పోగొట్టుకున్నది ఒక మనిషిని కాదు, ఒక ముఖ్యమంత్రిని కాదు, ఒక బంధువుని కాదు. మనం పోగొట్టుకున్నది ఒక జీవన ఆశయాన్ని, జీవింపజేసే ఆశను. ఒక వేళ నా ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పదై ఉంటే మరి నేనెందుకు జీవించి ఉన్నాను. ఆయన కోసం మరణించిన వారిలో నేనెందుకు లేను అన్న సందేహానికి ఎవ రెన్ని సమాధానాలిచ్చినా నాకు మాత్రం ప్రతి శ్వాస ఒక పరీక్షగానే మారింది. – వైఎస్ సతీమణి విజయమ్మ తలపోతలు
బాధాతప్తహృదయ భారంతో విజయమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, ఆత్మీయ భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతు లైన తర్వాత రాసుకున్న జీవన ఘట్టాల సమాహారం ‘నాలో.. నాతో వైఎస్’ అన్న గ్రంథం. దీన్ని చదువుతున్నప్పుడు, ముఖ్యంగా విజ యమ్మ తలపోతలను చూస్తున్నప్పుడు, కస్తూర్బా గాంధీ తన భర్త గాంధీతో వివాహబంధం గురించి ప్రస్తావిస్తూ, తన ఆఖరి ఘడియ లలో ఆమె గాంధీపట్ల తన హృదయావేదన గురించి అన్న మాటలు జ్ఞప్తికి వస్తున్నాయి: ‘మీరు నాకు లభించడం గతంలో నేను చేసుకున్న మంచి పనుల ఫలితం. కాబట్టే మీరు నాకు భర్తకాగలిగారు.
మీరు నా ఆత్మీయ స్నేహితులు, నాకు అనుపమాన గురువులు. నా ఆఖరి శ్వాస వరకు మీ సేవలోనే ఉంటా. మీకన్నా వయస్సులో కొద్ది మాసాలే పెద్దదాన్ని అయినా నా జీవిత భాగస్వామి, గురువైన మిమ్మల్ని దేవుడు పిలవకముందే మృత్యువు నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక‘ విజయమ్మకు సమాధానం ఇచ్చేవారు లేకనే ఆమెకు తన ప్రతి శ్వాసా పరీక్షా ఘట్టంగా మారవలసివచ్చింది. క్రమశిక్షణకు కర్మసాక్షిగా ఎదిగి వచ్చిన సమర్థుడైన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అఖండ పాద యాత్ర ద్వారా ఎన్నికలలో కనీవినీ ఎరుగని మెజారిటీతో తన పార్టీని ప్రజల ఆశీర్వాదాలతో గెలిపించుకుని ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడంతో ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసలకు ఊరట కలిగి ఉంటుంది. ఆమె తన గతాన్ని తల్చుకుని బిడ్డ ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్న సమయంలో ప్రేక్షకుల గుండెలు అవిసిపోయే టట్టు గత సన్నివేశాలు ఒక్కసారిగా ఆమె సజల నేత్రాలను కమ్మి వేయడాన్ని అశేష ప్రజానీకం గమనించింది.
తండ్రి స్థానంలో తల్లే రెండు పాత్రలనూ తానే పోషించి జగన్ జీవితాదర్శాన్ని, తండ్రి లక్ష్యా లను మరింత సునిశితం చేయడానికి దోహదం చేసింది. తెలుగు ప్రజల, రాష్ట్ర సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం అంతకుముందు ఎవరూ ఎరుగని వినూత్న పథకాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారం భించగా, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేరిటనే ఆ పథకాలకు నామ కరణం చేసి విజయపథంలో సాగిస్తున్న తరుణంలో ప్రచారంలో లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వమే. కానీ కృష్ణ–గోదావరి బేసిన్‌లోని, విలువైన ఇంధన వనర్లను గుజరాత్ వ్యాపారులు కొందరు రాష్టానికి దక్కనివ్వకుండా గుజరాత్‌కు తరలిస్తుండగా మోకాలొడ్డిన ఏకైక రాష్ట్రనాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయిలో పాదయాత్రలకు అంకురార్పణ జరిగిన కాలం 1935–36. ఆనాడు ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం వరకు రైతాంగ సమస్యలపై అసెంబ్లీకి మహజర్లు సమర్పించడానికి వామపక్ష నేతలు బొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవ రావు నాయకత్వాన సాగిన యాత్ర చరిత్రకెక్కింది.
ఆ తర్వాత వైఎస్సార్ నాయకత్వాన రాయలసీమ రైతాంగ సమస్యలపై, ప్రజా సమస్యలపై 1986 జనవరి 3 నుంచి అశేష ప్రజా నీకంతో లేపాక్షి నుంచి సాగిన పాదయాత్ర. సీమ ప్రజల వాస్తవ పరిస్థితులను, కరువు సమస్యలను తెలుసుకుంటూ వివరిస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగించారాయన. ఆరోజుల్లో తొలి అనుభవాన్ని ప్రజలు తల్చుకుంటూ, ‘నడిచింది వైఎస్ కాదు, నడిచింది రాయలసీమ. నడి పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి’ అని వర్ణించుకున్నారు! 2003లో జరిగిన పాదయాత్రకు 18 ఏళ్ల ముందే ప్రారంభమైన వైఎస్సార్ ఆ తొలి యాత్ర 500 కిలోమీటర్లలో 60 గ్రామాలు, ఆరు పట్టణాల మీదుగా సాగింది. అలా నేర్చుకున్న ఈ తొలిపాఠం.. ‘నాయకులు ఆఫీసుల్లో కూర్చోకుండా ప్రజల మధ్య ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది, చిన్న చిన్న అవసరాలకు కూడా ప్రజలు ఎంత మధనపడుతుంటారో తెలిసొస్తుంది. నాయక త్వంలో ఉండాల్సిన గొప్ప గుణమల్లా నాయ కులు ప్రజలకు అందు బాటులో ఉండటమేన’న్నది వైఎస్సార్ విస్పష్ట ప్రకటన.
అలా లేపాక్షి నుంచి ప్రారంభమైన సీమ యాత్ర.. తర్వాత పాదయాత్రకు వేసిన జాంబవంతుని అంగ. ఆయన తొలిసారి ముఖ్య మంత్రి పదవికి రావడానికి ముందు, 2003లో చేవెళ్ల నుంచి ప్రారంభ మైన పాదయాత్ర–జనయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సాగి రాష్ట్రవ్యాపిత సంచలనానికి కారణమయింది. ఆ సంద ర్భంగా ఆంధ్ర ప్రభ సంపాదకుడిగా నాదొక అనుభవం చెప్పాలి. ఇప్ప టిలాగానే ఆనాటి కొన్ని ‘ఉంపుడు పత్రికలు’ కూడా ఎన్నికల్లో వైఎస్, కాంగ్రెస్ ఓడిపోబోతోందని సర్వేల పేరిట ప్రచారం చేస్తున్న సమ యంలో ఒక్క ‘ఆంధ్రప్రభ’ మాత్రమే భారీ ఎత్తున తొలిసారిగా 10 వేల శాంపుల్స్‌తో జిల్లాల్లో నిర్వహించిన సర్వే ‘వైఎస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కాంగ్రెస్ విజయం’ గురించి పతాక శీర్షిక పెట్టింది.
వైఎస్ సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం అయింది. పాదయాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత వైఎస్ మరుసటి రోజున నాకు ఫోన్ చేసి ‘ఏబీకే మీరు రేపు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు రండ’ని కోరారు. అలాగే వెళ్లాను. డైనింగ్ హాల్‌లో ముగ్గురమే ఉన్నాం– వైఎస్, నేను, విజయమ్మ. ఆమెదే వడ్డన, ఆమె ఒద్దిక, ఆప్యాయత, అచ్చం తెలు గింటి ఆడపడుచుదే. నేనూ, వైఎస్ పిచ్చాపాటీ మాట్లాడు కున్నాం. ‘ప్రభ సర్వే’ ఎలా దాదాపు ఫలితాలకు చేరువగా వచ్చిందంటే, మొదటిసారిగా శాంపుల్స్ సంఖ్యను పెద్ద మోతాదులో తీసుకున్నందు ననే ఎన్నికల ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని వివరించాను.
విజయమ్మ అప్పటికే కేవలం గృహిణి కాదు, వైఎస్ సాహ చర్యంలో తన చదువుకు, జ్ఞాన కాంక్షకు మరింత మెరుగులు దిద్దు కుంది. అందుకే ఆమె తన పుస్తకంలో ఎన్నో జ్ఞాపకాలను, పరిచయా లను, అనుభూతులను అలవోకగా గుదిగుచ్చి ఒక ఉత్తమ గ్రంథంలో గుదిగుచ్చి మనకు అందించగలిగారు. పుట్టింటివారి, అత్తింటివారి మధ్య ఆప్యాయతలు, తెలుగు వాకిళ్లలో సంసారపక్షంగా సాగే కుటుం బాలు, కష్టసుఖాలు, బాదరబందీలు, పరస్పర అనుబంధాలు, అను రాగాలు, అలకలు, పొల అలకలు, పోటీ అలకలు, ఆగడాలు, ఆత్మీయ తలు, ఆడపిల్లల పెంపకాలు, పెళ్లిళ్లప్పుడు అంపకాలు, బావా మర దళ్ల మధ్య చిలిపితనాలు, పండగల సరదాలు, పేరంటాలు, పరస్పరం ఎత్తిపొడుపులు, బాధించని ఎకసెక్కాలు– ఇలా ఒకటేమిటి, తెలుగు లోగిళ్లలోని కుటుంబ బాంధవ్యాలలోని వెలుగునీడల సయ్యాటల ఆవిష్కరణే విజయమ్మ ‘నాలో–నాతో వైఎస్’ గ్రంథం.
పరిపాలనలో, ఆచరణలో ప్రభుత్వాల వైఫల్యాలను శాస్త్రీయంగా బేరీజు వేసుకుని ప్రజా సంక్షేమం కోసం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నది వైఎస్ ఆదర్శం. అనంతపురం జిల్లా చీమలవారిపల్లికి, కడప జిల్లా పులివెందులకు మధ్య ఏర్పడిన వియ్యంకుల బంధం, పులివెందుల లోనే పాగా వేసింది. అన్నింటికన్నా విశేషం– వైఎస్ తండ్రి రాజారెడ్డికి, విజయమ్మ తండ్రి రామానుజుల రెడ్డికి అదేమి అనుబంధమోగానీ, ఇరువురూ దానకర్ణులుగా పేరు మోయడం ఫ్యాక్షనిస్టు గొడవల్లో బతికే వారికి తప్ప సీమ రాజకీయాల్లో తలపండిన పెద్దలందరికీ తెలిసిందే. రాజారెడ్డి వామపక్ష రాజకీయాలలో, ప్రజానాట్యమండలి శాఖలతో అంతో ఇంతో సంబంధాలున్నవారు, సాంస్కృతిక కార్యకలాపాలకు ధన సహాయం చేసినవారూ. ఆ భావాలు వారసత్వంగానే కాంగ్రెస్‌లో ఉన్నా అంతో ఇంతో ‘రాజా’ (వైఎస్)కు కూడా కొంతమేరకు అబ్బ బట్టే, వెలిగొండ ప్రాజెక్టుకు సుప్రసిద్ధ వామపక్ష నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడమూ, రాష్ట్ర రైతాంగ సమస్యలపైన, రుణాల పైన సమీక్షించి సమగ్ర నివేదికను అందించేందుకు సుప్రసిద్ధ ఆర్థిక వేత్త, వామపక్ష మేధావి అయిన జయతీ ఘోష్‌కు పురమాయించారు.
అలాగే ఈనాటి యువతకు ఎన్నో పాఠాలు నేర్పగల అద్వితీయ అనుభవ సారమే విజయమ్మ ఆత్మనివేదనలోని అంతరంగ ఆవిష్క రణ– ఈ గ్రంథం. ఎందుకంటే తన కష్టసుఖాల కథావిష్కరణలో విజ యమ్మ నుంచి వెలువడిన ఎన్నో ఆణిముత్యాలలో ఒకటి: ‘స్వార్థం పెరిగే వయసులో స్నేహం పెంచిన సంస్కారం వైఎస్‌ది. ప్రతి యువ తిని తన తోబుట్టువుగా కాపాడిన ఉడుకు నెత్తురు ఆయనిది. స్నేహితు లకు అంత ప్రేమను వైఎస్ పంచేవారు’. అందుకే ఆమె మెట్టినింటిని తనకు మెచ్చినిల్లుగా తీర్చిదిద్దుకున్న మహిళ. వైఎస్ పాదయాత్రల స్ఫూర్తితోనే విజయమ్మ వైఎస్ గారాలపట్టి షర్మిల, ప్రేమాంకురబీజం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క పూలదండగా.. వరసవారీ సుదీర్ఘ పాద యాత్రలు జరిపి, దళిత బహుజన వర్గాల సముద్ధరణకు పెట్టుబడి దారీ–భూస్వామ్య వ్యవస్థ సృష్టించిన ఆటంకాలను చేతనైన మేరకు ఛేదించుకుంటూ విజయాలను సాధించుకుంటూ వస్తున్నారు.
కనుకనే తండ్రి వైఎస్ పేదల కోసం ఒకడుగు ముందుకు వేస్తే, జగన్ రెండడుగులు ముందుకు వేస్తున్నాడు. పేద ప్రజల ఆరోగ్య భాగ్యరక్షణకు వైఎస్సార్, వైఎస్ జగన్ ఇద్దరూ పోటాపోటీలమీద జల సంక్షేమ, ప్రజా సంక్షేమ పథకాల మీదనే ఒకరికి మించి మరొకరు కేంద్రీకరించారు. అదీ– వారసత్వంగా, అప్పనంగా వచ్చిన పదవి కాదు జగన్‌ది. వేదనల గరళాన్ని ఆరగించుకుని, ఆవేదనతో ముందుకు సాగు తున్న జగన్‌ది. ఈ వేళ రెండడుగులు కాదు, రేపు మూడడుగులకు పెరి గినా, అంతకుమించినా ఆశ్చర్యపోనక్కర లేదు. బహుశా అందుకే నేమో విజయమ్మ ఒక బైబిల్ సామెతను ఉదహరిం చారు: ‘డేవిడ్ ఒక దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు అతనితో– అది నువ్వు కాదు, నీ కొడుకు చేస్తాడు’ అని చెప్పాలన్నదే ఆ సామెత సారాంశం!(ఈ విశిష్ట గ్రంథాన్ని ప్రచురించిన ఎమెస్కో ప్రచురణకర్తలకు, కళాజ్యోతి ముద్రాపకులకు ప్రత్యేక కృతజ్ఞతలు)
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment