రాజకీయ వ్యవస్థలో నేరగాళ్ల తిష్ట | ABK Prasad Article On Criminals In Politics | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 12:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ABK Prasad Article On Criminals In Politics - Sakshi

‘బ్రూట్‌’ మెజారిటీ చాటున శాసన వేదికలను ప్రజావ్యతిరేక స్థావరాలుగా మలచుకోవడంలో... కాంగ్రెస్‌–యూపీఏ, బీజేపీ–ఎన్డీఏ పాలకపక్షాలు రెండూ సిద్ధహస్తులేనని అనేక స్కాండల్స్‌ నిరూపిస్తూ వచ్చాయని మరచిపోరాదు. ఇటీవలనే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ వీడ్కోలు సభలో మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పరిణామాలపట్ల స్పందించకుండా ‘మూగనోము’ (సైలెన్స్‌) పట్టి కూర్చునే న్యాయ నిపుణుల వల్లనే ఎక్కువ హాని వాటిల్లుతుందని, ఈ పరిస్థితి కొనసాగడం అమాయక ప్రజలపై హింసా చర్యలకన్నా పెద్ద నష్టానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

‘‘శీలంలేని విద్య, నీతిలేని వాణిజ్య వర్త కాలు, అంతఃకరణ శుద్ధిలేని ఆనందం, మాన వత్వంలేని శాస్త్ర విజ్ఞానం, త్యాగబుద్ధిలేని పూజలు, పనిచేయకుండా పొందే సంపద, విలువలు లేని రాజకీయాలను నిరసించి, వ్యతిరేకించండి’’   – మహాత్మాగాంధీ

‘‘అవినీతిపరుడు తనను తాను చంపేసుకునే అంటురోగం, వ్యాధి నివారణకు ఉపయోగించే ఇలాంటి బయోటిక్స్‌ మందులక్కూడా ఈ కరప్షన్‌ అనే అవినీతి ఒక పట్టాన లొంగిరాదు. ఒక విధంగా ఈ అవినీతి జాతీయ స్థాయిలోనే ఆర్థిక ఉగ్రవాదంగా మన దేశంలో పాకుతోంది. మన రాజ్యాంగం ఈ రోగ నిర్మూలనకు పాలకులు విధిగా పాటించాల్సిన బాధ్యతగా పేర్కొన్నప్పటికీ భారత రాజ్య వ్యవస్థలో రోజురోజుకూ నేర ప్రవృత్తి చొచ్చుకుపోతోంది. ఈ ధోరణి రాజ్యాంగబద్ధ నీతి నియమాల్ని చెల్లాచెదురు చేస్తూ మన ప్రజాస్వామిక వ్యవస్థ పునాదుల్నే దెబ్బతీస్తోంది. ఫలితంగా దేశానికే సహించలేని భారంగా, నష్టదాయకంగా తయారైన అవినీతిపరులవల్ల దేశ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు’’
-సుప్రీంకోర్టు అయిదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తరఫునజస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రకటించిన తీర్పు (25.9.2018)

భారత స్వాతంత్య్రోద్యమ రథ సారథుల్లో అగ్రగణ్యుడైన గాంధీజీ, స్వతంత్ర భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో ఒకరుగా ఇటీవల కాలంలో పదవీ విరమణకు ముందు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రక టించిన ప్రవచనాలు, ధర్మాసనం తీర్పు నేపథ్యంలో అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. వీరిద్దరిలో భారత జాతికి, మానవాళికి సామాజిక మహా పాపాలను గుర్తుచేసి అలాంటి పాపాలు జరగకూడదని హెచ్చరిం చిన మహనీయుడు ఒకరు. అసమాన త్యాగాలతో ప్రజలను మహోద్య మాలతో సమీకరించినవారు ఆశించిన సత్ఫలితాలు అందక ఏళ్లూ పూళ్లూ గడిచిపోతున్నా దారీతెన్నూలేని వర్తమాన పాలనా వ్యవస్థలో మనం గడుపుతున్నాం. ఈ నేపథ్యంలో నిర్దేశిత రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అదు పాజ్ఞలు తప్పి నడుస్తున్న పాలనా వ్యవస్థలు, పాలకుల ప్రవర్తనల గురించి దేశ ప్రజల్ని హెచ్చరించిన న్యాయమూర్తి ఒకరు.

ప్రభుత్వాల నియంతృత్వ ధోరణి ప్రమాదకరం
ఇక చెప్పి చెప్పి తమ ప్రాణాలు విసిగిపోతున్న దశలో చివరికి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల అభిప్రాయానికి తోడునీడగా కొన్ని సుప్రీం సాహస తీర్పుల పూర్వ రంగంలో దేశ ప్రధాన ఎన్నికల కమిషన్‌ పని తీరులో కూడా చండితనం పోయి కొంతమేరకు చైతన్యావస్థలోకి వచ్చి నట్టు కన్పిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం– పాలకవర్గం ఎగ్జిక్యూటి వ్‌గా తాను చేసే నిర్ణయాలు ఎలాంటివైనా సరే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయవ్యవస్థతో బాహాటంగా తలపడుతోంది. ప్రభుత్వపరంగా పాలకవర్గ నిర్ణయాలను, శాసన వేదికల (పార్లమెంటు /అసెంబ్లీల) నిర్ణయాల సామంజస్యాన్ని ప్రశ్నించి స్వతంత్రంగా భాష్యం చెప్పే అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాల నిరంకుశ నిర్ణయాల్ని సుప్రీం ప్రశ్నించకూడదన్న నియంతృత్వ ధోరణి పెరగడంతో మొత్తం రాజ్యాంగ విలువలకే ప్రమాదం దాపురించింది. ‘బ్రూట్‌’ మెజారిటీ చాటున శాసన వేదికలను ప్రజావ్యతిరేక స్థావరాలుగా మలచుకోవ డంలో... కాంగ్రెస్‌–యూపీఏ, బీజేపీ–ఎన్డీఏ పాలకపక్షాలు రెండూ సిద్ధ హస్తులేనని అనేక స్కాండల్స్‌ నిరూపిస్తూ వచ్చాయని మరచిపోరాదు. ఇటీవలనే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ వీడ్కోలు సభలో మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పరిణామాలపట్ల స్పందించకుండా ‘మూగనోము’ పట్టి కూర్చునే న్యాయ నిపుణుల వల్లనే ఎక్కువ హాని వాటిల్లుతుందని, ఈ పరిస్థితి కొనసాగడం అమాయక ప్రజలపై హింసా చర్యలకన్నా పెద్ద నష్టానికి దారి తీస్తుందని హెచ్చరించారు. 

ధన సంచుల ‘ఎర’తో ఓటుహక్కుకు మలినం
ఈ సందర్భంగా రాజ్యాంగమూ, జాతీయ ఎన్నికల కమిషన్‌ పార్లమెం ట్‌/అసెంబ్లీలకు ఎన్నికయ్యే రాజకీయ పార్టీల అభ్యర్థులు అనేక మంది రెండు దశాబ్దాలు కూడా గడవకుండానే గత 70 ఏళ్లలో ‘గోడదూకుళ్ల’కు (ఫిరాయింపులకు) అవినీతికి, ప్రలోభాలకు లోనై తరచుగా ఆయారామ్‌ –గయారామ్‌లుగా పార్టీలు మార్చుతూ పార్లమెంటరీ వ్యవస్థను ఎలా భ్రష్టుపట్టిస్తూ వస్తున్నారో దేశ ప్రజలకు నిత్యానుభవంగా మారింది. ప్రజా బాహుళ్యం ఆత్మవిశ్వాసం కూడా సడలిపోవడానికి పెక్కు రాజ కీయ పార్టీలు ధన సంచులు ‘ఎరచూపడం’ ద్వారా అవినీతికి వారి ఓటు హక్కు విలువను తాకట్టుపెట్టడం సహజ ఆనవాయితీగా మారింది. ఫలి తంగా ప్రజా స్వామ్యం పేరిట ఎన్నికల వ్యవస్థలో నేరగాళ్లుగా నమోదైన పార్లమెంటు సభ్యులుగానీ, శాసనసభ్యులుగానీ 1,580 మంది అని మీడియా సర్వేలు (25.09.2018) సాధికారికంగా వెల్లడించాయి. 

అయితే, ఇక్కడ సుప్రీంకోర్టు సాచివేత ధోరణిని కూడా మనం సమర్థించలేం. ఎందుకంటే ‘నేరారోపణలతో ఎంపి/ఎం.ఎల్‌.ఏ.లపై క్రిమినల్‌ కేసులు నమోదైనంత మాత్రాన ఆయా పార్లమెంటు/అసెంబ్లీ సభ్యులపై అనర్హత వేటు వేయరాదని, అలాంటివారిని లేదా రాజకీ యుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయరాదని’ సుప్రీం చెప్పడం సమర్థనీయం కాదు. మరి ఏం చేయాలట? క్రిమినల్‌ కేసులున్న రాజ కీయ పార్టీల నాయకులు ప్రజల ఓట్లు అడుక్కుని, శాసనకర్తగా కావచ్చు నని సుప్రీం ప్రకటించటం ప్రజాస్వామ్య తీర్పుగా మనం ఎలా పరిగణిం చాలో అనూహ్యం. పైగా సాధికార ప్రజాస్వామ్య సంస్థగా నమోదైన ‘ప్రజాస్వామ్య సంస్కరణల పరిరక్షణా సంస్థ’ (ఎ.డి.ఆర్‌.) హోదాలో, పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ్యులుగా ఎన్నికైన వారిలో 33 శాతం మంది క్రిమినల్‌ కేసులున్న వారేనని ప్రకటించినా వారిపై చర్యలు శూన్యం. పైగా లెజిస్లేటర్లు సమర్పించిన అఫిడవిట్స్‌ను పరిశీలించి నిగ్గు తేల్చిన కేసులివి. ఇలా మొత్తం 4,890 మంది అఫిడవిట్లు తనిఖీ చేశారు. 

2014 నాటి పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూస్తే 16వ లోక్‌ సభలో 541 మంది సభ్యుల అఫిడవిట్స్‌ పరిశీలించగా, అందులో 186 మంది (34 శాతం) పైన క్రిమినల్‌ కేసులున్నాయి. కాగా, ఈ నేరాలు 282 మంది బీజేపీ సభ్యుల్లో 98 మందిపైన క్రిమినల్‌ ఛార్జీలున్నాయి. కొందరు టీడీపీ ఎంపీలు కూడా ఉన్నట్లు మరికొన్ని సర్వేలు వెల్లడిం చాయి. ఏఐడీ ఎంకే సభ్యుల్లో ఆరుగురు నేరాల కేసులు ఎదుర్కొంటు న్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో క్రిమినల్‌ రికార్డు ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలైతే చాలు రాజకీయ పార్టీలు వారికే టికెట్లు ఇచ్చారని నాలుగు ప్రధాన పార్టీల్లో మొత్తం 181 మంది అభ్యర్థుల రికార్డు పరిశీలిస్తే తేలిం దని హైదరాబాద్‌ ‘ఎన్జీవో ఎలెక్షన్‌వాచ్‌’ ప్రకటించింది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మొత్తం 119 మందిలో 57 మంది (47.8 శాతం) అభ్యర్థుల పైన క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థులు 77 మంది క్రిమినల్‌ అభియోగాలు నమోదైనవారే. అలాగే తెలంగాణ బీజేపీ అభ్యర్థులు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారే. కాగా 7 మంది ముస్లిం అభ్యర్థులు క్రిమినల్‌ అభ్యర్థులు. 

రాజకీయ ప్రలోభాల్లో నంబర్‌వన్‌ టీడీపీనే
ఇంతకూ అసలు సంగతేమంటే– రాజ్యాంగంలోని 102/191 అధికర ణలు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లోని సభ్యులపై కేసులు నమోదైనా లేదా మరో తీవ్ర అభియోగం వచ్చినా అనర్హులని స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఇక్కడ కూడా ఆ వేటు వేయడానికి సుప్రీంకోర్టు చెబుతున్న అభ్యంతరం– ఆ విషయమై అధికారంలో ఉన్న పార్టీ తన స్వార్థ ప్రయో జనాల రక్షణ కోసం పనిగట్టుకుని తన సభ్యులపై వచ్చే క్రిమినల్‌ అభి యోగాలపై విచారణను ఆదేశించలేదు కాబట్టి, అందుకు చట్టం చేయదు కాబట్టి తాను (సుప్రీం) జోక్యం చేసుకొనలేనని సుప్రీంకోర్టు భావి స్తోంది. ఇక రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో అవినీతికి పాల్పడిన లేదా అవినీతికర ప్రవర్తనలో ఉన్న లేదా డబ్బులు తిన్న పార్టీ సభ్యులు వ్యతి రేక పార్టీలోకి ఫిరాయిస్తే ఈ అనర్హత వేటు వర్తించాలి. కానీ మన కళ్ల ముందే వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని, ముగ్గురు ఎంపీలను బాబు ప్రలోభపెట్టి టీడీపీలోకి గుంజుకుని అవినీతికి ఎలా పాల్ప డ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్పీకర్‌గా ఎంపికైన వ్యక్తి అధికార ప్రతి పక్షాల మధ్య సమన్యాయంతో వ్యవహరించాలన్న రాజ్యాంగ నీతిని ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు, హైకోర్టూ మందలించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికల అనంతరం జాతీయ ఎన్నికల కమిషన్‌ కూడా ఇక మీదట అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులను దాచుకో కుండా బాహాటంగా విధిగా ప్రకటించాలని, అన్ని రాజకీయ పక్షాలకు మొదటి సారిగా తాజాగా ప్రకటించి ప్రచారంలో ఉంచాలని ఆదేశిం చింది. కానీ,  2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు ఈ ఉత్తర్వు వర్తి స్తుందేగానీ ప్రస్తుత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వర్తించక పోవడం.

ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement