
సైన్స్ అభివృద్ధికి సహకరిస్తాం
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శనివారమిక్కడి బీజీఎస్ కళాశాలలో నిర్వహించిన ‘నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ రంగంలో అనేక అద్భుత విజయాలు సాధించిన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలకు అన్ని విధాలైన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పురోభివృద్ధికి గాను రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి చిన్నారులు అన్ని అంశాల్లోనూ ఎంతో శక్తి, సామర్థ్యాలను, చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. అంతేకాక విభిన్న అంశాలను తెలుసుకునేందుకు వారికి ఎక్కువ అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రవేశించిన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని దేశ అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక బయోటెక్నాలజీ రంగంలో అత్యుత్తమ ప్రగతిని సాధించిందని, అయినా ఇంకా అభివృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు మాట్లాడుతూ...సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సైన్స్ అంశాల్లో నైపుణ్యాలు సాధించిన చిన్నారులకు ఉత్తమ కెరీర్ అవకాశాలు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజ్ఞాన రంగ అభివృద్ధిని అనుసరించే దేశ అభివృద్ధి కూడా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్షవర్థన్, ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.