నా సొంత కథను రాస్తున్నా.. | writing my own story, kanhaiah kumar told | Sakshi
Sakshi News home page

నా సొంత కథను రాస్తున్నా..

Published Fri, Mar 4 2016 9:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

జైలు నుంచి విడులైన అనంతరం జేఎన్ యూలో కన్హయ్య సందడి

జైలు నుంచి విడులైన అనంతరం జేఎన్ యూలో కన్హయ్య సందడి

'నేను ఇప్పుడు నా సొంత కథను రాస్తున్నా. జైలులోనే రాయడం ప్రారంభించా.  నిజానికి నేను భారత్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకోవట్లేదు. నా దేశంలో స్వేచ్ఛ కావాలంటున్నా. వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎన్ని భేదాభిప్రాయాలున్నా.. 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేసిన ప్రధానితో ఏకీభవిస్తా. ఏబీవీపీని శత్రువుగా కాకుండా ప్రతిపక్షంగానే చూస్తా. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను నేను గౌరవిస్తాను. దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. నిజాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. సత్యానిదే విజయమన్న నమ్మకం ఉంది' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్.

గురువారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన కన్హయ్యకు భారీగా వచ్చిన మద్దతుదారులు స్వాగతంపలికారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్ యూకు చేరకున్న అతనికి తోటి విద్యార్థులు, అధ్యాపకులు నీరాజనాలు పట్టారు. గంగా ధాబా నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికపై కన్హయ్య కుమార్ మాట్లాడుతూ తన సొంత కథను రాస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ కార్యక్రమం చేపట్టిన కారణంగా ఫిబ్రవరి 12న రాజద్రోహం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటోన్న కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసిన సంగతి తెలిసిందే.

కన్హయ్య గ్రామంలో సంబరాలు
కన్హయ్య విడుదలతో ఆయన స్వగ్రామంలో కుటుంబీకులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బీహార్‌లోని బిహత్ గ్రామంలో  సోదరులు తల్లిదండ్రులకు రంగులు పూశారు. గ్రామస్తులు 'కన్నయ్య అరెస్టైన తర్వాత మొదటిసారి ఆందోళన నుంచి ఉపశమనం దొరికింది' అంటూ తండ్రి జైశంకర్ సింగ్(61) సంతోషంగా చెప్పారు.  వెంటనే గ్రామానికి రావాలని కుమారుడ్ని కోరలేదని, జేఎన్‌యూకి వెళ్లి మద్దతుగా నిలిచిన విద్యార్థులతో గడుపుతాడని సింగ్ తెలిపారు.
 
అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
ఢిల్లీ అంతటా పోలీసు భద్రతను పటిష్టం చేశారు. జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ ప్రాంతాల్లో  అప్రమత్తంగా ఉండాలని కోరారు. విడుదల తర్వాత ఎఐఎస్‌ఎఫ్, ఎఐఎస్‌ఏ, రాజకీయ పార్టీలతో కలిసి కన్హయ్య జంతర్‌మంతర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో పర్యటించవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.
 
కన్హయ్యకు ఆప్ సర్కారు క్లీన్‌చిట్
జేఎన్‌యూ ఘటనలో కన్హయ్య ఏ తప్పు చేయలేదని ఢి ల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేసిన 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై పోలీసులకు అనుమానాలున్నాయని తెలిపింది. కన్హయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, వీడియోలు దొరకలేదని నివేదికలో పేర్కొంది. కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేస్తుండగా చూశామంటోన్న వ్యక్తులు, వారి పాత్రపై విచారణ నిర్వహించాలని అభిప్రాయపడింది.

కొన్ని వీడియోల్లో ఉమర్ ఖాలిద్ కనిపించాడని, అతని పాత్రపై మరింత విచారణ జరగాలని న్యూఢిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ తెలిపింది. ఉమర్, అనిర్బన్, అశుతోష్ లు అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా, కశ్మీర్‌పై నినాదాలు చేసినట్లు జేఎన్‌యూ భద్రతా సిబ్బంది చెప్పారంటూ నివేదికలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement