ప్రపంచ ప్రముఖులు అనేకమంది ప్రారంభం నుంచి ప్రశంసించిన పోలవరం ప్రాజెక్టును మడతపెట్టడంలో బ్రిటిష్ పాలకులనుంచి భారత పాలకులకు కూడా తిలాపాపం తలా పిడికెడు భాగముందని చెప్పాలి. 1941 జులై నాటికే ఈ ప్రాజెక్టును తలపోసి కార్యాచరణకు దిగిన మహామేధావి శొంఠి వెంకట రమణమూర్తి. తాను ప్రతిపాదించిన రామపాద సాగరం ప్రాజెక్టే నేటి పోలవరం ప్రాజెక్టు. కేంద్రమే కాక ఆంధ్ర ప్రాంతంలోని తొంటి నాయకత్వం చేసిన వక్రభాష్యాల వల్లే పోలవరం ఇంతకాలంగా సాకారం చెందలేదు. కె.ఎల్.రావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి అకుంఠిత దీక్ష వల్లే నిర్మాణం ఇంతవరకూ నెట్టుకురాగలిగింది. అంతే దీక్షా దక్షతతో ప్రస్తుత రాష్ట్ర సీఎం వై.ఎస్. జగన్ సూత్రబద్ధమైన చొరవతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎక్కడా రాజీపడకుండా సకాలంలో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు.
తెలుగు ప్రజల జీవనదులలో ఒకటైన గోదావరి జలాలను బృహత్ ప్రాజెక్టుల ద్వారా సద్వినియోగం చేసుకుని పాడి పంటలను సస్యశ్యామలం కావించు కోవడానికి గత రెండేళ్లుగా తెలుగువారు వెన్నుపోట్లకు గురి కావలసి వచ్చిందో తెలుసుకొని స్వార్థపరుల కుట్రలను ఈ తరం యువతీ యువ కులు అవశ్యం గుర్తుపెట్టుకొని జాగరూకులై ఉండాల్సిన అవసరముంది. సర్ ఆర్థర్ కాటన్ ‘ధాతు కరువు’కు శాశ్వత పరిష్కారంగా ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం తలపెట్టినదే, యావదాంధ్రలోని బీడువారుతున్న పొలాలకు, పంటలకు సేద్య ధారలు పండించడానికి గోదావరి పైన ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును ఊహించి ఆలోచన చేసిన తొలి వ్యక్తి భారత సుప్రసిద్ధ సివిల్ అధికారి శొంఠి వెంకట రమణమూర్తి.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు దేశ స్వాతంత్య్రానికి ముందు 1941 జూలై నాటికే ఈ ప్రాజెక్టును తలపోసి కార్యాచరణకు దిగిన మహామేధావి. అప్పటికి మద్రాసులో ఫోర్ట్ సేంట్ జార్జ్జ్‌తో స్టేట్ అభివృద్ధి కార్యక్ర మాల ప్రధాన సలహాదారుగా ఉంటూ బంగాళాఖాతంలో నీటి ప్రవా హాన్ని పరిశీలిస్తున్న సందర్భంలోనే రామపాద సాగరం ప్రాజెక్టు (అదే పోలవరం) ఆలోచన తట్టింది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి గోదావరి నీరు సముద్రంలోకి చేరకముందే దానిని నిలిపేసి నిల్వచేసి ప్రజా అవసరాలకు వినియోగించడం మంచిదన్న ఊహకు నిచ్చెన వేసినవాడు శొంఠి.
గోదావరి, కృష్ణా నదుల నీటిలో 7 శాతం మాత్రమే ఉపయోగపడుతున్నందున మిగతా జలసంపద సముద్రం పాలవడానికి వీలులేదని భావించినవాడాయన! అంతేకాదు, గోదా వరి నది రెండువైపుల ఉన్న గట్లూ మద్రాసు ప్రెసిడెన్సీలో (అంటే ఆంధ్రప్రాంతం కలిసి ప్రెసిడెన్సీ) ఉండేటట్లుగా స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ‘డ్యామ్’ నిర్మిస్తే ఇతర రాష్ట్రాల వల్ల చిక్కులు ఎదుర్కోవలసిన పరిస్థితులు రావని కూడా ఆలోచించిన వ్యక్తి శొంఠి. పోలవరం దగ్గర్లో పాపికొండల వద్ద గండికి దిగువన గోదావరిపై డ్యామ్ నిర్మించడం సబబని ఆయన భావించి ఆనాడు చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న ఎల్. వెంకట కృష్ణయ్యర్‌ను కూడా ఆ ప్రాంతానికి వెళ్లిరమ్మని పురమాయించాడు. అక్కడికి వెళ్లొచ్చి డ్యామ్ నిర్మాణం సాధ్యమేమని ఇంజనీర్ నివేదిక ఇచ్చాడు.
ఐతే గోదావరి డ్యామ్ అగ్రభాగం భద్రాచల రామాలయానికి అడుగుభాగమై ఉండాలని, అక్కడ తీరం వద్ద పేరుకొనే నిలవనీరై (బ్యాక్‌వాటర్) ఉండాలని శొంఠి చెప్పారు! ఆనాటి అంచనా ప్రకారం ఇక్కడ (పోలవరం వద్ద) బ్యారేజి కడితే రెండు పంటలకూ కలిపి మూడున్నర లక్షల ఎకరాలకు నీరు అందజేయడంతో పాటు 40 మెగా వాట్ల విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేయవచ్చని మద్రాసు ప్రెసి డెన్సీ ఏలికలుగా ఉన్న ఇంగ్లిష్ దొరలకు నివేదిక ఇచ్చాడు! ఈ ప్రాజెక్టుకే ‘రామపాద సాగర్ ప్రాజెక్టు’ అని ఆనాడు పేరుపెట్టడానికి కారణం. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వెళ్లి భద్రాచలం రాములవారి గుడి దాకా వెళ్లే అవకాశం ఉంది కనుక ఆ పేరు పెట్టారు! అందువల్ల శొంఠివారి ‘రామపాద సాగరమే’ నేటి పోలవరం నిర్మాణంలో ఉన్న బృహత్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విశ్వరూపాన్ని 1948లోనే రాజ మండ్రిలో జరిగిన రామపాద సాగర్ ప్రాజెక్టు మహాసభకు అధ్యక్షత వహిస్తూ ఆనాటి అంచనా ప్రకారం శొంఠి ఇలా వర్ణించారు.
‘‘ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏడాదికి 10 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అంటే రోజుకి కోటి రూపాయల విలువైన బియ్యం తయారు అవుతాయి. తెలుగు భూమి ధనధాన్య సమృద్థిని కలిగి యావత్ భారతదేశ కళ్యాణానికి తోడ్పడుతుంది. ఇది ఆంధ్రదేశాన్ని, భారత దేశంలో కెల్లా సుసంపన్నమైన ప్రాంతంగా చేస్తుంది. ఇది అఖిల భార తావని పథకం. ఈ ప్రాజెక్టు (రామపాద సాగర్ / పోలవరం) ఖండాం తరాలలోని ఇంజనీర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇటువంటి నిర్మా ణంలో ప్రపంచ మొత్తం మీదనే రెండవస్థానం ఆక్రమించబోయే ఈ భగీరథ ప్రయత్నానికి సహాయపడదామని మానవబలం, ధనబలం, వస్తుబలంతో అమెరికా వారు కూడా ముందుకు వచ్చారు. మనకు పండించగల రకరకాల పంటలున్నాయి. జలసమృద్ధి ఉంది. వరిపైరు సంప్రదాయం తెలిసిన రైతులున్నారు. కావలసింది పెద్ద ప్రాజెక్టులు. కాని ప్రాజెక్టు నిర్మాణానికి జరిగిన అంతూపొంతూ లేని కాలహరణం తలచుకుంటే ఆశ్యర్యం కల్గుతుందని’’ శొంఠి మొత్తుకున్నారు!
‘అంతేకాదు, ఇలా బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం నడుం బిగించకపోవడమే అత్యంత విషాదకరమని’ సుప్ర సిద్ధ అమెరికన్ ఇంజనీర్ డాక్టర్ జె.ఎల్.శావేజ్ తనకుS పంపిన లేఖను అప్పటికి రిటైర్ అయిన శొంఠి నాటి ప్రధాని నెహ్రూకి పంపితే ఆయన దానిని ప్రణాళికా సంఘానికి పంపారు. పోలవరం ప్రాజెక్టు విష యంలో కేంద్ర ప్రభుత్వంలోనే కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభు త్వానికీ శ్రద్ధలేదు. కానీ, ఉత్తరభారతంలో అదే సమయంలో మూడు ప్రాజె క్టులకు కేంద్రం ధనకేటాయింపుల్ని జరిపింది కానీ ప్రపంచ నిపుణులు పెక్కుమంది ప్రశంసలందుకున్న పోలవరం ప్రాజెక్టును మాత్రం ‘మాడ’బెడుతూ వచ్చింది.
దానికితోడు తెలుగువారికి ‘మద రాసీల’న్న పేరిట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ తప్పుడు వాదు ప్రచారంలో ఉన్నందున, రామపాదసాగరం ప్రాజెక్టు (పోలవరం) గురించి మద రాసు ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి తప్పుడు సమాచారం అందజేస్తూ వచ్చినట్టు ప్రాజెక్టుల ప్రాధాన్యతా నిర్ణయ సంఘానికి అధ్యక్షుడైన గోపాలస్వామి అయ్యంగారే స్వయంగా శొంఠివారికి తెలపడం మరో వక్రబుద్ధి కోణం! ఇలాంటి వక్రబుద్ధులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులం విడివడిపోయినా ఆ తొంటి బుద్ధులు ఆంధ్రనాయ కుల్లో నాటికీ నేటికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా తొలగి పోలేదు.
ఎంతగా బీజేపీతో బాహాటం గానూ లోపాయికారిగాను బాబు భుజాలు రాసుకుని తిరగజూస్తున్నా ప్రధాని మోదీ మాత్రం పోలవరానికి కేంద్రం ఇంతకుముందు మంజూరు చేసిన వాటాధనం వాడకానికి బాబు జమా ఖర్చులు చూప నందుకు ‘కేంద్ర నిధులను ఏటీఎం నుంచి లాక్కున్నట్లుగా దోసిళ్లతో గుంజేసి వాడుకున్నాడని, హావభావాలతో ఎద్దేవా చేశాడని మరచి పోరాదు! నిజానికి ఆదినించీ పోలవరం ప్రాజెక్టును ఆంధ్రులకు అçపు రూపమైన వరంగా భావించబట్టే ప్రధానంగా, కె.ఎల్.రావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభృతుల అకుంఠిత దీక్ష చొరవ కారణంగానే నిర్మాణం ఇంత వరకూ నెట్టుకురాగలిగింది. ఆ తర్వాత అంతే దీక్షా దక్షతతో ప్రస్తుత రాష్ట్ర సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సూత్రబద్ధమైన చొర వతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎక్కడా రాజీపడకుండా సకాలంలో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు.
పోలవరం ప్రాజెక్టు కన్నా తక్కువ ప్రయో జనం గల కోసీ, హీరాకుడ్, ప్రాజెక్టులను ప్రారంభించడం ఇంజ నీరింగ్ నిపుణులకు విడ్డూరంగా తోచింది! అంతేగాదు చివరికి శొంఠి రామమూర్తి 1946లో నాటి బ్రిటి‹ష్ పైస్థాయి లార్డ్ వేవెల్స్ కలిసిన ప్పుడు పోలవరం (రామపాదసాగర్) ప్రాజెక్టు మొత్తం దక్షిణ భారత దేశాన్నే బియ్యం విషయంలో స్వయం సామర్థ్యంగా ఉంచగల దని చెప్పారు. ఆ మాట మీద వేవెల్ తనకు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న వి.పి. మీనన్‌కు (ఈయన తర్వాత భారత హోంశాఖSమంత్రి సర్దార్ పటేల్ కార్యదర్శి) పోలవరం ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టు ఉత్త ర్వులు టైప్ చేయమంటే, మీనన్ తన పూజారి’ డ్రామా తాను ఆడాడు.
ఈ సమస్యపై శొంఠి స్పందిస్తూ ‘తక్కువ వ్యయంతో ప్రజలకు ఎక్కువ మేలు చేసే స్కీమును బుట్టదాఖలు చేసి, అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన స్కీములను మాత్రమే చేపట్టే ప్రయత్నం జరిగిందని’’ అప్పటికే నిందించక తప్పలేదు. ఈ కోవలోనే తన ముఖ్యమంత్రి త్వంలో చంద్రబాబుకు తలపెట్టిన పెక్కు స్కీములపైన ప్రాజెక్టులకైనా దుబారా వ్యయంపైన, అవినీతి పైన ‘కాగ్’ విచారణ సంస్థ పలు వివరాలను బట్టబయలు చేస్తూ వచ్చింది. చివరికి 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పోలవరం ప్రాజె క్టుకు శంకుస్థాపన చేసినా, అక్కడ నుంచి అడుగు ముందుకు సాగ లేదు.
వైఎస్సార్ 2004లో సీఎం అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఫైలును పట్టిన ఏళ్ల తరబడి బూజును దులిపి రంగంలోకి దిగేసరికి ప్రాజెక్టు వ్యయం తడిసి మోపై వేలకోట్లకు పడేసింది! అందుకే విదే శాలలో జవహర్‌లాల్‌కు విశ్వవిద్యాలయంలో సహాధ్యాయి అయి ఉండి కూడా శొంఠి వారి సేవలను గుర్తించకపోవడం విచారకరం. ఆంధ్రులైన తెలుగువారు కూడా శొంఠి సేవలను ఉపయో గించుకుని ఆయనకు బాసటగా నిలువలేకపోయినందుకు ‘అభినవ తిక్కన’ తుమ్మల సీతారామ మూర్తి ఏనాడో అనేక ఇంజనీరింగ్ పథ కాల రూపశిల్పి, ప్రణాళికా సంఘం తొలి సలహాదారైన.. శొంఠి గురించి ఇచ్చిన ఆత్మీయ నివాళిని స్మరించకుండా ఉండలేము.
‘‘శొంఠికి తగ్గ పీఠమునీయలేక చెడెగదా తెలుగువాడని సిగ్గు పడెద’’! (అవును మరి, సిగ్గుకు సిగ్గులేనితనానికి మనం అలవాటు పడ్డాం గదూ?!)
-ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.ina
Comments
Please login to add a commentAdd a comment