మాజీ సీఎం సలహాదారుపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సలహాదారు ప్రొఫెషర్ వీరేంద్ర సింగ్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. జాట్ల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, హింస పెరిగేలా రెచ్చగొట్టాలంటూ ఇటీవల జాట్ ఉద్యమ నాయకుడితో వీరేంద్ర సింగ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగు చూశాయి. అయితే ఫోన్ సంభాషణల్లో ఉన్నది తన గొంతేనని, తన మాటలను కత్తిరించి వేరే అర్థం వచ్చేలా రికార్డ్ చేశారని వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు.
రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింస వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరేంద్ర సింగ్ ఫోన్ సంభాషణలు బయటికి రావడం కలకలం రేపింది. హరియాణా పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షించాల్సి వుంది. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర సింగ్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.