మీ మాట తీరు ఇక మారదా బాబూ! | ABK Prasad Guest Column On Chandrababu Behavior With IPS Officer | Sakshi
Sakshi News home page

మీ మాట తీరు ఇక మారదా బాబూ!

Published Tue, Jan 7 2020 12:30 AM | Last Updated on Tue, Jan 7 2020 2:01 AM

ABK Prasad Guest Column On Chandrababu Behavior With IPS Officer - Sakshi

బోస్టన్‌ కమిటీ నివేదిక సారాంశాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున వివరించిన దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం బాబులో పేరుకుపోయిన ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు. మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా, దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరాని వారిగా చేసిందని రాహుల్‌ సాంకృత్యాయన్‌ అందుకే శఠించాడు. ఇలాంటి ధోరణులు చావనందునే, కుల వ్యవస్థకు ప్రతీకగా బాబు, ‘దళితుడుగా పుట్టాలని ఎవడైనా కోరు కుంటాడా’ అని ఎత్తిపొడిచి మనస్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు.

చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర పుంగనూరు సంస్థానమని వెనకటికొక సంస్థానం ఉండేది. ఆ సంస్థానానికి ‘వెర్రిబాగులది’ అనే పేరుండేదట. అదొకప్పటి జమీందారీ పట్టణం. జమీందారీ దర్జాకు తగ్గట్టు దానికి మంచి పేరుండాలి కదా, మరీ ‘వెర్రిబాగులది’ అన్నపేరు ఎందుకొచ్చి ఉంటుంది? ఎందుకంటే, పుంగనూరు రాజూ (జమీందారు), అతడి మంత్రీ, వారి అనుయాయులూ– అందరూ ‘వెర్రివెంగళప్ప’ చేష్టలకు అలవాటు పడ్డారట. అలాగే నెల్లూరు తాలూకాలో ఒక పుంజులూరు పాటి కుటుంబాన్ని కూడా ఎగతాళి పట్టిస్తూ ‘పోరా పుంజులూరు’ అని తిట్టు అర్థంలో వాడేవారట! చంద్రబాబు పేరిట ఇలాంటి సామెతలు ఉనికిలో లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి నుంచి ఆయన చేస్తున్న కుప్పిగంతులవల్ల విభజన అనంతర ఆంధ్రప్రదేశ్‌ అంతకంతా అనుభవిస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత కొంపాగోడూ కోల్పోయిన స్థితిలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన స్థల నిర్దేశానికి శాశ్వత కట్టడాలకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే శాసనసభ సమావేశాలు నిర్వహించుకునే హక్కును కల్పించింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఆ పదేళ్ల వ్యవధిలో నూతన రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రదేశంలో రాజధాని నిర్మాణాన్ని సానుకూలం చేసుకోవలసింది. కానీ ఈలోగా ఓటుకు కోట్లు కేసులో దొరికి పోయిన బాబు ఆ కేసునుంచి బయటపడే మార్గంలేక అర్థరాత్రి అధికార సరంజామాను ఉమ్మడి సచివాలయం నుంచి ఆగమేఘాల మీద పెట్టే–బేడాతో విజయవాడ వైపునకు తరలించుకుపోవలసి వచ్చింది.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం తరఫున నూతన రాజధాని నిర్మాణానికి అనువైన భూసార, పర్యావరణ, వాస్తుశిల్ప ప్రమాణా లకు అనుగుణమైన ప్రాంతాలను సందర్శించి రాజధానికి, సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి వివిధ శాఖలకు చెందిన సకల సాంకేతిక, నిర్మాణ, పర్యావరణ నిపుణులతో కూడిన శివరామకృష్ణ్ణన్‌ కమిటీ నివేదిక సమర్పించగా, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా బాబు తొక్కిపెట్టడం ఓ పెద్ద ప్రహసనం. ఆ నివేదిక స్థానే నాటి మంత్రి నారాయణతో ఒక నివేదికను తయారుచేయించి, నిపుణుల నివేదికను బేఖాతరు చేయించారు. రాజధానిగా అమరావతిని నిర్ణ యించినట్లు చెప్పకుండా కొంతసేపు నూజివీడనీ, గన్నవరం అనీ, విజయవాడ–గుంటూరు మధ్యన అనీ.. ఊహాగానాలు వ్యాప్తి చేశారు. అమరావతిలోని మూడు–నాలుగు పంటలు పండే భూము లపై కన్నుపడి, ఆ భూముల స్వాధీనానికి భూసేకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పేరుతో, మధ్యతరగతి ప్రజలనుంచి తక్కువ రేటుకు భూములు గుంజేశారు, కానీ మోతుబరులు ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చని ఆశించి రాజధానికోసం భూములిచ్చారు. 

తీరా చూస్తే జరిగింది రాజధాని నిర్మాణం కాదు, సినిమా సెట్టిం గులు చూపి అమరావతి ప్రజల్ని మోసగించటం. మంచి పంట భూముల్ని వదులుకోడానికి ఇష్టపడని పేద రైతుల్ని బెదిరించారు, అర్ధరాత్రి పంట భూముల్ని తగలబెట్టించి, పంట భూముల వినా శనం కనబడకుండా తిరిగి అర్ధరాత్రిపూట దున్నించి చదును చేయించ డమూ స్థానిక ప్రజలు కళ్లారా గమనించారు. అన్నింటికన్నా అసలు విషయం–అమరావతిపై కేంద్రీకరణ రాజధాని నిర్మాణం కోసం కాదు, అక్కడి చుట్టుపట్ల భూముల పైన, వాటి విలువపైన, స్పెక్యు లేషన్‌ విలువను పెంచుకోవడం కోసం... పైగా ఒక్క మొన్నటి శివ రామకృష్ణన్‌ కమిటీయే కాదు, నిన్నటి జీఎన్‌ రావు ఉన్నతాధికార కమిటీ, నేటి బోస్టన్‌ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల కమిటీ ఇచ్చిన నివే దికలు కూడా–ఒకే ప్రాంతంలో పరిపాలన, అధికారాల కేంద్రీకర ణకుగాక అభివృద్ధి వికేంద్రీకరణకు ఏక ముఖంగా సానుకూలత వెలిబుచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ, భూసార పరిస్థితులు, తుఫానులు, సముద్ర మట్టానికి అతి తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతా లకు, పంటలకు, వరదలవల్ల ప్రజలకు, నిర్మాణాలకు కలిగే బీభత్సం, హాని వగైరా అంశాలను దృష్టిలో పెట్టుకున్నందునే నివే దికలు వేరుగా వెలువడినా నిర్ణయాలు దాదాపు ఒక తీరుగానే ఉండటం అనుభవ నైపుణ్యంగా పరిగణించాలి. చివరికి శివరామకృష్ణ కమిటీకన్నా ఆరేడేళ్ల ముందే అమరావతి ప్రాంతానికి 15 అడుగుల్లోనే నీరు పైకి ఉబికి వచ్చి ముంచే ప్రమాదం ఉందనీ.. గుంటూరు, విజయవాడ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హైద రాబాద్‌ పర్యావరణ రక్షణ సంస్థ సర్వే వరద హెచ్చరిక చేసింది. వీటన్నింటి సారాంశాన్ని క్రోడీకరించుకుని ప్రజలకు ఓపికతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున వివరించిన ఐఏఎస్‌ అధికారి, దళిత అధికారి అయిన విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం వర్గ, వర్ణ వ్యవస్థా చట్రంలో ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ తెలుగు సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు.

మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరానివారిగా చేసిందని రాహుల్‌ సాంకృ త్యాయన్‌ అందుకే శఠించాడు. అంతేగాదు, ఈ కుల భేదాల్ని బ్రహ్మ ముఖం నుంచి వెలువడ్డ వ్యవస్థగా ప్రకటించి దేశంలో జాతీయ ఐక్యతకు అవకాశమే లేకుండా చేసిందనీ, ‘ఈ ధోరణి సృష్టిలో సర్వ శ్రేష్టుడైన మానవుణ్ణి ఆవుముందూ, కోతిముందూ సాగిలపడేట్టూ చేసిందనీ, పాప పరిహారం పేరిట మానవుల చేత ఆవుపేడనూ తిని పించిందనీ, ఈ ధోరణే సగం జనాభా అయిన స్త్రీలకు నాగరిక అధి కారాలు లేకుండా చేసిందనీ, వందల సంవత్సరాల వరకూ సహగ మనం పేర కోట్లాది తరుణుల జీవితాన్ని బుగ్గిపాలు చేసిందనీ’ మహా పండిత రాహుల్జీ ఆక్రోశించవలసి వచ్చింది. ఇలాంటి ధోర ణులు చావనందుననే, కుల వ్యవస్థకు ప్రతీకగా చంద్రబాబు, ‘దళి తుడుగా పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా’ అని ఎత్తిపొడిచి మన స్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు. 

పైగా, చంద్రబాబు ఎంతటి అబద్ధమైనా, అంత సులువుగా ఆడ గలడంటే– తన ‘దార్శనిక దృష్టి’ ఎంతవరకూ కొడిగట్టుకు పోయిం దంటే, తాను ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం వివరంగా తయారు చేసిన ‘విజన్‌–2029’ నివేదికను బోస్టన్‌ కన్సల్టెన్సీ (బీసీజీ) నిపు ణులు తమ రిపోర్ట్‌లో ‘కట్‌ అండ్‌ పేస్ట్‌’ చేసుకొని కాపీకొట్టి సిద్ధం చేశారని ‘కోత’లు కోయగలిగినంతగా ఆయన ‘విజన్‌’ మసకబారి పోయింది. ఆయన ‘దార్శనిక దృష్టి’ ఎంతగా కొడిగట్టుకుపోయిం దంటే– అమరావతి రైతులతో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధి వర్గం స్వయంగా వచ్చి వారికి, వారి భూములకు ల్యాండ్‌ఫూలింగ్‌ బాధలవల్ల కలిగిన కష్టనష్టాలను చెవులారా విన్న తరువాత చంద్రబాబు కలలు సాకారం కావడానికి నిధులు ఇవ్వడాన్ని నిలిపివేస్తూ బ్యాంక్‌ ప్రకటన చేసింది. ఇదే ప్రపంచబ్యాంకు చంద్రబాబు ‘విజన్‌–2020’కి కూడా నిధులు హామీ పడి షరతులతో బిగించినప్పుడు, ఇదే బాబు పళ్లబిగువు కోసం ‘అబ్బే, ఎలాంటి షరతులు లేవని’ నాడు కోతలు కోస్తే, వెంటనే బ్యాంకు ‘అన్ని షరతులను బాబు అంగీకరించాడ’ని లిఖితపూర్వక పత్రంలో పేర్కొన్నది. ‘అబద్ధాల కోరు నోటికి అరవీశెడు సున్నం’ పెట్టుకున్న సామెత ఎందుకు వచ్చిందో అప్పుడుగానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు.

చివరికి వరల్డ్‌ బ్యాంక్‌ అధినేతలతో (ఉల్ఫోవిజ్‌ వగైరాతో) ఢిల్లీలో ముఖ్యమంత్రి హోదాలో రుణాల కోసం జరిపిన చర్చలలో తాను తప్ప రాష్ట్ర అధికారులు ఎవరినీ ఆయన పాల్గొన నివ్వలేదు. పైగా, బ్యాంకు అనుబంధ సంస్థ అయిన డీఎఫ్‌ఐడీ రుణ సంస్థ అంతవరకూ అందించిన రుణాలు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రజల ప్రయోజనాలకు దోహదపడ్డాయో విచారించి బ్యాంకుకు నివే దిక అందించిన సంస్థ నిపుణ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ జేమ్స్‌మానర్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అవినీతి ఏరులై పారుతోందని పేర్కొన్నాడు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని, ఆయన ఎరుక లేకుండా ఏ పనీ జరగడంలేదనీ ప్రొఫెసర్‌ మానర్స్‌ ఉదహరించాడు. అందుకే మహో న్నత మానవుడు, మహాపండిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘కమాల్‌ పుటి కబీర్‌ వంశాన్ని నట్టేట ముంచాడ’ని చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చంద్రబాబు ప్రవేశం ఒక్క ఎన్టీఆర్‌కే కాదు, యావ దాంధ్ర ప్రజల శ్రేయస్సుకు, రాష్ట్ర ప్రగతికీ వినాశకర పరిణామం. ఎలాగూ ‘దేవతాపురం’గా అమరావతి పేరుండిపోయింది గనుక, దాన్ని అలా తలచుకుంటూ కొలుచుకుంటేనే మంచిదేమో! 


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement