సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల సేవే తన తొలి ప్రాథమ్యమని భారత నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (62) పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీ కావచ్చు, న్యాయ సంస్కరణలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రతి అంశంలోనూ సామాన్య పౌరుల ప్రయోజనాల పరిరక్షణకే అగ్రతాంబూలమిస్తా’’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. మంగళవారం సీజేఐగా రిటైరైన జస్టిస్ యు.యు.లలిత్ నుంచి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. దైవసాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, హర్‌దీప్‌సింగ్ పురి, కిరణ్ రిజుజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భార్య కల్పనా దాస్‌తో కలిసి నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించడం గొప్ప అవకాశం, బాధ్యత అని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కొనసాగేలా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా చేతల్లో చూపిస్తానని బదులిచ్చారు.
జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబరు 10 దాకా రెండేళ్లపాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 16వ సీజేఐగా చేసిన ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉండటం విశేషం. అత్యధిక కాలం సీజేఐగా ఉన్న రికార్డు ఆయనదే. తర్వాత 44 ఏళ్లకు ఆయన కుమారుడు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి కుమారులిద్దరూ సీజేఐ కావడం దేశంలో ఇదే తొలిసారి. జస్టిస్ చంద్రచూడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలంటూ వారిద్దరూ ట్వీట్ చేశారు.
జస్టిస్ చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్) అనంతరం ఢిల్లీ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం, డాక్టరేట్ ఇన్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎస్‌జేడీ) చేశారు. ఆయన ప్రస్థానం 1998లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా మొదలైంది. బాంబే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అదే ఏడాది అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2013 నుంచి మూడేళ్లపాటు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2016 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
చరిత్రాత్మక తీర్పులు
అయోధ్య భూ వివాదం, వ్యక్తిగత గోప్యత హక్కు, శబరిమలకు రుతుక్రమ మహిళల ప్రవేశం, అవివాహితలకూ 24 వారాల దాకా అబార్షన్ హక్కు తదితర కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్మీలో మహిళా ఆఫీసర్లకు పర్మినెంట్ కమిషన్, కమాండ్‌పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన సారథ్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇటీవల జస్టిస్ యు.యు.లలిత్ హయాంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం సభ్యుల అభిప్రాయాల సేకరణకు సర్క్యులేషన్లు జారీ చేసే పద్ధతిని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు.
అసమ్మతిని స్వాగతిస్తారు
అసమ్మతిని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా జస్టిస్ చంద్రచూడ్ అభివర్ణిస్తుంటారు. ఆధార్ చెల్లుబాటును ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించిన తీరు చాలాకాలం పాటు వార్తల్లో నిలిచింది. ఆధార్ చెల్లుతుందంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో మిగతా నలుగురు వెలువరించిన తీర్పుతో తీవ్రంగా విభేదించారు. యునిక్ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియను డిజిటైజ్ చేయడంలోనూ ఆయనది కీలకపాత్ర. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తి అని, ఏ అంశం మీదైనా స్పష్టమైన భావాలు కలిగి ఉంటారని, వాటిని అంతే సూటిగా వ్యక్తీకరిస్తారని పేరు.
తొలి రోజు ఇలా...
బుధవారం బాధ్యతలు స్వీకరించాక మధ్యాహ్న వేళ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులోని సీజేఐ కోర్టు గదిలోకి ప్రవేశించారు. ‘‘ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా బహుశా నా కెరీర్లో తొలిసారి ఆలస్యంగా విధులకు వచ్చాను. మళ్లీ ఇలా జరగదనుకుంటున్నా. ఇంతసేపూ లాయర్లు తదితరులందరినీ వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా’’ అన్నారు.
వాదనలు, కేసుల నిర్వహణల్లో లాయర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తానన్నారు. భవిష్యత్తులో కూడా బార్ సహకారం కొనసాగాలని కోరారు. సహచర న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కలిసి విచారణలు ప్రారంభించారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఆజం ఖాన్ అనర్హత కేసు సహా తొలి రోజు సీజేఐ ధర్మాసనం ముందు 30 ప్రస్తావనలు జరిగాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితర న్యాయవాదులు సీజేఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఫలవతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. దేశ చరిత్రలో తండ్రీకొడుకులిద్దరూ..
Comments
Please login to add a commentAdd a comment