వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప.. వ్యక్తిగత ‘గోప్యత’కు, భావప్రకటనా స్వేచ్ఛకూ భంగం కలిగించడానికి తాము వ్యతిరేకమని న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. పెగసస్ గూఢచర్యంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించడానికి ఇదే కారణం. పౌరులపై, ప్రముఖులపై నిఘా ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు కేంద్ర పాలకులు ఈ రోజుదాకా సమాధానం ఇవ్వకుండా ‘మూగనోము’ పట్టి కూర్చుంటున్నారు. కానీ, మన జాతీయ భద్రతకే ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‘‘ఇతర దేశాలలో ఇజ్రాయెల్ జరిపే గూఢ చర్యం నిమిత్తం ఆయా దేశాలలో ‘కూపీలు’ తీయడానికి ఉపయోగించే ప్రత్యేక నిఘా సాఫ్ట్‌వేర్ ‘పెగసస్’. దీన్ని ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే ఇజ్రాయెలీ కంపెనీలు విక్రయించుకోవచ్చు. పెగసస్ గూఢ చర్య వ్యవహారం భారత ప్రభుత్వ సొంత వ్యవహారం.’’
– భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా కొత్తగా నియమితులైన నోర్ గిలాన్ ప్రకటన (28–10–2021)
ఇటీవలి చరిత్రను అవలోకిస్తే, ఇజ్రాయెల్‌ను అరబ్బుల మధ్య ఒక ప్రత్యేక దేశంగా అమెరికా, బ్రిటన్‌లు సృష్టించిన విషయం గుర్తు కొస్తుంది. పశ్చిమాసియాను, అరబ్ దేశాలను యథేచ్ఛగా దోచుకొని అక్కడి ఇంధన వనరులను తరలించుకుపోయే సాధనంగా ఇజ్రాయె ల్‌ని అమెరికా, బ్రిటన్‌లు వినియోగించుకుంటూ వస్తున్నాయని మర చిపోరాదు. అదే ప్రయోగం మనదేశంలో ఇప్పుడు అంతర్గతంగా జరు గుతోందా అని అనుమానం కలుగుతోంది. కనుకనే ఈ అను భవం దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసస్ గూఢ చర్యంపై తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించవలసి వచ్చిందనిపిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతితో ఎన్.ఎస్.వో. అనే పేరుతో నడుస్తున్న గూఢచర్య సంస్థ తాలూకు నిఘా సాఫ్ట్‌వేర్ పెగసస్ భారత ప్రభుత్వ అనుమతితోనే దేశంలోకి అడుగుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను, ఆందోళనలను తలపెట్టిన రాజకీయ పక్షాలు, పౌరహక్కుల సంస్థలు, ప్రతిపక్షాల కార్యకలాపాల పైన ఒక కన్నువేయడానికి పాలకవర్గం ‘పెగసస్’ ద్వారా గూఢ చర్యా నికి ఒడిగట్టిందని ఆరోపణలు పెల్లుబికాయి. కాని, గత రెండు న్నర సంవత్సరాలకు పైగా తన నిఘా విధానాలపై ప్రబలిపోతున్న అను మానాలు, ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ‘మూగ నోము’ పట్టింది.
దేశభద్రతకు సంబంధించిన ఈ పరిణామాలపట్ల ఆందోళన చెందిన సుప్రసిద్ధ పాత్రికేయులు, పత్రికాసంస్థలు రంగంలోకి దిగి సుప్రీంకోర్టులో ‘రిట్’ పిటీషన్లు దాఖలు చేశాయి. దీంతో ‘డొంకంతా’ కదిలింది. అంతకుముందు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప వ్యక్తిగత ‘గోప్యత’కు, వీరి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడానికి తాము వ్యతిరేకమని కొందరు గౌరవ న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు.
కాగా భారత ప్రభుత్వ అనుమతితోనే భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో, తాము జోక్యం చేసుకుని ఈ గూఢచర్యానికి దిగామని ‘పెగసస్’ సంస్థ తాజాగా అంగీకరించింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి కూడా ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పాలకవర్గాల సమ్మతితో నడుస్తున్న ‘పెగసస్’ గూఢచర్యం తంతు ‘నిగ్గు’ తేల్చడానికీ, మొత్తం వ్యవహారం గుట్టుమట్టులు తేల్చడానికి సుప్రీం గౌరవ ప్రధాన న్యాయమూర్తి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యు లతో కూడిన నిపుణుల కమిటీని ఆయన నియమించారు. ఈ కమిటీకి పలు శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు సహాయ సహకారాలు అందిస్తారు. ఫలితంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికీ, సెక్యులర్ రాజ్యాంగ విలువల రక్షణకూ శాశ్వతమార్గం ఏర్పడగలదన్న ఆశా భావాన్ని పలు ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంస్థలు, నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన ఆందోళనకారులు వ్యక్తం చేశారు.
దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, పౌరహక్కులను కూడా విదేశీ నిఘా సాఫ్ట్‌వేర్ ‘పెగసస్’ ద్వారా కాలరాసే దుర్గతిని అనుమతించ రాదని సీనియర్ జర్నలిస్టు నాయకులు కొంత కాలం క్రితం‘రిట్’ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని కోర్టు గౌరవించి రంగంలోకి దిగవలసి వచ్చింది. దీని పర్యవసానంగానే ‘జాతీయ భద్రత కన్నా మించింది లేదనీ’ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మన జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతున్న ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తన నుంచి ఈ అంశానికి సంబంధించి సానుకూల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈషణ్మాత్రం కూడా ఆశిం చరాదనీ గౌరవ సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించాల్సి వచ్చింది!
అదే సమయంలో న్యాయస్ధానం మరొక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ‘గోప్యత అనేది ఒక్క జర్నలిస్టులకు, లేదా సామాజిక కార్యకర్తలకు మాత్రమే వర్తించేదికాదు, ఈ ప్రాథమిక హక్కుకు భంగం కలగడం అనేది, ‘నా గోప్యతను దెబ్బతీయడానికి ఫలానా ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం పౌరుడికి కల్గడమే’ తప్ప మరేమీ కాదు. గోప్యతకు భంగం కలిగిస్తే, పౌరులు తమ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా ఇకపై అనుభవించలేమన్న భావనకు దారి తీస్తుందని గుర్తించాలని కూడా కోర్టు హెచ్చరించాల్సి వచ్చింది.
పత్రికలు, జర్నలిస్టులు, రానున్న పరిణామాలను ముందస్తుగానే పసికట్టి, ప్రజల్ని అప్రమత్తుల్ని చేస్తారు. కాబట్టి అలాంటి వారిపైన పాలకవర్గాలు ‘నిఘా’ పెట్టడమంటే పత్రికల గురుతర బాధ్యతపైన దాడి చేయడమేననీ, వారి నోళ్లు నొక్కడంగానే భావించాలనీ కోర్టు అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా ఒక ప్రధా నమైన దీపస్తంభమని మరచిపోరాదంటూ, పాలకవర్గాలను సుప్రీం కోర్టు ధర్మాసనం మరోసారి హెచ్చరించాల్సి వచ్చింది. జర్నలిస్టులకు తమ వార్తలకున్న ఆధారాన్ని సంరక్షించుకోవాల్సిన ధర్మం ఉంటుంది. వీరి వృత్తి ధర్మ నిర్వహణపై నిఘా పెట్టడం అంటే, ‘పెగసస్’ ద్వారా ప్రభుత్వం మనదేశంలో సాగిస్తున్న రహస్య కార్యకలాపాలకు సంబం ధించిన విశ్వసనీయ సమాచారాన్ని రాబట్టడాన్ని అడ్డుకోవడమే అవు తుంది. పైగా ఈ బాధ్యతలో ఉన్న పాత్రికేయుల శక్తిని నిర్వీర్యం చేయ డమే అవుతుందని కోర్టు (27–10–2021) హెచ్చరించాల్సి వచ్చిం దని మరువరాదు!
అంతేగాదు, పత్రికాస్వేచ్ఛ అనేది ‘ప్రజాస్వామ్య వ్యవస్థ మను గడకోసం’ చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగా దక్కిన హక్కు అని న్యాయస్థానం గుర్తుచేయాల్సి వచ్చింది. ఇటు ఎన్. రామ్ ప్రభృతులు, మరోవైపు నుంచి ఎడిటర్స్ గిల్డ్– ఇజ్రాయెలీ గూఢ చర్య సాఫ్ట్‌వేర్ ‘పెగసస్’ వ్యవహారంలో ఇరుక్కున్న భారత ప్రభుత్వ పాత్ర గురించిన వివాదంలో స్వతంత్ర దర్యాప్తు విధిగా అవసరమని భావించడం జరిగింది. మనదేశంలో కూడా ఇజ్రాయెల్ ఆధారంగా శరవేగంగా సంభ విస్తున్న పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలించగల వారికి ప్రసిద్ధ తెలుగు సామెత గుర్తుకు రాకతప్పదు. ‘నువ్వులు చల్లి ఆవాలు పండమంటే సాధ్యమా’ అన్నది! అందుకే దాస్యమనేది ప్రతి ఆత్మలో పెరిగే ఓ కలుపుమొక్క అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది.
ఎంతటి ‘ప్రజాస్వామ్య దేశమైనా’ సరే... శాస్త్రీయ సోషలిజం ప్రవక్త కారల్ మార్క్స్ ఒక సత్యాన్ని లోకానికి అందించి పోయాడు. ప్రతీ యుగంలోనూ పాలకవర్గం భావాలు ఆనాటి పాలనా వ్యవస్థ భావాలే. అంటే ఆనాటి సమాజంలో ఏ వర్గం బలమైన భౌతికశక్తిగా పెత్తనం చలాయిస్తూ ఉంటుందో, ఆ శక్తే యావత్ సమాజంపై పెత్తనం చలాయించే ప్రధానమైన మేధాశక్తిగా చలామణీ అవుతూ ఉంటుంది. ఆ శక్తే స్త్రీ– పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను కూడా శాసించే నిర్ణాయక శక్తిగా పెత్తనం సాగిస్తూ ఉంటుంది!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment