సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: కోవిడ్ కట్టడి కోసం ప్రారంభించిన టీకా కార్యక్రమం మందకోడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. టీకా పంపిణీ ప్రక్రియ సంక్లిష్టంగా మారిందని, దేశం సాధారణ స్థితికి రావడానికి దేవుడిని ప్రార్ధించాలన్నారు. ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ టీకా కోసం దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని, అన్నీ త్వరితగతిన జరిగితే సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు తిరిగి వెళ్లగలదని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
పిటిషనర్ తరఫున హాజరైన లాయర్ వ్యాఖ్యలకు జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ విధంగా స్పందించారు. ‘‘ఈ కేసు తదుపరి విచారణ ఇలా వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా సుప్రీంకోర్టులో భౌతిక విచారణ జరగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా వేసినప్పుడు మాత్రమే మనకు భౌతిక విచారణకు అవకాశం ఉంటుంది. కనుక త్వరగా టీకా వేయమని భగవంతుడిని ప్రార్థించండి’’ అని అన్నారు.
గతేడాది మార్చి నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణలు వర్చువల్‌గానే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, కోవిడ్-19 బారినపడ్డప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను మరో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ పంచుకున్నారు. వ్యాక్సిన్లు, మాస్క్‌ల అంశంపై విచారణకు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సిద్ధార్థ్ దవే, సిద్ధార్థ్ లూథ్రా హాజరయ్యారు.
‘‘నేను 18 రోజులు క్యారంటైన్‌లో ఉన్నాను.. నేను, నా భార్య వేర్వేరు సమయంలో వైరస్ బారినపడ్డాం.. ఒంటరిగా పుస్తకాలు చదువుకుంటూ క్యారంటైన్‌లో గడిపాను’’ అని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. దాంతో రెండు మాస్క్‌లు ధరించడం మర్చిపోకండి అని ఎం ఆర్ షా సూచించారు. దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లకూ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందజేయాలని భావిస్తున్నట్టు కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేట్ ఆస్పత్రులకు వేర్వేరు ధరలకు టీకాలు అమ్మకంపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ పాలసీ గురించి వివరాలు ఇవ్వలేదని, టీకా వేర్వేరు ధరలపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందని నిలదీసింది. అలాగే టీకా ఉత్పత్తి సంస్థలకే ధరలను నిర్ణయించే అధికారం ఎందుకు వదలిపెట్టారని, రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లకు ఎందుకు వెళుతున్నాయని అని ప్రశ్నించింది.
చదవండి: ఇదేం టీకా విధానం?
Comments
Please login to add a commentAdd a comment