ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్‌బైక్‌గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.
‘నియోమోషన్’ మోటర్‌బైక్
కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్‌నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్‌బైక్‌గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్‌చెయిర్‌బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.
వైకల్యం ఓ పెద్ద సవాలు..
ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్‌లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్‌మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.
సౌకర్యవంతంగా.. దృఢంగా..
ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్‌లో దొరికే వీల్‌చెయిర్‌లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
గంటకు 50 కి.మీ ప్రయాణం
నియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్‌బైక్‌గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.
నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..
అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్‌ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment