ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్‌ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.
తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి
‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
ఎవరికి అవసరం అంటే..
ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment