నింగికేగిన గళ యశస్వి
నేదునూరి మృతితో విషాదంలో మునిగిన సంగీతాభిమానులు
సర్కారు లాంఛనాలతో అంత్యక్రియలు తరలివచ్చిన ప్రముఖులు
విశాఖపట్నం-కల్చరల్: గాత్ర సంగీత నిధి నింగికెగసింది. కర్ణాటక సంగీతానికి వన్నెలద్దిన ఆ గళం శాశ్వతంగా మూగబోయింది. అన్నమయ్య, రామదాసు కీర్తనలు ఆలపించి జనం హృదయాంతరాళల్లోకి చొచ్చుకుపోయిన నేదునూరి కృష్ణమూర్తి మృతి సంగీతాభిమానులను విషాదంలో ముంచెత్తింది. శాస్త్రీయ సంగీత రంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఈ స్వరబ్రహ్మది గాత్ర సంగీతంలో విశిష్ట స్థానం. కర్ణాటక సంగీతం ఆంధ్రకు వెళ్లిపోయిందా అనేంత భావన కలిగిం చిన నేదునూరి నగరంలోని ఎంవీపీకాలనీలో స్వగృహంలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కట్టూ, బొట్టేకాదు..సంగీత పాండిత్యం,వ్యవహారం, భాషలో నమ్రతా అంతా సంప్రదాయాన్ని ప్రతిబిం బించిన ఈ స్వర మాంత్రికుడు మరణించారని తెలియగానే సంగీతప్రియులు దుఖసాగరంలో మునగిపోయారు.
ప్రభుత్వలాంఛనాలతో నేదునూరికి అంత్యక్రియులు
నేదునూరి భౌతికకాయానికి ప్రభుత్వం తరుపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు సోమవారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తరుపున మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, నేదునూరి ఇంటికి చేరి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నేదునూరికి తనకున్న అనుబంధాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గుర్తు చేసుకున్నారు. చావుల మదుం వద్ద ఉన్న శ్మశనావాటికలో నేదునూరి అంతక్రియులు జరిగాయి. శాసనమండలి చైర్మన్ డాక్టర్.ఎ. చక్రపాణి, వైస్‌చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, శాసనసభ్యులు పి.వి.జి.ఆర్.నాయుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,మాజీఎంపీ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర డాక్టర్.ఎస్. యువరాజ్,జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ పి. పూర్ణచంద్రరావు, మద్రాసు సంగీత అకాడెమీ కార్యదర్శి (చెన్నాయ్)పప్పుల వేణుగోపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణమూర్తి, డాక్టర్ పి.వి.రావు, ఏయూ విశ్రాంతి రెక్టార్ డాక్టర్. ఎ.ప్రసన్నకుమార్, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ కార్యదర్శి జిఆర్‌కె రాంబాబు,పేరాల బాలమురళీకృష్ణ తదితరులు నేదునూరి భౌతికకాయాన్ని సందర్శించి సంతపాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో సంగీతప్రియులు, అభిమానులు తరలి వచ్చారు.