బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ముంబైలోని ఆర్థర్‌రోడ్ జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ అతడి విడుదలపై ఉత్తర్వు జారీ చేసినప్పటికీ ఆర్యన్ ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తే్తనే న్యాయస్థానం బాధపడిపోయింది. కానీ, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరాధారమైన అరెస్టుల కారణంగా, వారు ఏళ్ల తరబడి నిర్బంధంలో మగ్గుతున్నారు. వారి తక్షణ విడుదలకు, రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడటం లేదు. ఇవి న్యాయస్థాన చరిత్రలో చెరగని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది! అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను, ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను, అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు.
‘దురదృష్టవశాత్తు దక్షిణాసియా రాజ కీయ నాయకత్వానికి పరిణామాలను ముందుగానే పసిగట్టగల దార్శనికత గానీ, సమయానికి మేల్కొని అన్నిరకాల మత దురభిమా నాలకు వ్యతిరేకంగా నిలబడేట్టు చేయగల సత్తాగానీ లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత పాలకులు మత దురభి మానాలనూ ప్రజల్లో పరస్పర విద్వేషాలనూ, అసహనాన్నీ కడు వేగంగా వ్యాపింపజేస్తున్నారు. దీని ఫలితంగా ఆయా సమాజాల్లో జరిగే కాసింత మంచి విషయం కూడా నిలువునా దగ్ధమవుతోంది. ఈ దుష్పరిణామం దక్షిణాసియాలో భాగమైన భారత ప్రజలు కోరుకుం టున్న సామాజిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దేశ విభజన జరిగిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారత ప్రజల మధ్య సఖ్యత కొరవడటమే కాదు, విభిన్న మతాల మధ్య సహజీవ నానికి, సహిష్ణుతలకు సైతం నేడు పెను ప్రమాదం దాపురించిందని గమనించాలి.’’
– ప్రొ‘‘ సయద్ మునీర్ ఖస్రూ, చైర్మన్,
‘ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ, అడ్వొకసీ అండ్ గవర్నెన్స్’ న్యూఢిల్లీ,
పలు దేశాల్లో విద్యాధిక సలహాదారు
ప్రొఫెసర్ మునీర్ ఖస్రూ హెచ్చరిస్తున్న ప్రమాదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా సుప్రసిద్ధ హేతువాది నరేంద్ర దాభోల్కర్ హత్య కని పిస్తుంది. ఈయన హత్య జరిగి ఎనిమిదేళ్లయింది, ప్రసిద్ధ సామాజిక సేవకురాలు, హేతువాద పత్రిక ‘లంకేశ్’ సంపాదకురాలైన గౌరీ లంకేశ్ హత్య జరిగి నాలుగేళ్లయింది. కానీ వీరిద్దరి హంతకుల ఆచూకీ గురించిన విచారణ తతంగం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి అనేక అంశాల కారణంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ప్రస్తుతం ఎదుర్కొన బోతోంది! దేశంలోని పలు జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గుతున్న నిందితు లకు న్యాయస్థానాలు జారీచేస్తున్న బెయిల్ ఉత్తర్వులను కూడా సకా లంలో సంబంధిత అధికారులకు అందజేయడంలో జాప్యం జరుగు తోంది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానిస్తూ, అండర్ ట్రయల్ ఖైదీల బెయిల్ విషయంలో జాప్యం అనేది మానవ స్వేచ్ఛను ఉల్లంఘించడంగా విమర్శించవలసి వచ్చింది. అంతేకాదు, నేటి సాంకేతికయుగంలో కూడా కోర్టుల ఆదేశాలను జారీ చేయడానికి అవలంబిస్తున్న విధా నాలను ఆయన తప్పు పట్టారు. పాతకాలంలో పాలకుల ఉత్తర్వులు జారీచేయడానికి ఎగిరి వచ్చే పావురాల కోసం అప్పట్లో ఎదురు చూసేవారు కదా! అయితే నేటికాలంలో కూడా మంజూరైన బెయిల్ కోసం ఇంకా నిందితులు ఆకాశంవైపు మోరలెత్తి ఎదురు చూడడం హాస్యాస్పదమని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించవలసి వచ్చింది!
హేతువాద, ప్రజా ఉద్యమాల నాయకులైన దాభోల్కర్, గౌరీ లంకేశ్, ప్రొఫెసర్ కల్బుర్గి, గోవింద పన్సారేల దారుణ హత్యల ఉదంతం కానీ, ప్రజాఉద్యమాలకు అండగా నిలిచిన పలువురు పత్రికా విలేక రులపై జరిగిన హత్యా ఘటనలు కానీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హత్యలకు కారకులను బహిర్గతం చేసి శిక్షించడంలో కూడా సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంతమంది ప్రజా కార్యకర్తలు, జర్నలిస్టులపై దారుణ హత్యలు నమోదై ఉండగా ఒక బాలీవుడ్ సూపర్‌స్టార్ కొడుకు ఆర్యన్, ఆర్థర్‌రోడ్ జైలునుంచి విడుదల కావడానికి కోర్టు ఉత్తర్వు జారీ ప్రక్రియలో ఆలస్యంతో ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తేనే న్యాయస్థానం బాధపడి పోయింది. అదే సమయంలో, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరా ధారమైన అరెస్టులతో వారు సంవత్సరాల తరబడిగా నిర్బంధంలో మగ్గిపోతున్నారు, ఇలాంటివారి తక్షణ విడుదలకు రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు న్యాయస్థాన చరిత్రలో చెరపరాని మచ్చగా మిగిలిపోతున్నాయి. ఇది ప్రజాతంత్రవాదులకు, న్యాయస్థానాల పట్ల ఇంకా గౌరవం మిగుల్చుకున్న ప్రజాస్వామ్యవాదులకు మనస్తాపం కల్గించే పరిణామం. ఈ అంశంపై దేశ ఉన్నత న్యాయస్థానం గుర్తించి తిరుగులేని నిర్ణయానికి రాగలదని ఆశిస్తున్నాం.
కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, పౌరుల సమాచారహక్కు చట్టాలు లేక కాదు... ఉన్న చట్టాలను చాపచుట్టి నేలమాళిగల్లో భద్ర పరిచే ఏర్పాట్లకు కేంద్ర పాలకులు సిద్ధమయ్యారు. అందుకనే ఇప్పటిదాకా (11–10–2021) ఈ చట్టం అమలులోకి రాకుండా చేసినందున దాదాపుగా 2 లక్షల ఆర్టీఐ కేసులు పరిష్కారం కాకుండా నిలిచిపోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం గుర్తించి చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టాన్ని అమలుపర్చవలసిన సమాచార కమిషన్లకు సిబ్బంది లేరన్న సాకు ఎంతవరకు నిజమో, అందుకు కారణాలేమిటో గౌరవ సుప్రీంకోర్టు మొహమాటం లేకుండా పరిశీలించాల్సి ఉంది!
అంతేకాదు, దేశ పౌరుల సమాచార హక్కును నిరాకరిస్తే, అది పౌరుల ప్రాథమిక హక్కుల్ని నిరాకరించిన ట్లే. పైగా ‘జాతీయ భద్రత’ పేరు చాటున ‘పెగసస్’ లాంటి విదేశీ నిఘా సాఫ్ట్‌వేర్ కార్య కలాపాలను దేశంలో అనుమతించబోమని, ఇది దేశ భద్రతకు సంబం ధించిన సమస్య అనీ, అందువల్ల ప్రభుత్వ వాదనను విశ్వసించ బోమని సుప్రీంకోర్టుæ ధర్మాసనం స్పష్టం చేయవలసివచ్చింది! పైగా, ఈ విషయానికి సంబంధించినంతవరకూ, ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల సంతలో న్యాయస్థానం తలదూర్చబోదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. తన నిర్ణయానికి అనుగుణంగానే 1973 నాటి ‘కేశవానంద భారతి’ కేసులో జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా చెప్పిన తీర్పును చీఫ్ జస్టిస్ ఉటంకించాల్సి వచ్చింది. జస్టిస్ ఖన్నా ఆనాడు ‘న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్భయంగాను లేదా సానుకూలంగానూ గౌరవించడమే... అలా చేయడంలో వారు ఒక రాజకీయ సిద్ధాంతాన్నో లేదా ఏదో ఒక ఆర్థిక సిద్ధాంతాన్నో అనుసరించి తమ నిర్ణయాన్ని ప్రకటించరాద’ని అన్నారు.
అయితే దేశ రాజకీయ, ఆర్థిక విధానాలపై ఒక అవగాహన, స్పష్టతలేని న్యాయమూర్తుల పట్ల, వారి తీర్పుల పట్ల జస్టిస్ కృష్ణయ్యర్ తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. అలాగే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్‌ని రూపొం దించిన ఎస్‌ఓఎస్ భారత పాలకుల అనుమతితో ఇండియాలో సాగి స్తున్న గూఢచర్యం విషయంలో, భారత పౌరుల రాజ్యాంగ హక్కుల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరి ణామం. పాలకుల విధాన నిర్ణయాల వల్ల దేశ పౌరుల రాజ్యాంగ హక్కులకు కలుగుతున్న ప్రమాదం పట్ల న్యాయస్థానం మూగనోము పట్టజాలదని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ స్పష్టతకు అనుగుణంగానే, అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ఈ బాధ్యతను తప్పకుండా చేపట్టాలని చీఫ్ జస్టిస్‌కు ప్రజాపక్షంగా ఇదే మా విజ్ఞాపన!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment