చంద్రబాబు రాజకీయ మాయా జూదం | Chandrababu Conspiracy to buy YSRCP Rajya Sabha members | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయ మాయా జూదం

Published Thu, Aug 1 2024 5:16 AM | Last Updated on Thu, Aug 1 2024 7:21 AM

Chandrababu Conspiracy to buy YSRCP Rajya Sabha members

శకుని రాజకీయాలకు మరోసారి తెరతీసిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్రేడ్‌ మార్క్‌ కుట్ర రాజకీయాలకు తెరతీశారు. మహా భారతంలో శకునిని తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయా జూదానికి బరితెగించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో కనిపించకుండాపోయిన పార్టీ పరువు నిలిపేందుకు నిస్సిగ్గుగా అడ్డదారులు తొక్కుతున్నారు. 

రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నేతగా ముద్రపడ్డ చంద్రబాబు, మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసే కుట్రకు ఉపక్రమించారు. అందుకోసం ఒక్కో రాజ్యసభ సభ్యుడికి రూ.70 కోట్ల వరకు వెదజల్లేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. శాసనసభలో టీడీపీకి ఎమ్మెల్యేల బలం ఉన్నందున వెంటనే రాజ్యసభకు మళ్లీ అవకాశం కల్పిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు.  

ఒక్కొక్కరికి రూ.70 కోట్లు  
1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ  కి రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేకుండా ప్రాతినిథ్యం కరువవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు వైఎస్సార్‌సీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండటం చంద్రబాబుకు కంటగింపుగా మారింది. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరో రెండేళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ఆమోదించాలన్నా లోక్‌సభతోపాటు రాజ్యసభలో సంఖ్యా బలం అత్యంత కీలకం. ఈ కోణంలోనే వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది. 

ఆ విషయాన్ని అటు అధికార ఎన్‌డీయే కూటమితోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికీ తెలుసు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు జాతీయ పారీ్టల నుంచి విశేష మద్దతు లభించింది. ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాంతో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి, టీడీపీలో చేర్చుకునేందుకు ఆయన కుట్రలకు తెరతీశారు. కొన్ని రోజులుగా కొందరు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులతో తెరచాటు మంతనాలు సాగించేందుకు యత్నిస్తున్నారు. 

అందుకోసం ఎంత భారీ మొత్తం అయినా వెదజల్లేందుకు సిద్ధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 40 నుంచి రూ.70 కోట్ల వరకు ఇస్తామని ఆఫర్‌ చేయడం చంద్రబాబు ఎంతకైనా బరితెగిస్తారనడానికి నిదర్శనం. అంతేకాదు 2014–19 నాటి పరిణామాలకు భిన్నంగా ప్రస్తుతం టీడీపీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయా­లని సూచిస్తున్నారు. అనంతరం ఆరు నెలల్లోపు నిర్వహించే ఎన్నికల్లో శాసనసభలో తమకున్న సంఖ్యా బలంతో వారిని మళ్లీ రాజ్యసభ సభ్యులుగా గెలిపిస్తామని మధ్యవర్తుల ద్వారా కబురు పంపుతున్నారు. అందుకోసం చంద్రబాబు ప్రత్యేకంగా కొందర్ని ఎంపిక చేసి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల వద్దకు పంపిస్తుండటం గమనార్హం.  



బాబు చరిత్రంతా రాజకీయ వ్యాపారమే
వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన చంద్రబాబు చరిత్ర సమస్తం రాజకీయ వ్యాపారమేనన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరోసారి రాజకీయ కుట్రలు, బేరసారాలకు తెరతీశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుట్రకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి ని గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేకు రేవంత్‌ రెడ్డి ద్వారా బ్యాగులో కోట్ల రూపాయలు పంపించి ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. 

ఆ ఉదంతంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్‌ విడిచి పెట్టి, అమరావతికి వచ్చేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ శాసనసభ లోపల, బయట చేస్తున్న పోరాటాలతో చంద్రబాబు బెంబేలెత్తారు. దాంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలతోపాటు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనుగోలు చేశారు. 

వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తూనే ఉన్నారు.  తొలిసారి ముఖ్యమంత్రి అయ్యింది కూడా రాజకీయ కుట్రతోనే.

ఏరు దాటాక బోడి మల్లన్నే..
రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని, అవసరం తీరిపోయాక వదిలేయడం చంద్రబాబు నైజం. 1978 నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చరిత్ర అంతా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్టీ రామారావును 1995లో కుట్ర పూరితంగా పదవి నుంచి తొలగించిన వైస్రాయ్‌ హోటల్‌ కుట్రలో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణలతోపాటు అప్పటి రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు తదితరులు అందరికీ తర్వాత పొగబెట్టి టీడీపీ నుంచి బయటకు పంపారు. అప్పటి రాజ్యసభ సభ్యురాలు జయ­ప్రద పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు పార్టీ నుంచి వెళ్లగొట్టడంతో ఆమె ఏకంగా ఏపీని వదిలి ఉత్తరప్రదేశ్‌కు వలస వెళ్లాల్సి వచి్చంది. 

2014–19లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, కిడారి సోమేశ్వరరావుకు మంత్రి పదవులు ఇస్తానని మాట తప్పారు. అదే వేదనతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. కిడారి సోమేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను చంద్రబాబు ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆయన గతంలో మాటిచి్చ, మోసగించిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరి, తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత.. నాలుగైదు నెలలకు మళ్లీ రాజ్య­సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

ఇంతలో చంద్రబాబు రాజకీయ సమీకరణలను మార్చేస్తారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు వల్ల టికెట్లు ఇవ్వలేకపోయిన టీడీపీ నేతలు, తనకు ఎన్నికల నిధులు సమకూర్చిన బడా బాబులను తెరపైకి తెచ్చి, కొనుగోలు చేసిన వారిని శాశ్వతంగా వదిలించుకునే వ్యూహం పన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement