అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?! | ABK Prasad Article On BR Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?!

Published Tue, Jun 16 2020 2:25 AM | Last Updated on Tue, Jun 16 2020 2:26 AM

ABK Prasad Article On BR Ambedkar - Sakshi

‘‘మన భారతీయ సమాజం కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అందువల్లనే ప్రతీ సమస్యను కుల ప్రాతిపదిక దృష్ట్యా అల్లుకుంటూ వచ్చారు. మీరు భారతీయ సమాజంలోకి అడుగుపెట్టండి – దాదాపు అన్ని స్థాయిల్లోనూ ఈ కులాల జాడ్యం మీకు కొట్టొచ్చినట్టు ఎదురవుతుంది.హోటళ్ళలో, పరిశ్రమల్లో, వ్యాపారంలో, ఎన్నికల్లో , దానధర్మాలలో ఒకచోటేమిటి, సర్వత్రా కులం ఎదురవుతూనే ఉంటుంది! ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఉదార స్వభావంలో, దానధర్మాలలో అన్నింటా ఈ కులం ఎదురవుతూనే ఉంటుంది. ఒక పార్శీ మరణిస్తే అతని డబ్బు పార్శీలకు మాత్రమే,ఒక జైనుడు చనిపోతే అతని ఆస్తి జైనులకు  మాత్రమే, ఒక మార్వాడీ గతిస్తే అతని ఆస్తి మార్వాడీలకే, భారత చాతుర్వర్ణ్య వ్యవస్థలో ఒక అగ్రకులస్తుడు మరణిస్తే ఆ అగ్రకులం వాడికే  అన్నీ సంక్రమించాలి. కాని అణగారిన పేద వర్గాలకు,కులం పేరిట వెలివేతలకు గురైన అసంఖ్యాక వర్గాలకు రాజకీయాల్లో, పరిశ్రమల్లో, వర్తక వాణిజ్యాలలో, విద్యలో ఉద్యోగ సద్యోగాల్లో చోటు ఉండదు’’–డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్, 20–05–1956(‘‘వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ఇంటర్వ్యూ’’)

వందల సంవత్సరాలుగా సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థ కుళ్ళు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి  73 ఏళ్ళు గడిచిపోయినా ఈ నాటికీ వదలకుండా పట్టి పీడిస్తూనే ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ‘‘గ్రామ స్వరాజ్యం’’ పేరిట తలపెట్టిన ‘‘నవరత్నాల’’లో భాగంగా అమలులోకి వచ్చిన పరిమిత ప్రజాతంత్ర సంస్కరణలను కూడా కులాలతో కూడిన వర్గ–వర్ణ వ్యవస్థ సహించలేకపోతుంది. దాని పర్యవసానమే ప్రస్తుతం రాష్ట్రాలలో జడలు విప్పుకుని తిరుగుతున్న కుల–వర్గ వ్యవస్థ! ఆబోతుల మధ్య కుమ్ములాటలో లేగదూడలు ఇరుక్కునిపోతే వాటి మనుగడ ఏమవుతుందో నేడు దేశంలో వివిధ దశల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. దేశంలో రాబోయే రోజుల్లో కుల వ్యవస్థపై ఆధారపడి, సమసమాజ వ్యవస్థా నిర్మాణ ప్రయత్నాలను ఎలా దేశ పాలకులు తుత్తునియలు చేయబోతున్నారో  కూడా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్, ప్రధాని నెహ్రూ క్యాబినేట్‌ నుంచి తప్పుకుంటూ పార్లమెంటులో (1956)లో చేసిన  ఆఖరి ప్రసంగంలో  హెచ్చరించారు. ఆనాడు దేశ స్వాతంత్ర ప్రకటనకు ఎంతో సంతోషించి, కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లివిరుస్తున్న సమయంలో మహాకవి జాషువా ‘‘కులముల కొమ్ముల తోడ కుమ్ముకుని చిక్కుల్‌ సృష్టించు, పెద్దల కాలాలు ఇక గతించిపోయినట్టే’’ నన్న  అల్ప సంతోషాన్ని కూడా పది కాలాల పాటు నిలబడనివ్వకుండా మన పాలకులు చేస్తారని ఆశించలేదు! అంబేద్కర్‌ జోస్యానికి ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న కనీస ప్రజాసంస్కరణలను కూడా సహించలేక పోవడానికి కారణం బహుశా భారత సెక్యులర్‌ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ జనాభాలో అసంఖ్యాక అట్టడుగు వర్గాలుగా నమోదై  ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతులు, బి.సి, మైనారిటీ వర్గాలకు జిల్లా, మండల,గ్రామ స్థాయి నుంచి మంత్రి వర్గ స్థాయితో గ్రామ సచివాలయ స్థాయి వరకూ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి బీజాలు నాటిన ఘనత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే కావటం! పరాయి సామ్రాజ్య వాద పాలనను పారదోలడంలో అసంఖ్యాక త్యాగాలు చేసిన భారత ప్రజలలో మెట్టు. భాగంగా ఉండి స్వాతంత్య్రానంతర భారతంలో  పేద వర్గాలందరి తరపున గళం విప్పి  ‘‘స్వతంత్ర భారతంలో మా మెట్టు వాటా మాకు దక్కి తీరవలసిందే’’నని రాజ్యాంగం సాక్షిగా ఎలుగెత్తి చాటిన వారిలో జాషువా ఒకరు.! చివరికి వెనకటి తరాల నాటి భాగవత పోతన్న సహితం ‘‘కులాన్ని గోదావరిలో కలిపేయమన్నవాడే! ఆ మాటకొస్తే భారతదేశంలో కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల వరకూ ఉన్న న్యాయవ్యవస్థలలో కూడా బడుగు బలహీన అసంఖ్యాక బహుజన వర్గాల గొంతుకను సహేతుకంగా వినిపించగల న్యాయవాదుల సంఖ్య కూడా వారి దామాషాన అతి స్వల్పంగానే ఉందన్న నగ్న సత్యాన్ని ఎవరూ దాచలేరు! ఈ వాస్తవాన్ని కూడా అంబేద్కర్‌ మరో రూపంలో బహిర్గతం చేశారు. ‘‘భారత దేశంలో స్వేచ్చాయుతమైన, వివక్షా రహితమైన ఎన్నికలంటే అర్ధం ఏమిటీ? అని ప్రశ్నించమని ఇక్కడొక పచ్చి సత్యాన్ని మాత్రం మర్చిపోరాదు. మన దేశ రాజకీయ జీవితంలో  బడా బడా వ్యాపార వర్గాలు గణనీయమైన పెద్ద పాత్ర వహించడానికి ప్రయత్నిస్తున్నామని మరవరాదు. ఈ బడా వ్యాపారవేత్త వర్గాల తరపున దేశ పాలక రాజకీయ పక్షాలకు ముట్టజెప్పే ధన సంచులే అసలు సిసలు ప్రమాదం! అని నెహ్రూ మంత్రివర్గం నుంచి, తొలి భారత పార్లమెంటు నుంచి వైదొలుగుతూ వచ్చిన ప్రసంగంలోనే (1956) అంబేద్కర్‌ కుండ బద్దలు కొట్టేశారు! ఈ వర్గాలే తమ ధన సంచులతో తాము  ఆర్థికంగా ఆదుకున్న పార్టీ.. పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు తమకు అనుకూలమైన రాయితీలను ఆ పార్టీల నుంచి పొందడం సాధ్యమని ఆశించడం, ప్రయత్నించడం సహజమన్నాడు అంబేడ్కర్‌. అధికారంలో ఉన్న పార్టీ ద్వారా లెజిస్లేచర్‌ ద్వారా తమ  వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా  బిల్లులను రూపొందించడంలో, చట్టాలను సవరింపజేయడంలో తమ పలుకుబడిని వినియోగించడం వీరికి అనివార్యమవుతుందని వెల్లడించారు. (అదే ప్రసంగం – 1956). 

నేటికి 64 ఏళ్ళ నాడే రానున్న రోజుల్లో భారత పాలక వర్గాలను భారత యుద్ధంలో కౌరవ పక్షపాతి అయిన భీష్ముడితో పోల్చుతూ ఒక సాదృశ్యాన్ని అంబేడ్కర్‌ ఉదాహరించాడు. పాండవులకు, కౌరవులకూ మధ్య సాగిన  ఈ యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు కౌరవుల పక్షం వహించారు. కాని ధర్మం పాండవులది కాగా అధర్మ ప్రవర్తన కౌరవులది. ఈ సత్యాన్ని కౌరవ పక్షపాతి  భీష్ముడే స్వయంగా అంగీకరిస్తాడు. అయితే మరి పాండవులదే ధర్మప్రవర్తన అయినప్పుడు కౌరవుల పక్షాన ఎందుకు నిలబడ్డావని భీష్ముణ్ణి ఎవరో ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం సమర్థనీయమూ కాదు, క్షమించదగినదీ కాదని అంబేడ్కర్‌ భావించాడు. ఏమిటా వయస్సు మళ్లిన మరవరాని భీష్మన్న సమాధానం? ‘‘నేను కౌరవుల ఉప్పు తింటున్నాను. కనుక వాళ్లకు విధేయుడనై ఉండాల్సివస్తుంది గదా, వాళ్లు తప్పుడుగా వ్యవహరించినప్పటికీ  కూడా’’ అని! ( అంబేడ్కర్ః ‘‘ఫెయిల్యూర్‌ ఆఫ్‌ పార్లమెంటరీ డెమొక్రసీ విల్‌ రిజల్ట్‌ ఇన్‌ రెబెలియన్‌ అండ్‌ ఎనార్కీ’’ జలంధర్‌లో స్టూడెంట్స్‌ పార్లమెంట్‌లో ప్రసంగం (28–10–1951) ‘‘అంబేద్కర్‌ స్పీక్స్‌’’ వాల్యూం 1. పే.283)

అంబేడ్కర్‌కి ఎంత ధిషణ అంటే, స్వాత్రంతోద్యమకాలంలో లండన్‌లో జరిపిన రౌండ్‌ టేబిల్‌  కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్‌ తరపున గాంధీతో పాటు తాను కూడా పాల్గొన్న ఆ సందర్భంలో డా.అంబేడ్కర్ః భారతదేశ ప్రయోజనాలను రక్షించడంలో మహాత్మాగాంధీ కన్నా నేను 200 మైళ్లు ముందు నడుస్తున్నా’’ అని చెప్పడం మరో ప్రత్యేకత. ఎందుకంటే ఈ గొప్ప భారతదేశంలో అణచివేయబడుతున్న వర్గాలనీ, అభ్యున్నతి రాకుండా తొక్కివేయబడుతున్న వర్గాలంటూ ఉండడానికి వీల్లేదనీ, హక్కులన్నింటినీ భుక్తం చేసుకునే వర్గాలు, అన్ని కష్టాలు, బరువులూ మీద మోయాల్సి వచ్చే వర్గాలంటూ ఉండరాదనీ, అలాంటి సమాజ విభజన లేదా వ్యవస్థ గానీ ఉనికిలో ఉంటే ఆ సమాజం నుంచి రక్తపాత విప్లవ బీజాలు మొలకెత్తకతప్పవనీ, ప్రజాస్వామ్యానికి ఆ బీజాలను తొలగించడం సాధ్యం కాదనీ అంబేద్కర్‌ భావించాడు. (పూణే న్యాయశాస్త్ర గ్రంధాలయ సభలో ప్రసంగం 22–12–1952)!!

అలాగే సమాజంలోని దళిత ప్రజాబాహుళ్యం బతుకుల్ని మెరుగు పరచడానికి అధికార వికేంద్రీకరణ అనివార్యమని  ఈ విషయం పట్ల ‘‘శ్రద్ధలేని న్యాయమూర్తులు రాజకీయంగా నిరక్షరాస్యులనీ సమసమాజ వ్యవస్థ తాత్వికతకు దూరమైన వ్యక్తులనీ శఠించిన వాడు ప్రసిద్ధ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి. ఆర్‌ కృష్ణయ్యర్‌ (జస్టిస్‌ వీఆర్‌కే ‘లీగల్‌ స్పెక్ట్రమ్‌’  పేజీ 87)

హిరణ్యకశిపులకు  ‘ప్రహ్లాదులు’ పుట్టడం సమాజంలో అరుదైన సన్నివేశంః తనయందు అఖిల లోకులందు ఒక భంగిసము (తేడా చూపకుండా) మెలిగేవాడు మాత్రమే అంతో ఇంతో సమాజానికి వ్యవస్థ పరిమితులలో మంచి చేయగలడు. గ్రామ స్వరాజ్య వ్యవస్థ అనే సదాశయం సంపూర్ణ విజయం సాధించడం అనేది భూస్వామ్య ,పెట్టుబడిదారి వ్యవస్థ చట్టంలో విధించే పరిమితులకు లోబడి  సాధ్యం కాకపోవచ్చు! ఈ లోగా వర్గ ఘర్షణకు ఆటవిడుపు ఉండదు.  తప్పితే ఈలోగా జరిగేపని బొలీవియా విప్లవ కారుడు చేగువేరాను అంతమొందించిన అమెరికా పెట్టుబడి దారీ సామ్రాజ్యవాదం లాభాల.వేటలో భాగంగా అదే గువేరా బొమ్మలతో టీషర్టులు తయారు చేసి మార్కెట్లకు విడుదల చేసినట్టే– ఇక్కడ ఆంధ్రాలో  మాజీ చంద్రబాబు బిసిలను ఉద్ధరించకపోగా తన అధికార లాలసకొద్దీ.బలిపశువులుగా వాడుకుంటున్నాడు! అందుకే అంబేడ్కర్‌ అన్నాడు. ‘‘నేను కోరుకున్నది గుడులు, గోపురాలు కాదు.కులాల మధ్య విందుభోజనాలూ కావు, నేను కోరుకున్నది దళిత బహుజనులకు ప్రభుత్వోద్యోగాల్ని, కడుపుకింత తిండిని తదితర అవకాశాలనూ’’

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement