విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించాలి
- ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన చేయాలి
- సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి
- విశ్వవిద్యాలయాల్లో సైన్స్ పరిశోధనను ప్రోత్సహించాలి
- తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సూచన
యూనివర్సిటీ క్యాంపస్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కల్పించాలని, సైన్స్ టీచర్లు ఈ బాధ్యత తీసుకోవాలని, ఇంటర్ వరకు మాతృభాషలోనే బోధన జరగాలని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ ప్రైజ్‌లు సాధించే శాస్త్రవేత్తలకు రూ. 100 కోట్ల నగదు బహుమతి అందిస్తా మని ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. మనదేశంలో పుణే, ముంబై ఐఐటీ, మద్రాస్‌లోని సత్యభామ వర్సిటీకి చెందిన విద్యార్థులు ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించారని, ఎస్వీయూ నుంచి ఎందుకు ఉపగ్రహాలను ప్రయోగించలేకపోయారని ప్రశ్నించారు.
భవిష్యత్‌లో ఎస్వీయూ విద్యా ర్థులు కూడా ఉపగ్రహాలను ప్రయోగించాలని, ఆ దిశగా ప్రభుత్వం వనరులు సమకూర్చాలని సూచించారు. మనదేశంలో ప్రధాన సమ స్యలైన పేదరికం, ఆకలి, అభద్రత, వ్యాధులకు సంబంధించిన నివారణపై శాస్త్రవేత్తలు పరి శోధనలు కొనసాగించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్ పరిశోధనలు ప్రోత్సహిస్తే నోబెల్ బహుమతులు సాధించ వచ్చని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళలకు ప్రాధాన్యత పెంచాలని, ప్రతి విశ్వవిద్యాలయం ఏడాదికి ఒకసారి సైన్స్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు.
అత్యంత ఖరీదైన బహుమతి గెలుచుకోండి
నోబెల్ సాధించే ఏపీకి చెందిన శాస్త్రవేత్తకు రూ. 100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటిం చారని, ప్రపంచంలో ఎక్కడా ఇంతఖరీదైన నగదు బహుమతి లేదని కేంద్ర మంత్రి వై.సుజనా చౌదరి పేర్కొన్నారు. బహుమతి సాధించే అంశం(బంతి) శాస్త్రవేత్తల కోర్టులోనే ఉందని, గట్టి ప్రయత్నం చేసి సాధించాలని పిలుపునిచ్చారు. ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగిన సైన్స్ కాంగ్రెస్‌కు 6 మంది నోబెల్ శాస్త్రవేత్తలు వచ్చారని, అనేక అంశా లపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా, బొజ్జల, ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు, ఎస్వీయూ వీసీ దామోదరం, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఉన్నత విద్యామండలి ముఖ్య కార్యదర్శి సునీతాదావ్రా పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విజ్ఞాన జ్యోతిని వచ్చే ఏడాది సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించే ప్రొఫెసర్ అచ్చుత సమంతాకు అందజేశారు.
డీఆర్‌డీవోకు బహుమతి
ఎస్వీయూలో సైన్స్ కాంగ్రెస్ సంబంధించి నిర్వహించిన మెగా ఎగ్జిబిషన్‌లో అన్నిటికన్నా ఎక్కువ ఆకట్టుకున్న డీఆర్ డీవో ప్రదర్శనకు బహుమతి లభించింది. డీఆర్‌డీవో సంస్థ అగ్ని, శౌర్య, ఆకాశ్ తదితర క్షిపణులతోపాటు పలురకాల అంతరిక్ష నౌకలు, మిస్సైల్స్‌ను ప్రదర్శిం చింది. వీటికి ఎక్కువ మంది ఆదరణ లభించడంతో ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త నాగేశ్వరరెడ్డి అవార్డు అందుకు న్నారు. ఈయన ఎస్వీయూ పూర్వ విద్యార్థి కావడం విశేషం. అలాగే ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డీఎస్‌టీ, విట్, నిట్, జీఐఎస్, మినస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు కూడా పలు అవార్డులు అందుకున్నాయి.