3 చానళ్లపై కేసులు
ఢిల్లీ సర్కారు నిర్ణయం
జేఎన్‌యూ వివాదంపై నకిలీ వీడియోల ప్రసారం
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ వివాదాస్పద కార్యక్రమంపై నకిలీ వీడియోలను ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్లపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు టీవీ చానళ్లు మార్పుచేసిన వీడియోలను ప్రసారం చేశాయంటూ మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన న్యాయబృందం సూచించిందని ఓ అధికారి ఒకరు చెప్పారు.
అయితే చానళ్ల పేర్లను ఢిల్లీ మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తన నివేదికలో పొందుపరచలేదన్నారు. ఫిర్యాదు ఆధారంగా సీఆర్‌పీసీ సెక్షన్ 200 ప్రకారం మేజిస్ట్రేట్ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మెజిస్టీరియల్ బృందం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఏడు వీడియో క్లిప్పింగులను పంపగా, అందులో మూడు బూటకమని తేలింది. ఆ వీడియోలను ఎడిట్ చేసి స్వరాన్ని జతచేసినట్లు నిర్ధారణ అయింది. కన్హయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు విచారణ బృందం ఎలాంటి ఆధారాలను కనుగొనలేదు. కాగా, అంతకుముందు ఈ టీవీ చానళ్లపై చర్య తీసుకోవాలంటూ సీపీఎం నేత సీతారాంఏచూరి, జేడీయూ నేత కేసీ త్యాగి సీఎం కేజ్రీవాల్‌ను కలసి డిమాండ్ చేశారు.
ఉమర్, అనిర్బన్‌ల విడుదలకు ఉద్యమిస్తా: రాజద్రోహం కేసు ఎదుర్కొం టూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యల విడుదల కోసం ఉద్యమిస్తానని కన్హయ్య చెప్పారు. అదే కేసుకు సంబంధించి కన్హయ్యకు ఇటీవలే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఆదర్శ్ అరెస్ట్.. కన్హయ్యను చంపినోళ్లకు రూ.11 లక్షలు రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు అతికించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. కాగా.. ఆదర్శ్ బ్యాంకు ఖాతాలో రూ.150 మాత్రమే ఉన్నట్లు తెలిసింది.
ఈ ముఖం బస్తర్ పోరుకు ప్రతిబింబం: సోనీ
న్యూఢిల్లీ: ‘నా ఈ ముఖం బస్తర్‌లో జరుగుతున్న పోరుకు ప్రతిబింబం’ అని గతనెలలో ఛత్తీస్‌లో యాసిడ్ తరహా రసాయనంతో దాడికి గురైన ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సొరీ అన్నారు. జేన్‌యూ విద్యార్థులకు ఆమె సోమవారం సంఘీభావం ప్రకటించారు. వర్సిటీలో ప్రసంగిస్తూ.. ‘నాది, కన్హయ్యది ఒకే పరిస్థితి. ఇద్దరం తప్పుడు కేసులతో జైలుకు వెళ్లాం. నన్ను నక్సలైట్ల మద్దతుదారునని ఆరోపించారు’ అని సోని పేర్కొన్నారు. కస్టడీలో ఉండగా తనను పోలీసులు లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.