వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ (ఓఎస్‌టీపీ) సలహాదారుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ చారిత్రాత్మకమైంది. ఓఎస్‌టీపికీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్‌గా నామినేట్ చేసిన తొలి మహిళ, వలసదారు ప్రభాకర్ అని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది.
దీనికి సెనేట్ ఆమోదం లభిస్తే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకర్. అలాగే బైడెన్ సర్కార్‌లో పనిచేయనున్న మూడవ ఆసియా అమెరికన్‌గా కూడా ఆమె నిలుస్తారు. ముఖ్య సలహాదారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌కు కో-చైర్‌గా, ప్రెసిడెంట్ క్యాబినెట్ సభ్యునిగా ఉంటారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ఇండో-అమెరికన్ ప్రభాకర్ చేరడం విశేషం. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఎరిక్ ల్యాండర్ రాజీనామా నేపథ్యంలో ప్రభాకర్‌ను ఈ పదవికి బైడెన్ నామినేట్ చేశారు.
తెలివైన, అత్యంత గౌరవనీయమైన ఇంజనీర్, గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని డాక్టర్ ప్రభాకర్‌ను అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ల ద్వారా అవకాశాలను విస్తరించేందుకు, కష్టతరమైన సవాళ్లను పరిష్కరించి, అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు భారతీయ అమెరికన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.
కాగా ప్రభాకర్ కుటుంబం ప్రభాకర్ మూడేళ్ల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లింది. మొదట చికాగోకు వెళ్లి ఆపై ఆమె 10 సంవత్సరాల వయస్సులో టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో స్థిరపడింది. ఆమె టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ. ఇక్కడే లక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ కూడా చేశారు. ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో కరియర్‌ను ప్రారంభిచారు. డాక్టర్ ప్రభాకర్ రెండు వేర్వేరు ఫెడరల్ ఆర్ అండ్‌డీ ఏజెన్సీలకు నాయకత్వం వహించారు. అనేక రంగాలలో స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ల్యాబ్‌లు, ఎన్‌జీవోతో కలసి పనిచేసి విశేష సేవలందించారు. ముఖ్యంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌టి)కి నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా ఆరతీప్రభాకర్. ఆ తరువాత డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment