హార్దిక్ పటేల్ కు బెయిల్
అహ్మదాబాద్: రాజద్రోహం కేసులో అరెస్టైన పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 9 నెలల తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు గతేడాది అక్టోబర్ లో అతడిని అరెస్టు చేశారు. బెయిల్ వచ్చినా హార్దిక్ జైల్లోనే ఉంటారని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు. అతడిపై ఇతర కేసులున్నాయని చెప్పారు.
పటేళ్ల ఉద్యమంలో భాగంగా.. అక్టోబర్ 3న తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఆత్మహత్యలు చేసుకోవటం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపండి’ అంటూ హార్దిక్ పటేల్ వ్యాఖ్యలు చేయడంతో అతడిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. సాధారణంగా.. రాజద్రోహం కేసులో కనీసం మూడేళ్లు.. గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడుతుంది.