
ముందు సంపద సృష్టించాలి: సీఎం చంద్రబాబు
ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘బనకచర్ల’
2047నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు చేస్తాం.. మేలో తల్లికి వందనం పథకం అమలు
కేంద్రంతో కలసి మూడు విడతల్లో రైతు భరోసా సాయం
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి.. ఆ తరువాతే ఆ ఆదాయాన్ని సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఆలోచన, ఆశ ఉన్నాయి కానీ.. డబ్బుల్లేవ్..’ అని సీఎం చంద్రబాబు శాసనసభా వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని బయటపడేస్తామని చెప్పారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు కావాలి.
అందుకే కేంద్ర సహకారంతోపాటు అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడతాం’ అని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లు సాధించాలన్నది తన లక్ష్యమన్నారు.
అందుకే రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో డీఎస్సీ ద్వారా 16,354 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో కలసి రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ మూడు వాయిదాల్లో రూ.20 వేలు ఇస్తామన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సబ్ కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. క్వారీ పనుల్లో 10 శాతం వడ్డెరలకు కేటాయిస్తామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. ఉగాది రోజు పీ 4 కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న రూ. 6.50 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.
నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తామన్నారు. ఆ పరిమితి దాటితే ట్రస్టు ద్వారా వైద్య చికిత్స చేయిస్తామన్నారు. 2047 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకూ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. వంశధార ప్రాజెక్టు వరకు పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తామన్నారు.
దేశ రాజధానిని మార్చాలంటున్నారు..!
వాతావరణం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీలో ఉండలేమని, రాజధానిని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యమునా నది పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మనం గర్వపడే రాజధానిగా ఢిల్లీని తయారు చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే శాసన సభకు వస్తామని చెప్పడం సరైంది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment