‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఎంతమాత్రం అనుకూలమైనది కాదు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసమని చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం, అంటే 21 గ్రామాలపై కృష్ణానది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ప్రాంతపు భూములన్నీ నల్లరేగడి భూములు కావడం వల్ల 2.5 మీటర్ల నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉన్నందువల్ల అక్కడ భూముల, రహదార్ల నిర్మాణం కోసం రెట్టింపు వ్యయం కావడం అనివార్యం, అమరావతి ప్రాంత భూములు భారీ భవన నిర్మాణాలకు అనుకూలమైనవి కావు. ఈ భూముల్లో ర్యాఫ్ట్ ఫౌండేషన్ (పునాదులు తవ్వి ఇరువైపులా ఇనుప రేకుల్ని దించి కాంక్రీట్ వేయడం) వేయడం పనికిరాదు.’’ – చెన్నై టెక్నాలజీ సంస్థ –ఐఐటీ – పరిశోధనా నివేదిక
‘‘కేరళలో సముద్ర తీరప్రాంతాల, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సుప్రీం కోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. దాని ప్రకారమే కేరళ ప్రభుత్వం మారాడు ప్రాంతంలో నిర్మించిన కొన్ని భవంతులను కూల్చి వేసింది’’ ఇన్ని రకాలుగా దేశంలోని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, పర్యావరణ పరిరక్షణా సాధికార సంస్థలు, దేశ అత్యున్నత న్యాయ స్థానం (సుప్రీంకోర్టు) తీర్పులు, నిశితమైన నివేదికలు కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమ రావతిపై ఇంకా పనికిమాలిన బీరాలు పలుకుతూనే ఉండటం ‘బుద్ధి జాడ్య జనితోన్మాదం’ తప్ప మరొకటి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృత్రిమ విభజనకు బీజాలు నాటడంలో నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభు త్వంతో చేతులు కలిపిన బాబు, రాష్ట్ర విభజనానంతరం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఉండే అవకాశాన్ని జారవిడుచు కున్నాడు. పదేళ్ల వ్యవధిలో స్థిమితంగా నిర్మించుకోవలసిన నూతన రాజధాని ఎంపికను, నిర్మాణాన్ని గురించి ఆలోచించకుండా మధ్యలో ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయి అర్థరాత్రిపూట విజయవాడకు పారిపోవలసి వచ్చిన గాథ అందరికీ తెలిసిందే.
ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి ప్రభుత్వం కృత్రిమంగా విడగొట్టిన ఫలి తంగా ఏర్పడిన నూతన రాష్ట్రానికి నూతన రాజధాని ఎంపికకోసం భూభౌతిక, వాతావరణ, పర్యావరణ వాస్తు శిల్పకళ, ఇంజనీరింగ్ రంగాల్లో దేశంలో నిష్ణాతులైన పలువురు ఉద్దండులతో డాక్టర్ శివ రామకృష్ణన్ అధ్యక్షతన కేంద్రప్రభుత్వం ఒక ఉన్నతాధికార కమిటీని నియమించి మూడు మాసాల్లోగా రాజధాని ప్రాంతంగా ఏది సరై నదో ఎంపిక చేయవలసిందిగా ఆదేశించింది. అలాగే ఆ కమిటీ పర్య టన పూర్తి చేసి, క్షుణ్ణమైన నివేదికను ఇస్తూ, రాజధానిగా పర్యావరణ వనరుల సమతుల్యత ప్రమాణాల దృష్ట్యా ఒక ప్రాంతాన్ని గాక మూడు ప్రాంతాలను ప్రతిపాదించింది. డాక్టర్ జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీకన్నా ముందే శివరామకృష్ణన్ కమిటీ ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ మూడు కమిటీల నివేదికలు... రాజధాని నిర్మాణానికి, నూతన రాష్ట్రంలో పాలనా కేంద్రాల అధికార వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలమధ్య సమతుల్యతకు ప్రాంతాభివృద్ధిలో అసమానతల తొలగింపునకు ప్రతిపాదించిన పరిష్కార మార్గాలు దాదాపు ఒకటిగానే ఉన్నాయి. అంతేకాదు, ముఖ్యంగా, రాజధాని ప్రాంతంగా ప్రాచీన బౌద్ధ క్షేత్రంగా అమరావతి ఎంత గొప్పదైనా సముద్రతీరప్రాంతానికి అతి చేరువలో ఉన్నందున భారీ భవన నిర్మాణాలకు, భారీ రహదారి నిర్మాణాలకు తగిన భూములు కావని తాజాగా వెలువడిన సుప్రసిద్ధ చెన్నై ఐఐటీ జరిపిన ప్రత్యేక సర్వే ఫలితాలు కూడా ధృవపరుస్తున్నాయి.
భారతదేశంలోనే సుమారు పది రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాపి తంగా పదిహేను దేశాలలోనూ ఒకటికి మించిన రాజధానులు అవ సరం కొలదీ, పరిపాలనా వికేంద్రీకరణకు, ప్రాంతాల మధ్య అస మానతల నివారణకు అనుకూలంగా ఉన్నాయి. వక్రబుద్ధికి, అబ ద్ధాలకు, వంచనకు అలవాటుపడిన బాబు లాంటి నాయకులు.. ప్రాచీన వైశాలిలోని రెండు ప్రాంతాల ప్రజల మధ్య నదీ జలాల విషయంలో ఏర్పడిన తీవ్ర వివాదాన్ని బుద్ధుడు పరిష్కరించిన తీరును నాయకత్వ లక్షణానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. వర్షాలు లేక నీళ్లకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు ఆ నదీ జలాలు పూర్తిగా మాకు దక్కాలంటే మాకే దక్కాలని రెండు వర్గాల వాళ్లూ కత్తులు దూసుకున్నారు. ఆ వివాదం గురించి విన్న బుద్ధుడు అక్కడికి వెళ్లి ఇరువర్గాల ప్రజలను పిలిచి, ‘ఇంతకూ, మీ వివాదానికి కారణమైన ఆ నీళ్ల విలువెంత? ఆ పంట విలువెంత? అని ప్రశ్నిం చాడు. అందరూ చాలా స్వల్పమని చెప్పారు. అయితే ఈ సమస్యపై కొట్లాటలు, యుద్ధాలు జరిగితే పారే రక్తం విలువెంత? అని ప్రశ్నిం చాడు బుద్ధుడు. దానికి విలువ కట్టలేమని కక్షిదారులుగా మారిన ఇరువర్గాలవారూ ఒప్పుకున్నారు. ‘అల్పమైన విషయాలపై విలువైన మనుషుల రక్తాన్ని, ప్రాణాలను ధారపోస్తారా?’ అని ఆయన ప్రశ్నిం చాడు. దాంతో ఇరుపక్షాలవారి ఆవేశం, ఉద్రేకం చల్లబడ్డాయి.
అయితే, అది బౌద్ధ యుగం, నేడున్నది బుద్ధి గాడి తప్పిన నాయ కుల ఉన్మాద యుగం. కనుకనే బాబు అమరావతి పేరిట పేద, మధ్య తరగతి, పేద రైతుల్ని బెదిరించి, మోసగించి, ఆ ప్రాంత పంట భూములపై బతికే వ్యవసాయ కార్మికుల ఉపాధి అవకాశాలను చెదర గొట్టాడు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల పాల్జేసి, వందల కోట్లు చెల్లించుకోవాల్సిన వడ్డీలతో రాష్ట్రం నడ్డి విరగ్గొట్టాడు. కూడబెట్టిన సంపాదన చాలక అమరావతి ప్రాంత ప్రజలకు ‘నవ ధాన్యాలకు తోటకూర కట్ట’ ఇచ్చినట్లుగా ఒక ‘ప్లాటినం గాజు’ను బహూకరణగా చూపి, ‘అమరావతి ఉద్యమం’ పేరిట కల్లోలం సృష్టిం చడానికి పన్నుగడ పన్నారు. ఈ ఉద్యమానికి కార్యకారణ సంబంధ మంతా.. బాబు బినామీ మోతుబరులకు చౌకరేట్లకు పేద సాదల భూముల్ని ధారాదత్తం చేసి, వాళ్ల ఇళ్ల నిర్మాణానికి ముదరాగా స్థలాలు చూపుతానన్న మోసపూరిత హామీలతోనే ముడిపడి ఉందని మరవరాదు. లేకపోతే అటు జగ్గయ్యపేట నుంచి, ఈ కొసన మొవ్వ దాకా భూముల ఆక్రమణకు అవకాశమివ్వడంలో అర్థం ఉండదు.
బాబు హయాంలో గత అసెంబ్లీలో అర్ధంతరంగా, ప్రతిపక్షంతో చర్చించకుండా అమరావతిని తీరూ, తెన్నూ లేకుండా రాజధానిగా చేస్తామంటూ ఒక తీర్మానాన్ని బాబు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్ స్వాగతించారు. రాజధాని నిర్మాణానికి కేటా యించిన 30 వేల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉండాలిగానీ, ప్రైవేట్ భూముల్ని కొనుగోలు చేసే రాజధానిగా ఉండరాదన్న షరతుపైన వైఎస్ జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారు. చదువుల కోసం, ఉద్యోగ సద్యోగాల కోసం రాజధానికి వచ్చే వారికి, స్థిరపడగోరేవారికి ఇళ్ల అద్దెలు భరించగల స్థితిలో ఉండటానికి వీలుగా ప్రభుత్వ భూములు అయితేనే వెసులు బాటు ఉంటుందని జగన్ ఆనాటి అసెంబ్లీలో స్పష్టం చేశారు. కానీ బాబు తన బినామీల స్పెక్యులేటివ్ లావాదేవీలకు అనుగుణంగా చౌక ధరలకు రైతుల భూములకు ఎరవేశారు. ఇదే నేటి అమరావతి దుస్థితికి కారణం. అమరావతికి మౌలికంగానే ఏర్పడిన ఈ నష్టం గురించి ఆలస్యంగా అనుభవంలోకి వచ్చినందుననే మరింత కాలయాపన జరగకుండా ఆరుమాసాలలోపే రాజధాని, దాని అనుబంధ సంస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలమధ్య రాజధానిగా, కార్య నిర్వాహక రాజధానిగా, హైకోర్టు బెంచీలు సహా పాలనా సౌలభ్యం కోసం, ప్రాంతాలకు సమీ పంగా అసమానతలకు దూరంగా వికేంద్రీకరించాలన్న మూడు కమి టీల స్థూల ఏకీభావ ప్రతిపాదనలకు ప్రజామోదం లభిస్తోంది.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దెదించడంతో ప్రారంభమైన కుట్ర రాజకీయం మొన్నటి జనరల్ ఎన్నికల్లో (2019) కనీవినీ ఎరుగని శృంగభంగంతో కూడా ముగింపునకు రాకపోవడం వైద్యశాస్త్ర పరి భాషలో ‘జన్యు’లోపం! ఈ ‘జన్యువు’ తనను పాతాళానికి తీసుకు పోవడమేగాక, తనను నమ్ముకున్న వందిమాగధుల్ని, ఈ లోపం నాయకునిలో గమనించలేక ‘గుడ్డెద్దు చేలో పడినట్టు’గా అనుసరించే కొందరు పార్టీ అనుయాయుల్ని కూడా మింగేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఈ లోపం ఎందాకా పాకిందంటే, మధురైలో ఎవడో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఆ వ్యక్తి తెలుగువాడని, జగన్ విధానాలకు నిరసనగా ఆత్మహత్యకు ప్రయత్నించాడనీ చంద్రబాబు అనుయాయులు సోషల్ మీడియాలో ‘ట్వీట్’ చేయడం దాకా పాకి వైరల్ అయింది. అంతేగాదు, 2017లో తుందుర్రులో ఆక్వాఫారమ్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ సందట్లలో మహిళలపై అప్పటి బాబు ప్రభుత్వమే పోలీసుల్ని పురిగొల్పి దాడి చేసిన సందర్భం అది. అప్పుడు తీసిన ఫొటోను ప్రస్తుతం బినామీ మోతుబరుల తరఫున సాగుతున్న అమరావతి ప్రాంత ప్రేరేపిత ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై జగన్ ప్రభుత్వం జులుం చేసినట్టు లోకానికి చూపడం కోసం ఆంధ్రోద్యమం పేరుతో అబద్ధాల కోరుగా మారిన చలసాని శ్రీనివాసరావు ఆ ఫోటోను వాడుకున్నాడంటే రాజకీయ నైతిక ప్రమా ణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతోంది.
ప్రస్తుతం తమ రక్షణకు ఆశ్రయంగా మారిన బీజేపీలోకి మారిన బాబు అనుయాయి, పూర్వాశ్రమంలో బీజేపీతో పొత్తులో ఉన్న బాబు మంత్రి సుజనా చౌదరి వైరాగ్య రోగంతో ‘నేను ఈ దేశంలో ఉండటం వృథా, మరో దేశానికి పోతానని’ మాల్యా, నీరవ్‌మోదీ బాటలో పడ్డారు. ఇవాళ సుజనా, బహుశా రేపు ‘నారా’ వారూ! నిమ్మకు నీరె త్తినట్టు రేపు నిమ్మకూరు అల్లుడి ప్రయాణం కూడా అటేనా?! అలా కాకూడదని ఆశిద్దాం. ఒక ‘ఉంపుడు’ చానల్ అధిపతీ, చంద్రబాబూ చానల్ స్టుడియోలో ఏకాంతంగా కూర్చుని ఎన్టీఆర్‌ని ‘వాడూ–వీడూ’ అంటూ వాడి బొమ్మని పీకేయాలంటూ చేసిన సంభాషణ యథా తథంగా వైరల్ కావడం మనం చూసిందే! అమరావతి ఉంటుంది, బాబు ఉనికి మరెక్కడో?!!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment