పార్లమెంట్ సమావేశాల కోసం నిమిషానికి రూ. 2.6 లక్షల చొప్పున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాం. ఒక్కో సమావేశంపైన రూ.144 కోట్లు ‘కృష్ణార్పణం’ చేసుకుంటున్నాం. అయినా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఇక సభల్లో చర్చను తప్పించడానికి ద్రవ్య బిల్లులను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. దీనికి మరో అడుగు ముందుకేసి, ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనేలా చేస్తోంది పాలక పక్షం. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక నిర్వహించాలన్న పల్లవి ఎత్తుకుంది.
ఈ దేశమైన ‘దటీజ్ భారత్’లో పార్లమెంట్ (ఉభయ సభలు) రోజుకు ఎంతో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. అయినా కొలది రోజులనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పాలనా వ్యవస్థను, సెక్యులర్ రాజ్యాంగాన్ని ఆధునిక ‘నీరో’ చక్రవర్తులుగా తయారైన పాలకుల నుంచి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది! అంతే గాదు, ‘మనీ బిల్స్’ పేరిట రాజ్యసభ చర్చలను పక్కతోవ పట్టిస్తూ ‘పెద్దలు’ చేస్తున్న చిల్లర పనులను కూడా కనీస ప్రజాస్వామ్య పాలనా సూత్రాలను కాపాడుకోగోరే ప్రజలూ, ప్రజాస్వామ్య శక్తులూ కట్టడి చేయవలసిన తరుణం వచ్చింది!
సభ నిర్వహణ, సభ్యుల జీతనాతాలు, దినసరి ఎలవెన్సులు పేరిట 10–15 రోజులకు రూ. 144 కోట్లు అవుతోంది. కథ ఇంతటితో ముగియదు. భవిష్యత్తులో పార్లమెంటేరియన్లకు పెంచనున్న జీత నాతాల్ని కూడా లెక్క కట్టారు. ఈ లెక్క చూస్తే ‘నుయ్యి తియ్యబోతే దయ్యం బయట పడిందన్న’ సామెతలా నెలసరి జీతాలతో పాటు నియోజక వర్గ అలవెన్సులు, సెక్రటేరియట్ అలవెన్సులు, సభ్యుల కార్యాలయ అలవెన్సులు ఆ దామాషాలో పెరగాల్సిందే. ఎందు కంటే, ప్రజలు ఎన్నుకున్న పాపానికి సభ్యుడి నెల జీతంతో పాటు, ఖర్చులన్నీ తడిసి మోపెడవుతాయి. పార్లమెంట్ సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతున్నా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఈ సందర్భంలో ఒక కీలక ప్రశ్న తలెత్తింది. నెలసరి జీత నాతాలు పెంచుకునే సభ్యులు పార్లమెంటులో చర్చలు కొనసాగ కుండా అడ్డుకునే మార్గాలు కూడా చూస్తారని ఒకప్పుడు బీజేపీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి అరుణ్ జైట్లీయే అన్నారు!
రాజ్యసభలో ఇటీవల ‘మనీ బిల్స్’ చాటున పాలకులు కొన్ని చిల్లర మాటలకు దిగడం హాస్యాస్పదం! చర్చను తప్పించడానికి ఈ బిల్స్‌ను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనే అర్థం చేసుకోవాలట. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే ఇకనుంచి లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక అవసరమంటున్నారు బీజేపీ నాయకులు. 2014 నుంచి దాన్నే పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ పాలన ఉనికి మహారాష్ట్ర ప్రయోగంతో ఇబ్బందుల్లో పడిన దరిమిలా మరింత వేగంగా ముందుకు సాగుతున్నారని ప్రజలకూ అర్థమయ్యింది. కర్ణా టక బీజేపీ ప్రభుత్వ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని అత్యధిక లోక్‌సభ స్థానాలను జీవనాడిగా భావించుకుని ఉత్తర, దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలను కంట్రోల్ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న ఎత్తుగడలు బెడిసికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తర ప్రదేశ్‌లోని 85 పార్లమెంటు స్థానాల బెడద (ఉత్తరాఖండ్‌ను కూడా కలుపుకొని) గురించి ఏనాడో రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ పసిగట్టారు. అందువల్లే దక్షిణ భారత దేశానికి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండాలని ప్రతిపాదించారని మరచిపోరాదు! ఉత్తర ప్రదేశ్‌ను ఎలాగూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్ వర్గీ యులు త్యాగం చేయలేరు కాబట్టి, దక్షిణ తూర్పు రాష్ట్రాలకు ఎసరు పెట్టారు, మరింతగా పెడతారు! ఎలాగూ ‘పెగసస్’ గూఢ చర్యంతో దేశ విదేశాల్లో అభాసు పాలైన మన పాలకులకు ‘అన్యధా శరణం’ లేకనే మధ్యంతర ఎన్నికలకు తహతహలాడుతున్నారని గ్రహించాలి.
గుజరాత్‌లో మైనారిటీలపై తలపెట్టిన 2002 నాటి ఊచకోతలపై సమగ్రమైన విచారణ జరిపేందుకు తాను నియమించిన ప్రత్యేక విచారణ సంఘం (2008) సమర్పించిన నివేదికను విడుదల చేస్తూ, భారతదేశంలో మత సామరస్యం అనేది ప్రజాస్వామ్యానికి జీవశక్తి అని చెబుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది. ‘‘ఏ మతమూ ద్వేషాన్ని బోధించదు. మతం పేరిట ప్రజల్ని చంపు కోవడం యావత్తు దేశానికీ, చట్టబద్ధంగా నడుచుకోవలసిన సమాజా నికీ మాయని మచ్చ.’’ గుజరాత్ కేసుల్లాంటివి ఎక్కడ తలెత్తినా వాట న్నింటినీ తుదకంటా వెంటాడి ఒక కొలిక్కి తీసుకురావాల్సిందేనని చెప్పింది. ఆ ఆదేశం ప్రకారం రంగంలోకి దిగిన సుప్రీం ప్రత్యేక ఉన్నత సలహాదారైన న్యాయవాది రాజు రామచంద్రన్ గుజరాత్ సమర్పించిన సాధికార నివేదికను పాలక వర్గం తొక్కి పట్టడమే గాకుండా, దాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ, తనను తాను ‘కడిగిన ముత్యం’ అని చాటుకోవడానికి ప్రయత్నించింది!
గుజరాత్‌లో దళిత మైనారిటీలను ఊచకోతకోయగలిగిన వాళ్లకు ‘దళిత, ఆదివాసీ’ పదాలు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉద్దేశించిన ఊతపదాలు. కనుకనే ఈ ఎత్తుగడను పసిగట్టిన సుప్రసిద్ధ మేధావి, గోవా యూనివర్సిటీలో ‘డి.డి.కోశాంబి’ విజిటింగ్ ప్రొఫెసర్ పీటర్ రోనాల్డ్ డిసోజా ప్రత్యేక వ్యాసం రాస్తూ, ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి పదవికి బీజేపీ తమ అభ్యర్థిగా నామినేట్ చేయడాన్ని ‘తిరుగులేని దెబ్బగా’ వర్ణించారు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎదు ర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగానూ, ఒక్క తాటిపైకి గుమి గూడబోతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకుగానూ వేసిన ఎత్తుగడగా దీన్ని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వ్యవస్థలో ఈ రోజున కోర్టులలో, మీడియాలో, బ్యూరోక్రాట్లలో, యూనివర్సిటీలలో, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న అధికారగణంలో ఆదివాసీ ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడగల్గిన వారి సంఖ్య బహుస్వల్పమని ద్రౌపదీ ముర్మూకు తెలుసు. కానీ ఈ ఆదివాసీ జనాలనే అభివృద్ధి పేరిట, మౌలిక సదుపాయాల కల్పన పేరిట వివిధ నగరాల మురికి వాడల్లో కుక్కడం జరిగింది. తద్వారా దేశ సాంస్కృతికాభివృద్దికి కూడా వారిని దూరం చేశారు.
అదే సందర్భంలో రిజర్వేషన్ల పుణ్యమా అని దేశ శాసన వేదికలలో ఆ మాత్రమైనా స్థానం లభించే అవకాశం కల్గింది. కానీ పార్టీ రాజకీయాలు వచ్చి ఆదివాసీలు, దళితుల గొంతు నొక్కేశాయి. ‘ఇప్పుడు ఆదివాసీ అయిన ద్రౌపదీ ముర్మూ ఈ దగా పడిన ఆదివాసీలకు గొంతెత్తి మాట్లాడగల అవకాశం కల్పిస్తారా? ఒక స్త్రీగా, భర్తను కోల్పోయిన ఒక భార్యగా, ఒక ఆదివాసీగా అనుభవించిన కష్టనష్టాల దృష్ట్యా గర్వించదగిన ధృఢమైన రాజకీయ శక్తిగా తన ముద్రను వేయగలరా?’ అని ప్రొఫెసర్ డిసోజా ప్రశ్నించడం ఆసక్తకర చర్చగా మారింది. మరొక కీలకమైన అంశాన్ని లేవనెత్తుతూ... ముర్మూ రాజ్యాంగపరంగా తన అధికారాల పరిధిని పూర్తిగా వినియో గించుకోవాలి.
కేవలం రాష్ట్రపతి కార్యాలయ ప్రొటొకాల్ పరి«ధులకే అంటుకుపోయిన కొందరు పాత రాష్ట్రపతుల మాదిరిగా వ్యవహ రించకుండా రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్‌లా చొరవతో ముందుకు సాగాలని డిసోజా సలహా ఇచ్చారు. అంతేగాదు, రాష్ట్రపతిగా ఆమె తన ఐదేళ్ల పదవీకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి గురైన ఆదివాసీ ప్రజలున్న ప్రాంతాలను పర్యటిస్తే అదో ప్రయోజనకర చర్యే కాగల దనీ, ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, ఆసుపత్రులు, మార్కెట్లు, నీటి సౌకర్యాలు ఆమె స్వయంగా కళ్లారా చూస్తే అనుభవంలోకి రాగలవనీ డిసోజా అన్నారు.
అలాగే, దేశ రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి భవన్‌లో కూర్చోబెట్టడం ఎంతటి తిరుగులేని ఘటనో... అదే స్థాయిలో రాష్ట్రపతి భవన్‌ను ఆదివాసీ సంస్కృతితో ముర్మూ సంస్క రించడానికి ప్రయత్నిస్తారో లేక ఆమెను అదే భవన్ సంస్కృత భాషాభిమానిగా మారుస్తుందో చూడాలని డిసోజా వ్యంగ ధోరణిలో అన్నారు. ఏది ఏమైనా రానున్న ఐదేళ్లూ ద్రౌపదీ ముర్మూ తన పదవిలో ముళ్లమీద కూర్చోకుండా గడిపి గట్టెక్కిరాగలరనే ఆశిద్దాం.
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment