ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం, జనసేన, (Janasena) బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా పట్టుమని పది నెలలు అయినా కాలేదు. కానీ, ఇంతలోనే కూటమిలో లుకలుకలు బెకబెక మంటూ బయ టకు వస్తున్నాయి. 2014లో ఇవే మూడు పార్టీల కూటమి, 2018 నాటికి ఎంత వికృత రూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పడు పాత చేదు గుళికలు గొంతు దిగక ముందే అంతవరకు ఛీ... ఛా... అనుకున్న ఆ మూడు పార్టీల నాయకుల మధ్య ఏ చీకటి ఒప్పందం కుదిరిందో ఏమో కానీ, మళ్ళీ చేతులు కలిపారు. కానీ ప్రస్తుతం కూటమిలో విభేదాలు చాపకింద నీరులా పరుచుకుంటున్నాయి.
అయిష్టంగా, అవసరార్థం ఆలింగనం చేసుకున్న మూడు పార్టీల మధ్య, సయోధ్య ‘నానాటికి తీసికట్టు నాగం భొట్లు’ అన్నట్లు పలచన అవుతోందని, ఎన్నికల సమయంలో కనిపించిన సయోధ్య ఇప్పడు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీల గడప దాటి ప్రజల్లో బలపడుతోంది. అందుకే, రాజకీయ పరిశీలకులు కూటమిలో పరిస్థితి పైకి కనిపించినంత చక్కగా ఏమీ లేదనీ, ఒక విధంగా తుఫాను ముందు ప్రశాంతత వంటి పరిస్థితి రూపు దిద్దుకుంటోందనీ అంటున్నారు.
గత ఆగస్టులో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలలకే... కర్నూల్ జిల్లాలో (Kurnool District) బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మొదలైన కుమ్ములాటల కథ ఇప్పటికీ చల్లారలేదు సరికదా, కొత్తకుంపట్లు వెలిగిస్తోంది. ‘టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీతో సయోధ్య ఎలా సాధ్యం’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేల్చిన తూటా టీడీపీ నాయకత్వానికి గుచ్చుకుంది.
2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో చేతులు కలిపి ధర్మపోరాటం పేరిట చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సాగించిన రాజకీయాలను, ఆ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఆయన వ్యాఖ్యలు, ఇతర నేతలు స్థాయి మరిచి చేసిన దాడిని, చేసిన అవమానాలను బీజేపీ నాయకులు మరిచిపోలేక పోతున్నారనీ; ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి కదలికనూ అనుమానంతో చూస్తున్నా రనీ అంటున్నారు.
కమల దళం అనివార్యంగా మరోమారు చంద్రబాబుతో చేతులు కలిపినా, గతంలో లాగా బాబును విశ్వసించడం లేదనీ... అందుకే, మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)తో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ఇతర పార్టీలను ఎన్‌డీఏ పలుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు అవసరం కారణంగా ఆయ నతో సయోధ్యత ఉన్నట్లు నటిస్తూనే, చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు.
అయితే, బీజేపీ రహస్య వ్యూహం చంద్రబాబుకు తెలియదా అంటే... తెలుసు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు ముసుగు తొడిగి ప్రజలను మాయ చేసేందుకు కేంద్ర సహకారం అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేద్ర మోదీపై కపట ప్రేమను ఒలక పోస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే, ఇద్దరికి ఇద్దరూ ‘నువ్వొకందుకు పోస్తే, నేనొ కందుకు తాగుతున్నాను’ అన్నట్లు ‘ఆస్కార్’ స్థాయిలో ప్రేమ కథను రక్తి కట్టిస్తున్నారు.
ఇలా బీజేపీ – టీడీపీ సంబంధాలు పరస్పర అవిశ్వాసంతో అడుగులు వేస్తుంటే... ఇక టీడీపీ – జనసేన సంబంధాలు ముదిరి పాకాన పడే స్థాయికి చేరుకున్నాయి. నిజానికి కూటమి నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్, ఆయన వీరాభిమానులు ఏమి చెప్పినా, ఒకరిపై ఒకరు లేని ప్రేమను ఎంతగా ఒలక పోసుకున్నా, 2018 నాటి చరిత్ర పునరావృతం అవుతున్న సంకే తాలు స్పష్టమవుతున్నాయని, అస్మదీ యులే అంటున్నారు.
చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య రాజుకున్న విభేదాల కుంపటి మెల్లమెల్లగా కుల కుంపట్లు రాజేసింది. పవన్ కల్యాణ్ కులం లేదు మతం లేదంటూనే కులాన్ని సొంతం చేసుకున్నారు.
కానీ, కులం ప్రాతిపదికన కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా టీడీపీని భుజాన మోసిన తమకు చంద్రబాబు పాలనలో ‘న్యాయం’ జరగడం లేదని అస్మదీయులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఇలా ఎలా చూసినా, ప్రస్తుతం చిన్న చిన్న పగుళ్ళుగా కనిపిస్తున్న కూటమి విభేదాలు మొదటి వార్షికోత్సవం నాటికే బీటలు బారినా ఆశ్చర్య పోనవసరం లేదు.
– రాజనాల బాలకృష్ణ
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 99852 29722
Comments
Please login to add a commentAdd a comment