(ఎస్.పి.యూసుఫ్ – కర్నూలు రాజ్‌విహార్/ సాక్షి, అమరావతి) : రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం లక్షలాది మంది అన్నదాతల తలరాతలు మార్చింది. 2004కు ముందు చంద్రబాబు పాలనలో రైతులు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన డబ్బు చెల్లించి ఏళ్లు గడిచినా కనెక్షన్ మంజూరు అయ్యేది కాదు. అప్పుడు.. ఇప్పుడు అంటూ జాప్యం చేసేవారు.
వర్షం పడి, నాటుకున్న పంట ఎండిపోయే దశలో ‘డబ్బు కట్టాను.. పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న స్తంభం నుంచి తీగలు పెట్టుకొని మోటర్ ఆన్ చేసుకొని నీళ్లు పెట్టుకుందామంటే కేసుల పేరుతో బెదిరించే వాళ్లు. పంటలు రాక, మద్దతు ధరలు లేక బిల్లులు చెల్లించని పక్షంలో బిల్లుల బకాయిలపై జరిమానాలు విధించేవారు.
రాత్రి కరెంటుతో ఎన్నో కష్టాలు పడ్డారు. బావి, బోర్లలో నీళ్లు ఉన్నా.. విద్యుత్ సమస్యలు తప్పేవి కావు. భార్య బిడ్డలకు దూరంగా పొలంలో రాత్రంతా జాగరణ చేసినా పోలాన్ని తడుపుకోలేక సతమతమయ్యేవారు. మెయిన్ సప్లై ఆఫ్, బ్రేక్ డౌన్లు, ట్రిప్పింగ్‌ల కారణంగా అంతరాయం ఏర్పడితే ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. దీంతో రైతులు రాత్రంతా పొలాల్లో నిద్ర మేలుకుని పడిగాపులుపడేవారు. ‘అసలు వ్యవసాయమే దండగ’ అని నాటి పాలకుడు చంద్రబాబు రైతులను చులకనగా చూశారు.
తొలి సంతకం.. చరిత్రాత్మకం
రైతు కష్టాలను నాడు పాదయాత్రలో కళ్లారా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. ఈ హమీపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు ‘ఉచిత విద్యుత్ కాదు.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’ అంటూ హేళన చేశారు.
2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే వైఎస్సార్ తొలి సంతకం పెట్టి సాహసోపేతంగా ఆ హామీని ఆచరణలో పెట్టారు. అప్పటి వరకు ఉన్న విద్యుత్ కనెక్షన్ల రూ.కోట్ల బకాయిలు రద్దు చేయడంతో పాటు ప్రతి ఏటా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఉచిత కనెక్షన్లు ఇస్తూ వచ్చారు. ఏటా కోటాను పెంచారు.
2014లో 9 గంటల హామీ ఇచ్చి.. నీరుగార్చిన బాబు
2014 ఎన్నికలకు ముందు వ్యవసాయానికి 9 గంటల హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా అటకెక్కించారు. రైతులు భార్య పిల్లలను పట్టించుకోకుండా అస్తమానం పొలాల్లో జాగరణ చేసేవారు. కటిక చీకట్లో విష పురుగుల మధ్య గడపాల్సి వచ్చేది. ఎందరో పాము కాట్లకు బలయ్యారు. రాత్రి కరెంటుతో ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడ్డారు. ఒక్కో రోజు కనీసం మూడు నాలుగు గంటలు కూడా కరెంట్ సరఫరా అయ్యేది కాదు. పైగా ఫీడర్లు బాగా దెబ్బతిన్నా పట్టించుకోలేదు.
నేడు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా
చంద్రబాబు హయాంలో రాత్రి కరెంటు వల్ల ఇబ్బందులు పడిన రైతుల వేదన విన్న వైఎస్ జగన్ పగలే 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తామని పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 7 గంటల నుంచి 9 గంటలకు సరఫరా పెంచి అమల్లోకి తెచ్చారు. అందుకు దాదాపు రూ.1800 కోట్లు ఖర్చు చేసి సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, ఫీడర్ల సంఖ్యను పెంచడంతో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో నాలుగేళ్లుగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందుతుండడంతో రైతులు నిశ్చితంగా ఉన్నారు.
మరింత మెరుగ్గా సరఫరా కోసం స్మార్ట్ మీటరింగ్
వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. వ్యవసాయ సరఫరా, మోటారు వాడకాన్ని బట్టి కొంత విద్యుత్ (లైన్‌లాస్) వృధా అవుతుంది. దీనిని నివారిస్తే విద్యుత్ ఆదా కావడంతో పాటు మెరుగైన విద్యుత్ అందుతుంది.
కనెక్షన్ వద్ద మీటరు ఏర్పాటు చేస్తే ఆ రైతు నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నాడో తెలియడంతో పాటు నెల నెలా ఆ యూనిట్లకు అయ్యే సొమ్మును ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఆ డబ్బును తిరిగి విద్యుత్ పంపిణీ సంస్థకు రైతు చెల్లిస్తాడు. దీని వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోగా.. విద్యుత్ సంస్థకు జవాబుదారీతనం, బాధ్యత పెరుగనుంది.
రైతన్నకు అన్ని విధాలా భరోసా
►దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ (అటవీ), దేవదాయ భూముల సాగుదారులకు ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది.
► విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు అన్ని సేవలు గ్రామంలోనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)లను తీర్చిదిద్దారు. వీటి ద్వారా ధృవీకరించిన, కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల పంపిణీతో పాటు ఈ – క్రాప్ నమోదు చేస్తున్నారు.
►అర్హులైన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, పంట నష్ట పరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.
►ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్‌టీ (గోనె సంచులు, ధాన్యం లోడింగ్‌కు హమాలీ ఖర్చులు, ధాన్యాన్ని కల్లం నుంచి కేటాయించిన మిల్లుకు చేర్చే వరకు రవాణా చార్జీలు) రూపేణా క్వింటాల్‌కు మద్దతు ధరకు అదనంగా రూ.300 అందిస్తోంది.
యంత్ర సేవా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్స్
►రూ.2,016 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
►దళారులు, కమీషన్ ఏజెంట్లకు స్వస్తి పలుకుతూ మహిళా డెయిరీ సహకార సంఘాల ద్వారా పాలు సేకరిస్తున్నారు. ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు లీటర్ గేదె పాలకు రూ.22 వరకు, ఆవు పాలకు రూ.11 వరకు అదనపు లబ్ధి చేకూర్చారు.
►విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ.213.27 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 10 పరీక్ష ల్యాబొరేటరీలు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు నిర్మిస్తోంది. తొలి దశలో 75 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి రాగా, నేడు మరో 52 ల్యాబ్‌లను ప్రారంభిస్తున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 127 ల్యాబ్‌ల సేవలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం రూ.1,70,769.23 కోట్ల మేర రైతులకు లబ్ధి కలిగించింది.
ఇదివరకెన్నడూ లేనంతగా పరిహారం
►దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
►వరుసగా నాలుగో ఏడాది 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని నేడు జమ చేయనుంది. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందించింది.
►రైతుల తరఫున ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తోంది. అలాంటప్పుడు వీలైనంత ఎక్కువగా పరిహారం రావాలని కోరుకుంటుంది. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా కొంత మంది టీడీపీ నేతలు పరిహారానికి ప్రభుత్వం కొర్రీ వేసిందని ఆరోపించడం.. వాటిని పచ్చ పత్రికలు పతాక శీర్షికన వండి వార్చడం దుర్మార్గం.
దటీజ్ వైఎస్ జగన్
►కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన హరిజన బడేసావు 2018 జూలై 9వ తేదీన ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన డబ్బు చెల్లించాడు. సీనియారిటీ పేరుతో విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు. వైఎస్ జగన్ వచ్చాక కనెక్షన్ మంజూరైంది. ఇలా ఒక్క సి.బెళగల్ మండలంలోనే 37 మంది రైతులకు కనెక్షన్లు ఇచ్చారు.
► ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేల దరఖాస్తులు క్లియర్ చేశారు. ప్రస్తుతం రైతు దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో అంచనా (ఎస్టిమేట్లు) వేస్తున్నారు. ఒక్కో రైతుకు సుమారు రూ.65 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వెచ్చించి నెల రోజుల్లో విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు.
►ఈ పథకం కింద 2023 మే 30 నాటికి రాష్ట్రంలో 19,11,032 కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ల కోసం మాత్రమే రూ.2,205.79 కోట్లు ఖర్చు చేసింది. 1.69 లక్షలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసింది. రోజుకు 6.30 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ప్రతి ఏటా ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది.
►వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు రూ.1,700 కోట్లతో ఫీడర్లు, సబ్ స్టేషన్లను ఆధునీకరించారు. రానున్న 30 ఏళ్ల పాటు రైతన్నలకు ఉచిత వ్యవసాయ విద్యుత్తుకు ఢోకా లేకుండా ఎస్‌ఈసీఐతో ఒప్పందం చేసుకుని 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
నిమ్మ తోటను పొయ్యి కింద కట్టెల్లా అమ్మి..
ఈ రైతు పేరు గొడ్డేటి నారాయణరెడ్డి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామం. దశాబ్దాలుగా నిమ్మతోట సాగు చేస్తూ జీవిస్తున్నాడు. 2004కు ముందు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, బిల్లులు చెల్లించలేక ఒక పర్యాయం ఎండిపోయిన తోటను వంట చెరకుగా అమ్ముకున్నాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్ అందిచడంతో తిరిగి నిమ్మ మొక్కలు నాటుకుని, తోట నుంచి రాబడి పొందుతున్నాడు. ఈ పథకం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట అరకొర విద్యుత్‌తో ఇబ్బందులు పడ్డాడు. నాలుగేళ్లుగా పగటి పూటే కరెంట్ ఇస్తుండటంతో ఆనందంగా సాగులో నిమగ్నమయ్యాడు.
శోకం.. ఆనందం.. పరిమళం
కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు ఎస్.మునిస్వామి. తనకున్న పొలంలోని బోరులో రెండు ఇంచుల నీరు ఉండడంతో పత్తి, ఇతర పంటలు పండించుకుంటున్నాడు. 2004 ఏప్రిల్ నాటికి తన విద్యుత్ కనెక్షన్ల బకాయి రూ.24 వేలకు చేరింది. కట్టేందుకు డబ్బు లేక, విద్యుత్ సిబ్బంది ఒత్తిళ్లు తట్టుకోలేక తన రెండెకరాల పొలం అమ్ముకుందాం అనుకున్నాడు. నాడు అతని పొలం ఎకరం ధర రూ.10 వేల వరకు మాత్రమే ఉండేది.
రెండెకరాలు అమ్మినా బకాయి తీరదని ఆందోళన చెందుతున్న సమయంలో మహానేత ఇచ్చిన ‘ఉచిత విద్యుత్’ హామీ అతనిలో ధైర్యం నింపింది. ఆ తర్వాత వైఎస్సార్ సీఎం కాగానే రూ.24 వేల బకాయి మాఫీ అయ్యింది. మహానేత తదనంతరం ఎప్పుడు కరెంట్ వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ఇక్కట్లు పడ్డాడు.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక పగలే 9 గంటలు సరఫరా చేస్తుండడంతో మల్లెపూలు, కూరగాయలు పండించుకుంటున్నాడు. మల్లె పంట మంచి లాభాలు తెచ్చిపెడుతోందని సంబరపడుతున్నాడు. రాత్రి కరెంటు కష్టాలు తీరాయని, మెరుగైన విద్యుత్ అందించేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తప్పేమీలేదని, పైగా జవాబుదారీతనం పెరుగుతుందని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment