అమరావతి వైపు ముఖం చెల్లక, విశాఖ కూడా వెళ్ళలేక సరాసరి ‘బోడికొండ’ ఆలయానికి తన దండును తరలించాడు చంద్రబాబు నాయుడు. నిరాదరణ పాలైన ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ అవసరం అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్‌కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అడుగడుగునా ‘మోకాళ్లు’ అడ్డుపెట్టజూస్తూ కుప్పగూలిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు తన రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న ‘యజ్ఞం’గా ఇది కనపడుతోంది. కానీ చంద్రబాబు ప్రయత్నం ‘దింపుడు కల్లం’ సామెతను గుర్తుతెస్తోంది.
‘వస్తువు ఒకచోట, అనుమానం వేరొక చోట’ అన్నది మన ప్రసిద్ధ సామెతల్లో ఒకటి. అందుకే ‘బోడితలకూ మోకాలికీ ముడి’ ఎలా కుదురుతుందంటారు. బోడికొండ (విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం)పైని కోదండ రామస్వామి దేవళానికీ, అదే ఊరిలోని రామతీర్థం ప్రసిద్ధ దేవాలయానికీ ముడిపెట్టడం ఒక్క రాజకీయులకే చెల్లుబాటైన విద్య. అసలు ఘటన జరిగింది ‘ఉత్తరాంధ్ర అయోధ్య’గా కొందరు పేరుపెట్టుకున్న రామతీర్థం ఆలయంలో కాదని విజ్ఞుల అభిప్రాయం. కొందరి మాన సిక తృప్తికోసం రామతీర్థం ఆలయానికి ‘ఉత్తరాంధ్ర అయోధ్య’ అని నామకరణం చేశారు.
కాగా, నాలుగు రకాల పార్టీలు, నాలుగు నాల్క లతో అపారమైన ‘దైవభక్తి’తో ‘బోడికొండ’ గుడిని విస్మరించి, రామ తీర్థం ఆలయం వద్ద యుద్ధభేరీలు మోగించి తలపట్లు పట్టుకోవడం, పరస్పరం ఒక మేరకు గాయపడటం, దాన్నొక సినిమా సీరియల్‌గా మార్చడానికి ప్రయత్నించడం, కేసులు పెట్టుకోవడం దాకా లాగిం చేశారు. కాగా దీనంతటికీ వాస్తవంగా సంబంధం ఉన్న బోడికొండ పైని ఆలయం మాత్రం వెనక్కి జారుకుంది. సాయంసంధ్యలో ఏనాడూ ధూపదీప నైవేద్యాలు ఎరుగని ‘బోడికొండ’పైని ఆలయంలో రామ విగ్రహాన్ని కచ్చితో ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉంటుందన్నది ఒక యక్షప్రశ్నగా మారింది.
ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంలో, ముఖ్యంగా పేద, దళిత వర్గాల ప్రజలు దశాబ్దాల తరబడిగా కునారిల్లి పోవడానికి కారణమైన వర్ణ వ్యవస్థకు, వర్గ దోపిడీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న రాజకీయ పక్షాలు, రాజకీయులే కారణం. ఈ వర్ణ, వర్గ వ్యవస్థలో పోలీసులు కూడా ఒక భాగమైనందున ప్రజాబాహుళ్యానికి కలగ నున్న ఇబ్బందుల్ని జాతిపిత గాంధీజీ ఏనాడో దేశ స్వాతంత్య్రం ఆవిష్కరించబోతున్న ఘడియలకు ఐదురోజులు ముందుగానే ఒక హెచ్చరికగా ఇలా అన్నారు: ‘వర్గ, వర్ణవ్యవస్థలో పోలీసుల ప్రవర్తన కూడా కుల, మతాలకు ఆసరాగానే ఉంటుంది. ఈ దుర్మార్గపు పరి ణామం ముందు కూడా కొనసాగే పక్షంలో దేశ భవిష్యత్తు అంధకా రంగా ఉంటుంది. అందువల్ల కుల, మతాలకు అతీతంగా నిష్పాక్షి కంగా పోలీసులు ఆచరణలో వ్యవహరించగలరని ఆశిస్తున్నా. అంతే గాదు, తమ వృత్తిధర్మాన్ని పోలీసులు హుందాగా నిర్వహించి గౌరవ నీయులు కాగలిగి పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతమైన శక్తిగా రూపొందించాలి.’ (10–08–1947) అంతేగాదు, కుల, మతాలకు అతీతంగా సకల మత సమ్మేళనంగా హిందువులు, ముస్లింలు తదితర వర్గీయులూ ఉండాలని గాంధీజీ కోరుకున్నారు.
నౌఖాలీ (బెంగాల్) పర్యటన సందర్భంగానే గాక, ఆ తరువాత ఆఖరిశ్వాస వరకు హిందూ మతోన్మాది తుపాకీగుండుకు బలి అయ్యే క్షణం దాకా కూడా ఈ సామరస్యాన్ని ఆయన కోరుకున్నారని మరువరాదు. బహుళ జాతులతో, బహుభాషా మైనారిటీలతో, బహుళ మత విశ్వాసాలతో, విభిన్న తెగల సంస్కృతితో కూడుకున్న ఈ అఖండభారతం భవిష్యత్తు అందరూ స్నేహితులుగా, అన్నదమ్ములుగా కలసిమెలసి ఉండటం లోనే భద్రంగా ఉండగలదని ఆశించారు గాంధీజీ. నిజమైన మత విశ్వాసానికి ఓరిమి, సహిష్ణుత ఆభరణం, అలంకారమని; అలాంటి సర్వమత విశ్వాసాల భారతదేశాన్ని నిలువునా చీల్చి రెండు భాగా లుగా విడగొట్టే కంటే, ఆ విషాదకర సన్నివేశాన్ని కళ్లారా చూడకుండా తనను దూరం చేయండని గాంధీ ఘోషించాడు.
అలాంటి పరిణామం ఇప్పుడు మరో రూపంలో జరుగుతోంది. అసంఖ్యాక పేద, దళిత వర్గాల ప్రజలు దగ్గర కాకుండా వారిని రకరకాల ప్రలోభాలతో విడగొట్టి తమ దోపిడీని శాశ్వతం చేసుకొనే ప్రయత్నంలో పలు సంపన్న వర్గాలు, పెట్టుబడి వర్గాలు వారికి నాయకత్వం వహిస్తున్న అవినీతిపరులైన రాజకీయపక్షాలు 74 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా చేయని ప్రయత్నం లేదు, అకృత్యమూ లేదు! అందుకే మతాన్ని కాదు, మీ గుండెల్ని ప్రేమాస్పద కేంద్రాలుగా మలచుకొనమన్నాడు మహాత్ముడు. సైలెంట్‌గా ఉన్న సమాజాల్ని వైలెంట్‌గా మలచడమే అన్ని మతాలలోని విద్వేషకుల లక్ష్యం. ప్రేమ వివాహాలకు, మతాంతర వివాహ సంబంధాలకు కూడా మతంరంగు పూయడం 2014 తర్వాతనే పాలకుల విధానాలకు పుట్టిన ‘పుండు’! హిందూ ధర్మసూత్రాల ప్రకారం ‘కాషాయం’ పవిత్రమైన రంగు అయినపుడు ఆ ముసుగులో జరిగే దాడులూ, హింసాకాండను ప్రజలు ఎలా సహిస్తారు? ఇలాంటి తంతే పాకిస్తాన్‌లోని మత దురహంకార ముస్లిం పెద్దలూ నిర్వహించి అశాంతికి కారకులవుతున్నారు. ఈ ప్రజా వ్యతిరేక సమాజ వ్యతిరేక చర్యలన్నీ మతం ముసుగులోనే జరుగు తున్నాయి. పాలకుల ఆశీస్సులతోనే సాగుతున్నాయి.
‘మతం మత్తుమందు’ అని మార్క్స్ మహనీయుడంటే విరుచు కుపడిన వర్గాలు ఆ మత్తుమందులోనే ‘లవ్ జీహాద్‌ల’ పేరిట మతాం తర (హిందూ–ముస్లిం లేదా కులాంతర) వివాహాలను నిషేధిస్తూ, స్వతంత్ర భారతం 74వ ఏట కూడా సిగ్గులేకుండా చట్టాలు చేస్తు న్నారు. ఆహార నియమాలపై శాస్త్రీయ దృక్ప«థంతో కాకుండా మతం పూతతో నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. ఒక్కమాటలో– వందేళ్ళనాడే మహాకవి గురజాడ అన్నట్టు ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మను షులు చేసిన దేవుళ్లారా’ ఇంతకూ మీ పేరేమిటని మనం మరోసారి ప్రశ్నించుకోవలసిన దశ వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవలనే ప్రసిద్ధ సాహితీ చరిత్రకారుడు, అకడమిక్ స్కాలర్ అయిన రక్షానంద జలీల్ వ్యంగీకరించి, వర్తమాన నవ భారతంలో ‘హిందూ గులాబీ కన్నా ముస్లిం గులాబీ వాసన వేరుగా ఉంటుంది కాబోలు’ అని ఓ కానరాని చురక వేశాడు. ఎదిగిన ఇద్దరు స్త్రీ పురుషులు మతాంతర లేదా కులాంతర వివాహాలు ఇష్టపడి చేసుకున్నప్పుడు జోక్యం చేసుకొనే అధి కారం ఎవరికీ లేదని హైకోర్టులూ, సుప్రీంకోర్టూ చెప్పినా, సెక్యులర్ రాజ్యాంగ చట్టం నిర్దేశించినా– మతంమత్తు నుంచి పాలక శక్తులు బయటపడలేక సెక్యులర్ వ్యతిరేక చట్టాలు రూపొందిస్తున్నాయి.
తినడానికి మెతుకు దొరక్క అల్లాడుతున్న వాడికి మతం అన్నది మనసుకు కొంత ఊరటగా, ఆశాకిరణంగా మార్క్స్ భావించాడేగాని అది ‘ఖుషీ లోక బాంధవుడు సేవించే ఓ గ్లాసు పెగ్గు’ లాంటిదని ఎక్కడా చెప్పలేదు సుమా! పెక్కు ప్రపంచ దేశాలు తిరిగి, పలు మతా లను అధ్యయనం చేసిన భారతీయ మహా పండితుడు, ‘త్రిపీఠికా చార్యుడు’, స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తర, దక్షిణ భారతంలోని పలువురు మేధావులను ప్రభావితం చేసిన బహు గ్రంథకర్త రాహుల్ సాంకృత్యాయన్ చివరికి ఒక నిశ్చితాభిప్రాయాన్ని ఇలా ప్రకటించాడు: ‘మానవజాతి ప్రగతిపథం వైపు వేసిన ప్రతి అడుగూ రక్త తర్పణంతోనే సాగింది. మానవ రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మా చార్యులే కారణం, వారే బాధ్యులు. ఏ ఒక్క మతమూ, ఏ ఒక్క మతా చార్యుడూ గర్వించాల్సింది ఏమీలేదు!’
ఈ విషయం తనకు తెలియకపోయినా తెలుసుకోవాలన్న తపన లేని రాజకీయుడు చంద్రబాబు. కాబట్టి సూట్లతోనూ, బూట్లతోనూ గుడిగడపలు తొక్కడం అతడికి అలవాటు. ఒకవేళ ఎక్కడైనా పూజలు నిర్వహించినా అవి దొంగపూజలు కాబట్టే భక్తి అంతా బూట్లమీదనే ఉంటుంది. అమరావతి వైపు ముఖం చెల్లక ప్రయాణాలు చాలించు కుని విశాఖ కూడా వెళ్ళలేక సరాసరి ‘బోడికొండ’పైని ఆలయానికి తన దండును తరలించాడు. నిజానికి పుణ్యక్షేత్రంగా విజయనగర రాజులు నిర్మించిన రామతీర్థానికి, ఘటన జరిగిన బోడికొండపైని ఆలయ విధ్వంస ఘట్టానికి సంబంధం లేదని స్థానికుల అభిప్రాయం. ఆ మేరకు విజయనగర రాజ కుటుంబానికీ, దయ్యాలకొండగా మారి ప్రేమికుల విలాస యాత్రలకు స్థావరంగా మారిన బోడికొండ ఘట నకూ సంబంధం కల్పించాల్సిన అవసరం అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా ప్రతిపక్షానికే ఉంది.
పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు జరుపుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ‘మోకాళ్లు’ అడ్డుపెట్ట జూస్తూ కుప్పగూలిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు తన రాజకీయ పునరా వాసం కోసం చేస్తున్న విఫల ‘యజ్ఞం’గా ఇది కనపడుతోంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నం ‘దింపుడు కల్లం’ సామెత లాంటిది. పుంగనూరు సంస్థానం కూడా వెనకటికి చిత్తూరు జిల్లా లోనిదే. అది ‘వెర్రిబాగుల సంస్థానం’ అని పేరుపడింది.
ఒక్కో ఊరుకి ప్రతి ప్రాంతంలో ఒక అవివేకపు ఖ్యాతి ఉండేదట. ఆశపోతువాడు గోచిపాతలో ముప్పందుం మూట గట్టుకుని పోదామనుకున్నాడట. ఆ బాణీలోనే అమరావతిలో భంగపడి, కాశీకి పోయినా శని తప్పనట్టు రామతీర్థం పేరిట బోడికొండ పోయినా బాబోరికి, అతని వర్గానికి సుఖం, సుద్దాంతం లేకుండా పోయింది. ‘మనిషి చేసిన రాయిరప్పకి మహిమకలదని సాగి మ్రొక్కుతు మనిషి అంటే రాయిరప్పలకన్న కనిష్టంగా చూస్తావేమి బాలా’ అన్న గురజాడే మనకు సదా స్మరణీయుడు.
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment