రాజద్రోహం కేసులో సీనియర్ ఎడిటర్ అరెస్ట్
ఢాకా (బంగ్లాదేశ్): రాజద్రోహం కేసులో 81 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఎడిటర్‌ను శనివారం బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ బెంగాలీ మేగజైన్ మౌచకే దిల్‌కు ఎడిటర్ అయిన షఫిక్ రెహ్మాన్ గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు స్పీచ్ రైటర్‌గా పనిచేశారు. శనివారం తెల్లవారుజామున రిపోర్టర్లమంటూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికొచ్చి రహ్మాన్‌ను తీసుకెళ్లారని అతని భార్య తలేయా రెహ్మాన్ చెప్పారు.
కాగా, గతేడాది ఢాకాలో నమోదైన పెండింగ్ కేసు విషయంలో రహ్మాన్ అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా గతేడాది ప్రధాని హసీనా కుమారుడు, సమాచార ప్రసారాల సలహాదారుడు సజిబ్ వాజీద్ హత్యకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను మళ్లించేందుకే ఈ అరెస్ట్ చేసినట్లు బీఎన్‌పీ కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ విమర్శించారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, రహ్మాన్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.