న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విధానం ప్రజారోగ్యం అనే హక్కుకు నష్టదాయకంగా మారే పరిస్థితి కనిపిస్తోందని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అత్యవసరాల సరఫరా, సేవలపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ఉత్పత్తిదారులు ఒకే రకమైన టీకాకు రెండు వేర్వేరు ధరలను సూచించారని కోర్టు గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వానికి తక్కువ ధరకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తామని ప్రతిపాదించారని వెల్లడించింది.
వివక్ష మంచి పరిణామం కాదు
18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందజేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారని, ధరల్లో వ్యత్యాసం వల్ల వారికి టీకా అందకపోయే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాజికంగా వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల ప్రజలకు అధిక ధరకు టీకా కొనుక్కునే స్థోమత ఉండదని గుర్తుచేసింది. ధరల్లో వ్యత్యాసం అనేది అంతిమంగా అసమానతకు దారి తీస్తుందని తేల్చిచెప్పింది. అర్హులకు టీకా అందడం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ఆయా ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
ప్రజలకు ఉచితంగా లేదా రాయితీతో కరోనా టీకా ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని సూచించింది. కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఇప్పటికే ఉచితంగా టీకా అందజేస్తోందని గుర్తుచేసింది. వ్యాక్సినేషన్ విషయంలో వేర్వేరు వర్గాల మధ్య వివక్ష చూపడం మంచి పరిణామం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే హక్కు(ప్రజారోగ్య హక్కు), వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకునే హక్కు అందరికీ ఉందని స్పష్టం చేసింది. ఈ హక్కుకు భంగం కలుగనివ్వరాదని పేర్కొంది. ఆర్టికల్ 14(చట్టం ముందు అందరూ సమానమే), ఆర్టికల్ 21 పరీక్షకు నిలిచేలా కరోనా టీకా ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఆక్సిజన్ నిల్వల జాబితా రూపొందించండి
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రాణ వాయువు నిల్వల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి రూపొందించాలని సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొనేలా చూడాలని పేర్కొంది. నిల్వలు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని వికేంద్రీకరించాలని, తద్వారా అవసరమైన ప్రాంతాలకు వేగంగా సరఫరా చేసేందుకు వీలుంటుందని వెల్లడించింది. అనూహ్యమైన పరిణామాలు ఉత్పన్నమైనప్పటికీ ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలుగరాదని స్పష్టం చేసింది. రానున్న నాలుగు రోజుల్లో అత్యవసర ఆక్సిజన్ నిల్వలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించండి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. లాక్‌డౌన్ విధించాలని నిర్ణయిస్తే ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఈ మేరకు 64 పేజీల ఆర్డర్‌ను న్యాయస్థానం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
కరోనా బాధితులకు 4.68 లక్షల పడకలు
దేశంలో కరోనా వైరస్ బారినపడిన వారి కోసం 2,084 ఆసుపత్రుల్లో 4.68 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ఈఎస్‌ఐసీ, రక్షణ, రైల్వేశాఖ, పారామిలటరీ దళాలు, ఉక్కు శాఖ పరిధిలో ఉన్న ఆసుపత్రులను కోవిడ్–19 ఆసుపత్రులుగా మార్చినట్లు వెల్లడించింది. 3,816 రైల్వే కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చామని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment