భారత్‌కు మద్దతుగా.. అమెరికాపై రష్యా ఫైర్‌ | Russia slams US claims on Gurpatwant Pannun deceased plot | Sakshi
Sakshi News home page

పన్నూ ఎపిసోడ్‌.. భారత్‌కు మద్దతుగా అమెరికాపై మండిపడ్డ రష్యా

Published Thu, May 9 2024 8:51 AM | Last Updated on Thu, May 9 2024 1:02 PM

Russia slams US claims on Gurpatwant Pannun deceased plot

మాస్కో:  సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేసింది. పన్నూ హత్య కుట్రలో భారతీయుల ప్రమేయం ఉన్నట్లు  అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా వద్ద ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం, సాక్ష్యం లేదని మండిపడింది.

భారత అంతర్గత రాజకీయాల్లో అస్థిరత కలిగించాలని, ప్రస్తుతం భారత్‌లో జరగుతున్న సాధారణ ఎన్నికలను ప్రభావితం చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా ఆరోపణలు చేశారు.

‘‘భారత దేశ మనస్తత్వం, చరిత్ర గురించి అమెరికాకు సరిగా తెలియదు. అందుకే అమెరికా.. మత స్వేచ్ఛపై తరచూ భారత్‌పై ఆరోపణులు చేస్తోంది. భారత్‌లోని అంతర్గత, లోక్‌సభ ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. 

చదవండి: Gurpatwant Singh: భారత్‌- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?

ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అమెరికా భారత్‌ను గౌరవించటం లేదు. అంతర్జాతీయ అంశాల్లో అమెరికా జోక్యాన్ని ఊహించటమే చాలా కష్టంగా ఉంది’’ అని మరియా జఖారోవా అన్నారు. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని రష్యా మండిపడింది.

గత నవంబర్‌లో పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్‌కు చెందిన నిఖిల్‌గుప్తాకు ప్రమేయం ఉన్నట్లు యూఎస్‌ కోర్టు అభియోగాలు మోపిన విషయం తెలసిందే. అదేవిధంగా భారత్‌కు చెందిన రా(R&AW)అధికారికి పన్నూ హత్య కుట్రలో  ప్రమేయం ఉందని, ఆయన పేరు.. విక్రమ్‌ యాదవ్‌ అని ఇటీవల న్యూయార్క్‌ పోస్ట్‌ ఓ కథనంలో వెల్లడించగా.. భారత్‌ తీవ్రంగా ఖండించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement