ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- మత ప్రాతిపదికన ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపైన దురుసుగా విరుచుకుపడ్డారు. నిజానికి అంతర్వేదిలో హిందూ రథాన్ని కూల్చిన వారిపై వైఎస్ జగన్ ఆనాడే చర్య తీసుకోవాల్సి వస్తే వారెవరై ఉండేవారు అనేది నడ్డా దాచినా దాగని సత్యం. పైగా, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ప్రకటించడం సాహసమే. ఆది నుంచీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల, వారి నాయకుల విధానాలు, ప్రకటనలు, ప్రవర్తనాసరళి గమనిస్తున్న వారికి ఈ మూడు పిలక తిరుగుడు పువ్వుల సారాంశం ఒకటేనని స్పష్టమవుతుంది.
‘పొద్దు తిరుగుడు పువ్వు బుద్ధికి, పొద్దుకు నిలకడలేదని’ పెద్దలు అంటుంటారు. కానీ, ఆధునిక యుగంలో ఒకటేమిటి, అన్ని వ్యవస్థలు, మరీ ఈ నడమంత్రపు 21వ శతాబ్ది తొలి ఇరవయ్యేళ్లలో పార్లమెంటరీ, పరి పాలనా, శాసన, న్యాయ పత్రికా వ్యవస్థలు పతనావస్థలో మగ్గుతున్నాయి. ఈ దశలో సుప్రసిద్ధ కథకుడు పతంజలి దేశంలో పొద్దు తిరుగుడు పువ్వులకు తోడుగా ‘పిలక తిరుగుడు పువ్వులు’ కూడా ఎలా పుట్టుకొచ్చాయో మహా వ్యంగ్య వైభవంతో ఏనాడో వర్ణించాడు. ఆ కథలో ఓ జడ్జి ‘భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉంద’ని తీర్పు ఇస్తాడు. అదెలాగంటే, ‘ఈ భూమి గుండ్రంగా లేదు కాబట్టే. మన జీవితాలు ఇలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టే, భూమి బల్ల పరుపుగా ఉందని’ తీర్పి చ్చేశాడు. కులాల మధ్య, రాజకీయ నాయ కులు స్వార్థం కొద్దీ తగాదాలు పెంచి, తిరిగి స్వార్థంకొద్దీ అవే కులాల మధ్య చీలికలు సృష్టించి, ఎప్పటికప్పుడు తమ పబ్బం గడుపు కుంటూ దేశంలో శాంతి లేకుండా, రాకుండా చేస్తున్నారన్నది జడ్జిగారి ‘భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగానే ఉందన్న’ తీర్పుకు అసలు కారణం.
నేటి ఆధునిక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక యుగంలో కూడా, ఎంతగా లౌకిక రాజ్యాంగ వ్యవస్థ మన విధుల్ని, ఆచరణను శాసిస్తున్నా, దైనందిన జీవితంలో శాస్త్రీయ, వైజ్ఞానిక దృష్టిని అలవరచుకోవాలని నిర్దేశిస్తున్నా- ఆ పరిధులు ఉల్లంఘించి మూఢ విశ్వాసాలను చాటలతో చెరుగుతూ బతుకులీడుస్తున్నందుననే పతంజలి కథావశిష్టుడైన జడ్జి విసిగి వేసారి ‘భూమి గుండ్రంగా లేదు’ అన్న తీర్పుకు రావాల్సి వచ్చింది. దాన్ని అనుసరించే దేశంలోనూ, అందులో భాగంగా రాష్ట్రాల్లోనూ పిలక తిరుగుడు పువ్వులు ఈ రోజుకీ పుడుతూనే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ-ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఇటీవల విచ్చలవిడిగా తిరుగుతున్న మూడు ‘పిలక తిరుగుడు పువ్వులు’. అవే- తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు.
విచిత్రమేమంటే ఈ మూడూ ఒకే రాజకీయ పంథాకి చెందినవి, ఈ మూడూ ప్రభుత్వరంగ వ్యవస్థకు వ్యతిరేకం, రాజ్యాంగం దేశ వనరులన్నీ దేశ జనాభాలో అత్యంత మైనారిటీలో ఉన్న కొలదిమంది ధనికులు, ఇతర మోతుబరులు అనుభవించరాదని, ఆ సంపద నూటికి 90 మందిగా ఉన్న పేదసాదలకు, దళిత వర్గాలకు, మధ్య తరగతి జీవులకు మాత్రమే దక్కాలన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రా లకు– ఈ మూడు పార్టీలు, వాటి నాయకులూ బద్ధ వ్యతిరేకులు, మతాతీత లౌకిక వ్యవస్థకూ ఆచరణలో వ్యతిరేకులు, గుండె గొంతుకలోంచి పలకని వాజమ్మలు. కాబట్టే ఆ మూడు పార్టీల నాయకులూ, పార్టీలూ ఒకప్పుడు తిమ్ముకున్నా, మరొకప్పుడు కుమ్ముకున్నా, ప్రజా జీవితాల్ని మలుపుతిప్పే సంస్కరణలకు మాత్రం పరమ వ్యతిరేకులు. ఇదెలా ఉందంటే– ‘పిలక తిరుగుడు పువ్వు’ కథలోని ‘ఆలమండ దొమ్మీ కేసు’లో జడ్జిగారు ‘భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగానే ఉంద’ని తీర్పు చెప్పినా ముద్దాయిలు మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధ పడనట్టుగానే ఉంది. ఒప్పుకొనక చేసిన పనేమిటంటే భూమి మూడు గుర్రాల జోడీలాగున్నదని కొత్త వివాదానికి తెరతీసి మళ్లీ గ్రామాల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యారట. ఇలాంటి తంతూ, తతంగమే నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ ‘మూడు పార్టీలు’ నిర్వహిస్తున్నాయి. వీటికితోడు పతంజలి కథలోని ‘కంగాళీ’ ‘చెవిలో తూనీగ’ అనే పత్రికలు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నిర్దిష్ట ప్రజానుకూల సంస్కరణలతో, తన అఖండ పాదయాత్ర ద్వారా పొందిన అనుభవాల నుంచి రంగ రించి ప్రకటించిన నవ సూత్రాలను మించి, అంతకుమించిన కార్య క్రమాలను నిర్దిష్టమైన బడ్జెట్ వనరుల మధ్య పొల్లుపోకుండా ఇచ్చిన హామీలను అమలు జరపడానికి శతథా ప్రయత్నించి, సఫలీకృతుడవుతున్న యువ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గత పాలకుడు చంద్రబాబు గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కల్పించిన అడ్డంకులను ఎదుర్కొంటూ, చివరికి ‘కరోనా’తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ప్రజాశ్రేయస్సుపై శ్రద్ధ వహించి ఆగమేఘాలమీద సకాలంలో వ్యాధి నిరోధక ఇంజెక్షన్‌లు దేశంలోనే భారీ స్థాయిలో సమకూర్చుకున్న కార్యశీలిగా జగన్ నిలబడ్డాడు. అర్ధాంతరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను లోపాయికారీ ఒప్పందాలతో చీల్చినప్పుడు కాంగ్రెస్–బీజేపీలు కేవలం నోటిమాటగా ఇచ్చిన ‘ప్రత్యేక హోదా హామీ’కి ఆచరణలో ఉల్లంఘించి తప్పుకున్న పార్టీలు, పాలకులు కాంగ్రెస్, బీజేపీలే.
తీరా ఇటీవల రాష్ట్రంలోకి అడుగుపెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా-మత ప్రాతిపదికన జగన్ పాలనపైన దురుసుగా విరుచుకుపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో 750 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని, దాడులను అడ్డుకోలేక పోయిం దనీ, ప్రభుత్వం ఒక మతానికి (క్రైస్తవమని ఆయన ఉద్దేశం) కొమ్ము కాయడంతోపాటు, ఆ మతం వారికి భవనాలు నిర్మించి, జీతాలు ఇస్తోందని నడ్డా ఆరోపించారు. నిజానికి అంతర్వేదిలో హిందూ రథాన్ని కూల్చిన వారిపై జగన్ ఆనాడే చర్య తీసుకోవాల్సి వస్తే వారె వరై ఉండేవారో నడ్డా దాచినా దాగని సత్యం. అంతేగాదు, ఇందుకు భిన్నంగా ‘కులమతాలతో, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అందరి సంక్షేమాన్ని కాంక్షించే అసలైన లౌకిక పార్టీ బీజేపీ’ అని ఆయన చాటుకోవడానికి చెడిపోయిన వ్యవస్థలో ‘సాహసం’ అక్కర్లేదు!
అన్నింటికన్నా ఆయన మాటల్లో కొసమెరుపు-బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ప్రకటించ సాహసించడం. ‘పెళ్లికొడుకు ప్రవర్తన కాళ్లగోళ్లు తీయించుకునేప్పుడే తెలిసిపోతుంద’ని పెద్దలంటారు. ఆ ‘కుదురు’ కొందరు జాతీయస్థాయి పాలకులకు, పార్టీ నాయకులకు లేదని వారి పాలనా పద్ధతులను బట్టి ఇప్పటికే తేటతెల్లమైపోయింది. ఎందుకంటే ఆది నుంచీ టీడీపీ, జనసేన పార్టీల, వారి నాయకుల విధానాలు, ప్రకటనలు, ప్రవర్తనాసరళి గమనిస్తున్న వారికీ- బీజేపీ రాష్ట్ర నాయకత్వానికే కాదు, వారి కొందరి జాతీయస్థాయి నాయకుల వైఖరికీ, ఆచరణకూ మధ్య చెప్పుకోదగిన తేడాపాడాలు లేవు. కాబట్టి తమ తమ పయోముఖ విషకుంభ రాజకీయాలు పొక్కకుండా జగన్ పైన, అతని ప్రజాహిత సంస్కరణవాద పరిపాలనపైన వీరు ఒక్కతా టిపైకి వచ్చి కానరాని అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాము కుల, మత రాజకీయాలకు, పాలనకు దూరమంటూనే ఆ మురికి గుంట నుంచి చస్తే బయటపడలేకపోతున్నారు.
స్వాతంత్య్ర పోరాటాలు చేసిన త్యాగాల ఫలితంగా ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వరంగ వ్యవస్థల్ని కుహనా కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఒక క్రమపద్ధతిలో కూల్చివేస్తూ వస్తున్నారు. ఈ ప్రమా దాన్ని రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన డాక్టర్ అంబేడ్కర్.. పండిట్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలి భారత కేంద్రమంత్రి వర్గం నుంచి మంత్రి పదవికి రాజీనామా చేస్తూ, చేసిన చివరి చరిత్రాత్మక ప్రసంగంలోనే హెచ్చరించారని మరచిపోరాదు. పరిస్థితులలో మార్పు రాకపోతే, పాలనా పద్ధతులు స్వాతంత్య్ర లక్ష్యాలకు భిన్నంగా నడచి మతా తీత లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు భిన్నంగా నడిస్తే- ఈ వ్యవస్థను నిర్మించిన ప్రజాబాహుళ్యమే తన చేతులతో కూల్చివేసే ప్రమాదం లేకపోలేదు! ఎందుకంటే మృత్యువు పంచాంగం చూసి పని చేయదట! అందువల్ల పూజకన్నా బుద్ధి ప్రధానం అన్నారు. బహుశా అందుకే మనవాళ్లు లౌక్యంగా ఒక సామెతను గుర్తు చేస్తుంటారు: ‘‘పూజా పునస్కారాలు లేక బూజెక్కిపోయి ఉన్నా గానీ కాస్త నైవేద్యం (నాస్తా) పడేస్తే నా మహిమ చూపిస్తాను చూస్కో అన్నాడట!’’. కరోనా వచ్చి అన్ని భ్రమల్ని పటాపంచలు చేస్తుండటమే వింత! కానీ విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక ప్రగతిశీల ప్రపంచం ముందు పాత, కొత్త మహమ్మారులన్నీ లొంగిరావలసిందే-ఎటుతిరిగీ రోజులే వ్యవధి!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
ఏపీలో ‘3 పిలక తిరుగుడు పువ్వు’లు
Published Tue, Apr 20 2021 12:30 AM | Last Updated on Tue, Apr 20 2021 4:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment