగోత్రి వద్ద నీటిని సేకరించి శుద్ధి చేసి సీసాల్లో నింపి విక్రయించాలని నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో చర్చించి సంయుక్తంగా సొంత ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే నిరంతరాయంగా వాటిని సరఫరా చేయొచ్చని భావిస్తోంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్రముఖ్యమంత్రితో త్వరలో తపాలాశాఖ అధికారులు భేటీ కాబోతున్నారు. తపాలాశాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా ఉన్న సుధాకర్ త్వరలోనే తపాలాశాఖ బోర్డు సభ్యుడిగా పదోన్నతిపై ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ గంగాజలం ప్రాజెక్టు బాధ్యతను ఆయన పర్యవేక్షించనున్నట్టు సమాచారం. ఆయనే స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. తపాలాశాఖ కేంద్రకార్యాలయం ముందు ఈ ప్రతిపాదనను ఉంచింది ఆయనే.