ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమంవల్ల ఒకే ఒక్కరోజున పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే రికార్డుగా నమోదయింది. జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యాలను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్‌ను దేశంలో ఏ రాష్ట్రంకన్నా కూడా ముందుగానే సేకరించి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ‘వైరస్‌లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ శాస్త్రీయ దృక్పథాన్ని దేశంలోనే తొలిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని సీఎం వైఎస్ జగన్. ‘రత్నపరీక్ష’ నవరత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు!
‘‘అమెరికా లాంటి సామ్రాజ్యవాద, పెట్టు బడిదారీ దేశాలు క్యూబా లాంటి చిన్న దేశా లపై సాగించిన యుద్ధాలు, పచ్చి దోపిడీ ఫలితంగా అనేక త్యాగాలతో జాతీయ పునర్నిర్మాణం అవసరమైంది. ఫలితంగా క్యూబా విప్లవం అనివార్యమై, దేశ ప్రజా బాహుళ్యం జీవితంలో జీవన విధానాల్లో పరి వర్తన కోసం విప్లవాత్మక చట్టాలు అనివార్యమయ్యాయి. ఈ చట్టాలు మా ప్రజాబాహుళ్యంలో సోషలిస్టు చైతన్య దీప్తిని కల్గించడానికి దోహదం చేశాయి. ఈ చైతన్యం వల్లనే ఆదిలో నిరక్షరాస్యులుగా, అర్ధ నిరక్షరాస్యులుగా బతుకులీడుస్తున్న ప్రజలు తమ బిడ్డలకు చదవను, రాయను నేర్పించగల్గారు. ప్రజావైద్య రక్షణ విధానానికి అంకురార్పణ చేశారు... ఏ దేశ ప్రజలూ బలవంతంగా విప్లవకారులు కాజాలరు. ఎందుకంటే, ఆరోగ్యకరమైన సమాజ పరివర్తన విధిగా కోరుకునే సామాజిక శక్తులు ప్రజా బాహుళ్యాన్ని అణచివేయాలని కోరుకోరు’’!
- క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో
‘‘కోవిడ్–19 ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సిబ్బంది ఏపీలో భారీ స్థాయిలో తలపెట్టిన టీకాల ఉద్యమం వల్ల ఒకే ఒక్క రోజున పద మూడున్నర లక్షల మందికి వ్యాక్సినేషన్ అందడం దేశంలోనే ఒక రికార్డుగా నమోదయింది. ఇది గ్రామ సచివాలయాల, వార్డుల, జిల్లాల స్థాయిలో గత రెండేళ్లకు పైగా స్థానిక వలంటీర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవాతత్పరత వల్లనే సాధ్యమైంది’’.
- పత్రికా వార్తలు (21.6.2021)
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రతిపక్షాల ‘కోణంగి’ చేష్టలను, ప్రకృతి వైపరీత్యాలను, సరికొత్తగా ప్రపంచాన్ని ఊగించి, శాసించ సాహసిస్తు మహమ్మారి కోవిడ్–19ని గత రెండేళ్లలోనూ అనేక సాహస నిర్ణయా లతో వైఎస్సార్‌సీపీ అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదు ర్కొంటూ వస్తోంది. గత ప్రభుత్వం (టీడీపీ) రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వనరులను దోచుకుని, లక్షల కోట్ల రూపాయల అఫ్పులతో ముంచే యగా ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం గత రెండేళ్లకుపైగా హుందాగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నెట్టుకుంటూ వస్తోంది. పైగా, గత రెండేళ్లలో అనేక సామాజిక, విద్యా, వైద్య, రైతు, వ్యవసాయ కార్మిక జనాభా మౌలిక అవసరాలను తీర్చడంలో భాగంగా నవరత్నాల ప్రణాళికను అక్షర సత్యంగా ఆచ రణలో పెట్టడానికి సీఎం జగన్ సాహసించి అమలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చట్టప్రకారమే ప్రత్యేక ప్రతిపత్తిని హామీ పడి వేలు విడిచిన కాంగ్రెస్ పాలకులు, వారు విడిచిపోతూ వదిలి వెళ్లిన పాద రక్షలు తొడుక్కుంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తికి పార్లమెంట్ సాక్షిగా నిండుపేరోలగంలో ‘మేం చూసుకుంటాంగదా’ అంటూ ఆపద్ధర్మంగా ప్రకటించి బట్టలు దులిపేసుకున్న బీజేపీ నాయకత్వం– చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్నదీ, ఆడుతున్నదీ పచ్చి నాటకం! బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగిస్తే తప్ప– ఆ ‘ప్రత్యేక ప్రతి పత్తి’కి రాష్ట్ర ప్రజలు అర్హులు కారేమో!
అవకాశం ఉన్నమేరకు పరిమిత మార్గమధ్యనే ముందుగానే వ్యూహాత్మకంగా నిర్దిష్టమైన ప్రణాళికా కేటాయింపులకు తెలివిగా ‘ప్లాన్’ చేసుకొని, ఆ ప్రకారంగా కేటాయింపులలోనే ప్రజాబాహుళ్యా నికి ముఖ్యంగా అణ గారిపోయిన దళిత, పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలను సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికి ‘నవ రత్నాలకే కాదు, వాటి పరిధిని దాటి కూడా ఎన్ని రంగాలకో ప్రయో జన పథకాలను విస్తరించి అమలులోకి తెస్తున్నారు. ఒకటా రెండా– వ్యవసాయ, సహకార, పశుపోషణ, మత్స్య సంపద, పౌర సరఫ రాలు, గ్రామ, వార్డు సచివాలయాల, గ్రామీణ వలంటీర్ల ఉపాధి, పేదలకు గృహ నిర్మాణాలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థల, ఆర్‌టీసీ, గిరిజన సంక్షేమ, నైపుణ్యం(స్కిల్), విద్యుచ్ఛక్తి, జలవనరుల అభివృద్ధి, ‘కోవిడ్’ తొలగే దాకా అవసరమైన తాత్కాలిక సిబ్బంది వగైరా నియామకాల దాకా– జగన్ ఆలోచన, ఆచరణ విస్తరించి శరవేగాన, ‘ఈ మార్పులు నిజమా’ అని ఆశ్చర్యగొలిపేలా అమలులోకి వస్తున్నాయి.
బహుశా ఈ పెక్కు మార్పులకు ముఖ్యంగా ఆరోగ్య రంగంలో జగన్‌ను పురిగొల్పింది క్యూబన్ అధినేత ఫిడెల్ కాస్ట్రో అని నా విశ్వాసం. స్వయంగా వైద్యుడు, ప్రజా సమస్యలపై స్పందించగలిగిన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి ఉత్సాహ, ప్రోత్సాహాలు కారణమై ఉంటాయి. క్యూబన్ సామాజిక విప్లవంపైన, కాస్ట్రో విప్లవాత్మక సంస్కరణలపైన స్పందిస్తూ మరె వరో కాదు, క్యూబా శత్రువైన అమెరికాకు ఆరోగ్య సమాచార సాంకే తిక వ్యవస్థ జాతీయ సమన్వయకర్త డాక్టర్ డేవిడ్ బ్లుమెంతాల్ ఇలా అన్నాడు: ‘‘క్యూబా ప్రజారోగ్య వైద్య వ్యవస్థ ప్రజల ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ, రక్షణ విషయంలో క్యూబా విజయాలకు సరిపోలిన ఉదాహరణలు అతి తక్కువ. క్యూబాలో చంటి పిల్లల మరణాల సంఖ్య ప్రతి వెయ్యిమంది పిల్లలకు 37.3 నుంచి 4.3కి పడిపోయింది. అమెరికాలో చంటిపిల్లల మరణాల సంఖ్య 5.8 కన్నా క్యూబా సంఖ్య తక్కువ. ఇక 1970 నుంచి 2016 మధ్య అమెరికా పౌరుని జీవన ప్రమాణం 79.8 సంవత్సరాలయితే, క్యూబాలో 70.04 నుంచి 78.7 సంవత్సరాల దాకా ఉంది’’. ఇక అన్నింటికన్నా, మూడు స్థాయిల్లో అంచెలవారీగా అమలులో క్యూబా ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంది. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకు రేయింబవళ్లు సేవలందించడానికి ఒక డాక్టర్, ఒక నర్సు నివసిస్తూ, స్థానిక ప్రజలలో ప్రతి ఒక్క సభ్యుడి ‘ఆరోగ్య వివరాలతో కూడిన పటాన్ని (మ్యాప్) ఉంచుతారు. ఇక రెండోదశలో స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రులలో ద్వితీయ స్థాయి సేవలు అందించే సిబ్బంది ఉంటారు. ఇక మూడోస్థాయిలో అందించే సర్వీసుల్లో 12 సంస్థలుంటాయి. ఇవి మెడికల్, టీచింగ్, రీసెర్చి సేవలు అందించడంతోపాటు అధునాతన సర్వీసులు, స్పెషలైజ్డ్ సర్వీసులు నిర్వహిస్తుంటాయి. చివరికి కోవిడ్–19 వైరస్ నుంచి పౌరుల రక్షణ కోసం అంత చిన్న దేశమైనా (సుమారు 13 కోట్లు జనాభా) 5 రకాల వ్యాక్సిన్‌లను మూడు దశల పరీక్షలు జయ ప్రదంగా నిర్వహించుకుని సిద్ధంగా ఉంది.
ఇప్పుడు క్యూబా, చైనాలు కలిసి కోవిడ్ వైరస్ నిర్మూలనకు, దాని రూపాంతరాల నిర్మూలనకు తగిన వ్యాక్సిన్‌ను రూపొంది స్తున్నాయని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ రాము సూరావజ్జుల వెల్లడిం చారు. ఒకవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య వ్యవస్థను ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలని సంబంధిత సామాజిక చర్యలను పటిష్టం చేయాలనీ మొత్తుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన (20.6.21) వెలువడకముందే జగన్ ప్రభుత్వం హాస్పిటల్స్ సౌకర్యా లను, దేశంలో లభించని ఆక్సిజనేటర్స్‌ను దేశంలో ఏ రాష్ట్రం కన్నా కూడా ముందుగానే సెక్యూర్ చేసి ఆసుపత్రులను బలోపేతం చేయడానికి పూనుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే– చివరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్ చర్యలు మార్గదర్శకం అయ్యాయంటే ఆశ్చర్య పోనక్కరలేదు. ‘వైరస్‌లు వస్తాయి, పోతాయి, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలన్న’ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని దేశం లోని రాష్ట్రాలలో మొదటిసారిగా వ్యాప్తిలోకి తెచ్చిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, దాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ‘రత్నపరీక్ష నవ రత్నాల ఆవిష్కరణతోనే ప్రారంభమయింది. ఇప్పుడు నడుస్తున్నది నేలవిడవని పటిష్టమైన సాముగరిడీలు! అయినా సంస్కరణవాద ప్రభుత్వాలు నిలదొక్కుకోవాలన్న సమసమాజ వ్యవస్థ అండదండలు అనివార్యమని గుర్తించాలి!!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment