హెలికాప్టర్ శకలాలు; (ఇన్‌సెట్‌లో) బిపిన్ రావత్ దంపతులు
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు, వారి సిబ్బందితో సహా ప్రయాణిస్తున్న ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ తమిళ నాడులోని నీలగిరి కొండల్లో ఆకస్మిక ప్రమాదానికి గురై కూలిపోయింది. విమానం కెప్టెన్ మినహా అందరినీ బలిగొన్న ఆ ప్రమాదం రష్యన్ సైనిక వాహనాల వినియోగం, వాటి సాంకేతిక నాణ్యతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికి కారణాలను శోధించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలూ ఒక పట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగి ఉన్న పలు వాస్తవాలను ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్నగానే మిగిలిపోతోంది.
ఈ నెల 8వ తేదీన కూలిపోయిన ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ ‘ఎంఐ– 17వీ5’ తమిళనాడులోని నీలగిరి కొండల్లో అకస్మాత్తుగా అంత ర్థానమైన విషయం తెలిసిందే, ఈ దుర్ఘటనలో 13 మంది సైనిక సిబ్బందిని (భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా) దేశం కోల్పోయింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాద నేపథ్యంలో, రష్యన్ హెలికాప్టర్‌ల కోసం భారత ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి గానీ, వాటి సామర్థ్యం గురించి కానీ ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయరాదని ఆయన కట్టడి చేశారు. కాని గత పదేళ్ళుగా ఈ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల సంభవించిన వరసవారీ ఘటనలు వాటి సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా 1966–2021 మధ్యకాలంలో రష్యాకి చెందిన పౌర, సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల ఎన్ని దుర్ఘటనలు సంభవించాయో వివరిస్తూ సుప్రసిద్ధ ఐటీ, మీడియా సంస్థలు గూగుల్, వికీపీడియాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కొన్ని సివిలియన్ హెలికాప్టర్లు, కొన్ని సైనిక రవాణా హెలి కాప్టర్ల పతనానికి సంబంధించి కొందరు రాజకీయ పాలకులు, సైనికా ధికారులు చెప్పే కథనాలు తీవ్రమైన గందరగోళం కలిగిస్తున్నాయని వైమానిక నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలవల్ల ఎవరి తొందరపాటు నిర్ణయాలు ఈ దుర్ఘటనలకు కార ణమో చెప్పలేని దుస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని ప్రముఖ రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఇన్‌స్ట్రక్టర్ పైలట్, వైమానిక భద్రతా సలహాదారు కెప్టెన్ ఎ. మోహన్ రంగనాథన్ వివరించారు.
ప్రమాదాల బారిన అధునాతన హెలికాప్టర్లు
ఎందుకంటే రష్యన్ ప్రత్యేక హెలికాప్టర్లు ‘మనకెంత ముద్దయినా’, గత పదేళ్ళకు పైగా ఆ ప్రత్యేక హెలికాప్టర్లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. రష్యాతో 2008లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2011లో భారత వైమానిక దళానికి ఈ ప్రత్యేక హెలికాప్టర్లను అందజేయడం మొదలైంది. 2012 నుంచి వాటి సేవల్ని మనం పొందుతున్నాం. అది మొదలు అధునాతనమైన ‘ఎంఐ–17 వి5’ రష్యన్ హెలికాప్టర్లు అనేక దుర్ఘటనలకు కారణమయ్యాయన్నది నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ రష్యన్ సైనిక, రవాణా హెలికాప్టర్లను ఎన్నిదేశాలు వినియోగిస్తున్నాయన్నది ఇక్కడ ప్రధానం కాదు, అవి ఆయా దేశాల్లో ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాయ న్నదే ఇక్కడ కీలకం. ముఖ్యంగా కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంచనా ప్రకారం, సైనిక రక్షణ హెలికాప్టర్ ప్రమాద కారణాల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎన్నటికీ లేదు! అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పాల కులు తమ ప్రత్యేక విమాన ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద కారణాలను తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందు కంటే తమ కార్యక్రమాల్ని ముగించుకుని రావడంలో ఎవరి తొందర వారిది!
పైలట్ల మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడి
తమ ప్రయాణాలు, కార్యక్రమాలపై రాజకీయ నాయకుల తొందర, దాంతో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు హెలికాప్టర్లను నడిపే పైలట్ల మానసిక స్థితిపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే హెలికాప్టర్‌ని నడిపి తీరాల్సిందే అని ఒత్తిడి చేసే రాజకీయ పాలకుడిని ఆ సమయంలో ఏ పైలట్ కూడా శాసిం చలేడు. ఇందుకు గతంలోనూ ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి మాధవరావు సింథియా తన అవసరం కొద్దీ కాన్పూరు వెళ్లవలసి వచ్చింది. కానీ, వాతావరణం ఏమాత్రం సహకరించని ఘడియల్లో పైలట్‌ను ఆయన బలవంతాన ఒత్తిడిచేసి బయలుదేరడంతో విమానం కూలి అందు లోని వారంతా ప్రాణాలు విడిచారు. అలాగే 2002లో లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భారీవర్షంలో పైలట్‌ను ఒత్తిడికి గురిచేసి బయలుదేరి నప్పుడు ఆ హెలికాప్టర్ కాస్తా కుప్పకూలింది. గగనతల ప్రమాదాలకు అసలు కారణాల గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్న గుణపాఠం ఏమిటో కూడా కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఈ సందర్భంగా వివ రించారు. ‘పైలట్‌ను ఎన్నడూ మేం ఒత్తిడి చేయలేదు అని పాలకులు పైకి చెప్పడం అయితే చెబుతారు. కానీ విచారణ నివేదికలు మాత్రం ఆ ప్రమాద కారణాల్ని బహిరంగంగా వెల్లడించకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తొక్కి పడతాయి’.
అలాగే ఈ నెల 8వ తేదీన భారత సర్వసేనాధిపతి బిపిన్ రావత్ వినియోగించిన రష్యన్ సైనిక రవాణా వాహనం అననుకూల వాతా వరణ పరిస్థితుల్లో ప్రయాణించవలసి రావడానికి కారణం కూడా అలాంటిదే అయిఉండాలి! ఏది ఏమైనప్పటికీ, ఇటీవల తూర్పు అరు ణాచల్‌ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ దగ్గర్లో ఇవే రష్యన్ సైనికరవాణా హెలి కాప్టర్‌లు పరస్పరం ఢీకొని వైమానికదళ సభ్యులు ప్రాణాలు విడవ వలసి వచ్చింది! ఇందువల్ల రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల విని యోగ సాంకేతికతలోనే తీవ్రమైన లోపం ఉండి ఉండాలన్న నిపుణుల అంచనాను విశ్వసించవలసి వస్తోంది!
అంతేకాదు... చివరికి పాకిస్తాన్ సైన్యం వాడుతున్న ‘మిగ్–17’ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ కూడా గిల్గిత్–బల్తిస్తాన్‌లోని ‘నల్తార్’ ప్రాంతంలో ఆకస్మికంగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నార్వే, ఫిలిప్పైన్, మలేషియన్, ఇండోనేషియా రాయ బారులు, వారి భార్యలతోపాటు, పాకిస్తాన్ సైన్యం పైలట్లు ఇద్దరు కూడా చనిపోయారు! బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రష్యన్ ‘మిగ్– 17’ హెలికాప్టర్ కూడా ఇలాగే కూలిపోయిందని సాధికార వార్తా సంస్థలు ప్రకటించాయి.
బ్లాక్‌బాక్స్ వివరాలు వెల్లడించరెందుకు?
ఇలా 1955 నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రపంచ దేశాలలో సైనిక వైమానిక రవాణా హెలికాప్టర్ల ద్వారా జరిగిన దుర్ఘటనలపై ప్రపంచ మీడియా వ్యవస్థలు సాధికార నివేదికలను ప్రచురించాయి! చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు సమీపం లోని కొండల్లో వాతావరణ పరిస్థితులు వికటించిన ఫలితంగా చెట్లను ఢీకొని కూలిపోయింది. వై.ఎస్. అర్ధంతరంగా దివంగతులయ్యారు. అయితే, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లోని ‘బ్లాక్‌బాక్స్’లో నిక్షిప్తమై ఉన్న వివరాల్ని మాత్రం వెల్లడించకుండా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి ‘చాలా జాగ్రత్త’ పడ్డారు! ఆమాట కొస్తే ఆ బాక్స్‌లోని వివరాల్ని ‘తూ.తూ’ మంత్రంగా తేల్చారు! అందువల్ల ఆ బ్లాక్‌బాక్స్ వివరాల్ని మభ్యపర్చడం ద్వారా ఆరోజుకీ, ఈ రోజుకీ వాస్తవాలను బయటపడనీయకుండా కనుమరుగుచేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదానికి సంబంధించిన అనేక వాస్తవాలు కనుమరుగయ్యాయన్నది ‘బ్లాక్ బాక్స్’ వివరాల్ని తొక్కిపెట్టిన ఆఫీ సర్‌కి మాత్రమే తెలియాలి. అందుకే కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నట్టు అటు పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికీ కారణాలను విచారించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలు కూడా ఒకపట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగిఉన్న పలు వాస్తవాలను ప్రేక్ష కులైన ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్న గానే మిగిలిపోతోంది.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment