
అమెరికా కూటమి ఒరలోకి దూరడానికి ఉత్సాహపడింది ఒకప్పటి సోవియన్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్. అయితే, ఉక్రెయిన్‌లో జలవనరులకు, చమురు వనరులకు, అణ్వస్త్ర సంపదకు అనువైన వాతావరణం ఉన్నందునే అమెరికా, ‘నాటో’ల కన్నుపడింది. అన్నింటికన్నా కీలకం గనక – ఉక్రెయిన్ చేతిలో ఉంటే మొత్తం పాత సోవియట్ రిపబ్లిక్‌లనే కైవసం చేసుకోవడం తేలికన్నది వలస సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. అందుకు ప్రలోభాలతో ఉక్రెయిన్ సహకరించి... అమెరికా, నాటోలకు నేడు కేంద్ర స్థానమైంది. ఫలితంగా రష్యా ఉనికిని కాపాడుకోవడానికైనా పుతిన్ ఉక్రెయిన్ పట్ల స్వతంత్ర వైఖరితో ముందడుగు వేయవలసి వచ్చింది. ఈ అమెరికా, నాటో కూటములు ఉక్రెయిన్‌ను రక్షించలేవు.
ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూని యన్‌లో ఉక్రెయిన్ అంతర్భాగం. అలాంటిది ఇప్పుడెందుకు అమెరికా, బ్రిటన్ లాంటి రష్యా వ్యతిరేక దేశాల కూటమిలో భాగమైన ‘నాటో’, తదితర నయా వలస సామ్రాజ్య అనుకూల వ్యవస్థలో అంతర్భాగంగా మారింది? చివరికి భారత వ్యతిరేక రష్యన్ రిపబ్లిక్‌గా కూడా ఎవరి ప్రోత్సాహంతో మారింది? ఇందుకు భారత కేంద్ర ప్రభుత్వ సలహాదారైన కాంచన్ గుప్తా వ్యాఖ్యానాన్ని ఆశ్రయించవలసిందే. నాటో సామ్రాజ్యవాద కూటమికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రవ ర్తనను గుప్తా ఇలా ఎండగట్టారు: ‘‘ఒకవైపున ఐక్యరాజ్యసమితిలో స్థిర మైన ఇండియా వ్యతిరేక వైఖరి తీసుకుంటావు. 1998లో ఇండియా అణుపరీక్షల తర్వాత ఇండియాకు వ్యతిరేకంగా భద్రతా సమితి ఆంక్షలకు అనుకూలంగా ఓటు వేస్తావు. కశ్మీర్‌లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేస్తావు. ఇండియాకు వ్యతిరేకంగా విని యోగించే సైనిక ఆయుధాలను పాకిస్తాన్‌కు అమ్ముతున్నావు. అయినా నీకు ఇండియా సాయం మాత్రం కావాలి!’’
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా, సామ్రాజ్యవాద అనుకూల ఉక్రెయిన్ పరిస్థితులను అర్థం చేసుకోవడం కష్టం. కనుకనే మన దేశంలోని కొందరు సంపాదకులు ఉక్రెయిన్ పరిస్థితులకు వక్ర భాష్యాలు అల్లి మన యువకుల్ని తప్పు అవగాహనలోకి నెడు తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ – ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ స్థితిలో అక్కడ ఉన్నత విద్యాసంస్థల్లో ఇరుక్కుపోయిన పలువురు విద్యార్థుల్ని ఇక్కడ మన దేశంలో కొన్ని పత్రికా సంస్థలు ప్రశ్నిస్తున్న తీరు పరమ పాక్షికంగా తయారైంది. ఉక్రెయిన్‌లో రష్యా జోక్యం వల్లనే యుద్ధ పరిస్థితుల్ని అక్కడి మన పిల్లలు అనుభవించాల్సి వస్తోందన్న అభిప్రాయం ఇక్కడి మన శ్రోతలకు కలుగుతోంది. నిజానికి అక్కడి విద్యార్థుల్ని ఎంతమందిని, ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా – రష్యా చర్యను మాత్రం ఖండించటం లేదని మరచిపోరాదు.
అసలు ఉక్రెయిన్ రిపబ్లిక్ ఉనికి కథ ఇలా ఉంది. 31 సంవత్స రాల క్రితం వరకు ఒక పటిష్ఠమైన సోషలిస్టు రిపబ్లిక్‌గా 1991 దాకా నిలదొక్కుకున్న దేశం పరిస్థితి కృశ్చేవ్, గోర్బచేవ్‌లు రాజ్యాధికారం లోకి ప్రవేశించడంతో పూర్తిగా తారుమారై పోయింది. ‘సంస్కరణ’ల పేరిట సోషలిస్టు సోవియట్‌ను ఒక నాయకుడు ఇండియాలో ‘చెట్టు లెక్కి’ నాటకాలాడితే(ఇండియా పర్యటనలో కృశ్చేవ్ నిజంగానే చెట్లె క్కాడు), మరొక నాయకుడు (గోర్బచేవ్) ఐస్‌లాండ్ రాజధాని నగరం ‘రెక్‌జావిక్’లో అమెరికా కూటమితోనూ, పోప్‌తోనూ చేతులు కలిపి సోవియట్ సంపూర్ణ పతనానికి పునాదులు తవ్వాడు. నాటి నుంచి సోవియట్ పరిస్థితిలోనూ, సోషలిస్టు వ్యవస్థలోనూ దారుణమైన నైరాశ్యం చోటు చేసుకుంది. ఆ పరిస్థితిని మార్చే ‘నాథుడు’ కరువై సోవియట్ కుంటుతూ ‘రష్యా’ రూపంలో అవతరించి పతనావస్థకు చేరిన సమయంలో వ్లాదిమీర్ పుతిన్ తలెత్తి సోవియట్ పాత పుణ్యాన్ని కొంతవరకు నిలబెట్టడానికి తన పద్ధతుల్లో పూనుకున్నాడు.
1985లో గోర్బచేవ్ సోవియట్ నాయకత్వంలోకి ప్రవేశించడం తోనే ప్రారంభమైన సంస్కరణలు... ‘రెక్‌జావిక్’ సమావేశం ద్వారా పూర్తిగా నయా వలస సామ్రాజ్యవాద నాయకులకు అనుకూలంగా మారిపోయాయి. గోర్బచేవ్ రంగ ప్రవేశంతో పాత సోషలిస్టు సోవి యట్ కనుమరుగైపోయి, సోవియట్ రిపబ్లిక్‌లుగా ప్రశస్తికెక్కిన అర్మే నియా, జార్జియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్, బెలారస్, మాల్దోవా, అజర్‌బైజాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బె కిస్తా్తన్, తుర్కుమెనిస్తాన్, కజక్‌స్తాన్ – మొత్తం 14 రిపబ్లిక్‌లు స్వాతం త్య్రాన్ని ప్రకటించేసుకున్నాయి. వీటిలో అమెరికా కూటమి ఒరలోకి దూరి, దాని ఆధ్వర్యంలో ‘నాటో’ సభ్యదేశంగా ఉనికిని చాటుకోవడా నికి సిద్ధమైంది ‘ఉక్రెయిన్’(అంతకుమునుపే ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా ఈ కూటమిలో చేరాయి). ఉక్రెయిన్‌లో జలవనరులకు, చమురు వనరులకు, అణ్వస్త్ర సంపదకు అనువైన వాతావరణం ఉన్నందునే అమెరికా, నాటోల కన్నుపడింది. ఉక్రెయిన్ చేతిలో ఉంటే మొత్తం పాత సోవియట్ రిపబ్లిక్‌లనే కైవసం చేసుకోవడం తేలికన్నది వలస సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. అందుకు ప్రలోభాలతో ఉక్రెయిన్ సహకరించబట్టే పుతిన్ తన ఉనికిని కాపాడుకోవడానికైనా ఉక్రెయిన్ పట్ల స్వతంత్ర వైఖరితో ముందడుగు వేయవలసి వచ్చింది. అందు వల్ల ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభకులూ, దాన్ని కొనసాగించడం ద్వారా లబ్ధి పొంద గోరుతున్నవారూ... సామ్రాజ్యవాద కూటమీ, వారి చంకలో దూరిన ‘ఉక్రెయిన్’ నాయకులే.
అందుకే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణమనీ ఉత్తర కొరియా అభిశంసించాల్సి వచ్చింది. అంతేగాదు, ‘శాంతిభద్రతల’ పేరిట ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందనీ, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతే అది సహించగల స్థితిలో లేదనీ ఉత్తర కొరియా ఈ సందర్భంగా ప్రకటిం చాల్సి వచ్చింది.
చరిత్రలో ప్రజా కంటకులుగా మారిన పాలకులు ఎవరైనా వారి ఆఖరి ‘మజిలీ’ బంకర్లే. నాడు సోవియట్‌ను నాశనం చేసే కుట్రలో భాగంగా నాజీ హిట్లర్, నేడు రష్యాను ధ్వంసం చేసే ఎత్తుగడలో జెలెన్‌స్కీ– ‘బంకర్ల’ను ఆశ్రయించాల్సి వచ్చింది. చరిత్రలో మరొక సారి ఈ గౌరవం తిరిగి రష్యాకే దక్కడం అనుపమానమైన విశేషంగా పరిగణించక తప్పదు.
ఉక్రెయిన్ ప్రస్తుత నాయకత్వం తన పతనావస్థ నుంచి ఇంకా కోలుకునే స్థితి లేదు. అమెరికా ‘నాటో’ కూటములు ఉక్రెయిన్‌ను రక్షించలేవనీ ఇప్పటికే అర్థమవుతోన్నా, ఇక్కడి మీడియా తన వైఖరిని సవరించుకోవడం లేదు. ఎందుకంటే, అమెరికా పెంచి పోషించిన టెర్రరిస్టు బుర్ర ఎలా పని చేస్తుందో ఎక్కడిదాకానో అక్కర్లేదు... ఆసియా వాసి అయిన డేవిడ్ హెడ్లీని బొంబాయి హోటల్‌లో అమె రికా జరిపిన కుట్రలో ఎలా భాగస్వామిని చేసిందో మనకు తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదం, తదితర అంతర్జాతీయ ప్రధాన ఘటనలను గురించి సాధికారిక కథనాలను అందించిన ప్రసిద్ధ జర్నలిస్టు కారె సోరెన్‌సేన్... బొంబాయి హోటల్‌పైన దాడిలో అమెరికా ప్రయో గించిన టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ గురించి ‘ద మైండ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్: స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డేవిడ్ హెడ్లీ’ గ్రంథం వెలువరించాడు. అందులో ఆ దాడికి సంబంధించిన ప్రతి ఒక్క ఘట్టం గురించి పూసగుచ్చి వివ రించాడు. నేడు ఉక్రెయిన్ కథనాలూ ఇందుకు ఏ మాత్రం భిన్నంకావు. మరొక మాటలో చెప్పాలంటే... అమెరికా, ‘నాటో’ కూటమి హస్తం నుంచి రష్యన్–ఉక్రెయిన్ పూర్తిగా విమోచన పొందిననాడు ప్రపం చానికి కూడా శాంతి అని భావించాలి.
ఈ సందర్భంగా ప్రపంచ శ్రామికవర్గ విమోచననే శ్వాసించిన కారల్ మార్క్స్ చెప్పిన మాటలు మరొక్కసారి మననం చేసుకోదగ్గవి. ‘‘శ్రామిక ప్రజలూ, ఆస్తీ – రెండు పరస్పర వ్యతిరేక దృక్పథాలు. కానీ ఒక ఒరలోనే వాటి ఉనికి. ఎందుకంటే, ప్రపంచంలోని వ్యక్తిగత ఆస్తికి (ప్రైవేట్ ప్రాపర్టీ) ఉభయులూ సృష్టికర్తలే. అయితే ఈ పరస్పర విరుద్ధ ప్రయోజనాలుగల ఈ ఒరలో ఎలా ఇమడటం అన్నది అసలు ప్రశ్న. అందుకే ప్రైవేట్ ఆస్తి వ్యక్తికీ, సమాజానికీ ప్రధాన శత్రువు అనేది! ఎందుకంటే ధన సంచులకే అంకితమైపోయిన బుర్రలు యంత్రాలనే పొగుడుతూంటాయిగానీ, ఆ యంత్రాలను నడిపించే కార్మిక శక్తిని గుర్తించడానికి ఇష్టపడవు’’ అన్నాడు. అందుకే ప్రపంచ మహా రచయితలలో ఒకరు, సంపన్న వర్గానికి చెందిన ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ తన వర్గానికీ, ఆ వర్గ ప్రయోజనాలకీ, వారి రాజ కీయ స్వప్రయోజనాలకూ విరుద్ధంగా తిరగబడవలసి వచ్చింది.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment