కుల మతాల ‘అంటు’ లేని కాలం! | Sakshi Guest Column On Caste and Religions | Sakshi
Sakshi News home page

కుల మతాల ‘అంటు’ లేని కాలం!

Published Tue, Apr 4 2023 12:06 AM | Last Updated on Tue, Apr 4 2023 12:06 AM

Sakshi Guest Column On Caste and Religions

మనిషి ఆధునికుడైనకొద్దీ విశాలం కావాల్సింది పోయి, సంకుచితంగా మారుతున్నాడు. తన కులం, తన ప్రాంతం అని గీతలు గీసుకుంటున్నాడు. ఈ మానవ స్వభావాన్ని అడ్డుపెట్టుకొని, దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరింత రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. దీంతో మనకు కులం, మతం అనేవి నిత్య పీడనగా మారిపోయాయి. కానీ ఇలాంటి అడ్డుగోడలు లేని కాలం ఉంటే ఎంత బాగుంటుంది! కేరళలోని ‘పట్టణం’లో జరిపిన తవ్వకాలు ఇది కేవలం ఊహ కాదనీ, చారిత్రక నిజమనీ రుజువు చేస్తున్నాయి. కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ అక్కడ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే.

మహాకవులు వేమన, పోతన ఎన్ని జీవన సత్యాలను పోతపోసి పోయారో చెప్పలేం:
‘‘మర్మమెరుగలేక మతములు కల్పించి ఉర్వి దుఃఖులగుదు రొకరికొకరు గాజు ఇంట కుక్క కళవళ పడురీతి’’ అని వేమన అంటే, పోతనా మాత్యుడు:

ఈ లోకం నుండి లోకేశులు, లోకస్థులు వెళ్లిపోయిన తరువాత లోకం కాని లోకాన్ని, చివరి ‘అలోకా’న్ని అంటే పెను చీకటిని కూడా దర్శించడమేగాక, ఆ తరువాత వెలుగునిచ్చేవాడినే సరాసరి సేవిస్తా నని ప్రకటించాడు! పోతన వాడిన ‘పెను చీకటి’ అంటే వైజ్ఞానిక శాస్త్రం నిరూపించిన ‘డార్క్‌ మ్యాటర్‌’ అనే!

కనుకనే వేమన 17వ శతాబ్దం నాటికే ‘నీ శరీరంలోని జీవ తత్వాన్ని తెలుసుకోలేక అదెక్కడో వేరే ఉందని భావించి వెతుకుతావెందుకు వెర్రివాడా’ అని ప్రశ్నించాడు. ‘భానుడు (సూర్యుడు) ఒక వైపున దివ్యంగా కాస్తుండగా, వేరే దీపం పట్టుకొని చూడ్డం దేనికి’ అని మెత్తగా చురక వేశాడు. ఈ పద్ధతి ‘తెలివి’ లేదా మూఢత్వం ఎలా ఉంటుందో కూడా మరో ఉదాహరణ ద్వారా వేమన చూపించాడు:

‘‘తాము నిలుచు చోట దైవము లేదని పామర జనులు తిరుపతుల తిరిగి జోము (ఉన్న సుఖం) వీడి చేతి సొమ్మెల్ల పోజేసి చెడి గృహంబు తాను చేరు వేమ’’!
అంతేగాదు, ఈ ప్రపంచాన్ని ‘అణువులే’ శాసిస్తున్నాయన్న ఆధు నిక వైజ్ఞానిక దృష్టిని కూడా ఆనాడే కనబరిచాడు వేమన!

ప్రకృతి ఆరాధకులు
ఇంత ‘సోది’తో పాఠకులను ఎందుకు విసిగించవలసి వచ్చిందంటే, భారతదేశ చరిత్రలో ఇనుపరాతి యుగం, అనంతర ఇనుప రాతి యుగాలలో కేరళలో కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. ‘పట్టణం’ పేరుగల ఊరిలో జరిపిన తవ్వకాల్లో కొలది రోజుల క్రితం ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంతగా కుల, మతాలతో నిమిత్తం లేకుండా ఎదుగుతూ వచ్చిన ఆ కేరళ ‘పట్టణం’ చరిత్ర కేవలం ప్రకృతి ఆరాధనా చరిత్ర! అక్కడ జరిపిన తవ్వకాల ప్రకారం తెలుస్తున్న ఆ ప్రాచీన స్థల చరిత్రను బట్టి,సంస్థాగతమైన కులమతాల చరిత్రకు అది పూర్తి విరుద్ధ ప్రాంతంగా తేలింది! కుల వ్యవస్థలో అంతర్భాగంగా అంతస్థులుగా ఇముడుకు పోయిన అసమానత్వం ఇక్కడ పరిశోధకులకు కనిపించిన దాఖలా లేకపోవడం విశేషం! కాగా, ఈ అసమానతా ధోరణులు, కుల వ్యవస్థ నేటి కేరళలోనూ, మిగతా భారత రాష్ట్రాలలోని ఆధునిక వ్యవస్థల్లోనూ పెచ్చరిల్లడమే ఆశ్చర్యకరమని పరిశోధకులు పి.జె. చెరియన్, పి. దీపక్‌ రాస్తున్నారు. 

విభజనల జాడలు లేవు
ఇక్కడి తవ్వకాలలో జరిపిన పరిశోధన ప్రకారం, ఇక్కడ దొరికిన లక్షలాది సిరామిక్‌ (పింగాణీ) ముక్కలు... మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలలో, నైలునది, రెడ్‌ సీ, భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో లభించిన పింగాణీ ముక్కలను పోలి ఉండటం విశేషం. ఈ అవశేషాలన్నీ క్రీ.పూ. 5వ శతాబ్ది నుంచి క్రీ.శ. 5వ శతాబ్ది మధ్యకాలం నాటివి. అంతేగాదు, ఈనాటి మాదిరిగా కాకుండా ‘పట్టణం’ నివాసులు కుల, మత హద్దులెరుగని శాంతికాముక ప్రజలుగా పరిశోధకులు నిర్ధారించారు.

కులపోరులుగానీ, మతయుద్ధాలుగానీ ఆ ప్రజలు ఎరుగరు. ఈ పరిశోధనలో పాల్గొన్న పరిశోధక ఉద్దండులలో ఆక్స్‌ఫర్డ్‌ ప్రముఖు లతోపాటు హైదరాబాద్‌ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధకులు కూడా ఉన్నారు. ఈనాడు సమాజాన్ని, సామాజిక వ్యవస్థల్ని కుల మతాల విభజనతో కుళ్లబొడిచి చీల్చుతున్న వైనం ‘పట్టణం’ చరిత్రలో మచ్చుకు కూడా మనకు కనిపించదని పరిశోధకులు తేల్చారు.

దీనికి కారణం – సంస్థీకృత లేదా వ్యవస్థీకృత కులం, మతం అక్కడ లేక పోవడమే. అంతేగాదు, ఆనాటి ప్రజలు బహుముఖీన వ్యాపక వ్యవస్థలో ఉండి కూడా కులాతీతంగా, మతాతీతంగా జీవనం గడపడం అత్యంత ఆశ్చర్యకరమని పరిశోధకుల నిర్ణయం. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే.

అలాంటి సామాజిక వ్యవస్థతో పోల్చుకుంటే, ఈనాటి సమ కాలీన ప్రపంచంలో పెక్కు సమస్యలకు ప్రధాన కారణం ప్రకృతి సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుపోవడమే. ఈ పరిస్థితిని ‘పట్టణం’ లాంటి ఆదర్శ సామాజిక వ్యవస్థ వ్యతిరేకించింది. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. అందుకే ప్రయివేట్‌ దోపిడీ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు (వాళ్లు ఏ ‘బ్రాండు’కు చెందినా) పెంచి పోషించే వ్యవస్థల్లో ఆ ఆదర్శ కులాతీత, మతాతీత సామాజిక వ్యవస్థలు నిలబడలేవు. 

ప్రశ్నించే హక్కు మాయం
ఎక్కడివరకో అక్కర్లేదు – భారత పార్లమెంట్‌లో సగానికి (250 మందికి)పైగా అవినీతిపరులున్నారని  అవినీతి నిరోధక జాతీయ పరిశోధనా సంస్థ అక్షరసత్యంగా జాబితాతో సహా పేర్కొన్నప్పటికీ వారిపై పాలక వ్యవస్థ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా ఆ ‘మచ్చ’ను రూపుమాపడానికి బదులు తానూ పూసుకొని సిగ్గువిడిచి తిరుగుతోంది.

ఈ జాఢ్యం అంతటితో ఆగలేదు. అసలు ప్రశ్నించే హక్కునే దేశ పౌరులకు దూరంచేసి రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సమాచార హక్కు చట్టాన్నే మడిచి మడత పెట్టేసి తిరుగుతున్నారు పాలకులు. చివరికి రాజ్యాంగ చట్టం అనుమతించిన ప్రశ్నించే హక్కును కూడా పౌరులకు దూరం చేసేందుకు సాహసించారు. 

అలాగే, మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయో బుర్రపెట్టి ఆలోచించుకోమని వివేకానందస్వామి నెత్తిన నోరు పెట్టుకుని అనేక సార్లు బోధించినా, మనస్సుల్ని ‘హిందూత్వ’ మతతత్వానికి తాకట్టు పెట్టుకున్న పాలక వ్యవస్థలు విభిన్న మతాల వారిపై దౌర్జన్యాలను, దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. చివరికి మంత్రుల ‘డిగ్రీ’లను ప్రశ్నించడమే నేరమైపోయింది.

రుజువు అడిగినందుకు సమాధానం చెప్పి నోరు మూయించే బదులు, అడిగిన వాడి నోటికి ‘తాళం’ వేసే సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒక ప్రధాని’ అన్న నినాదంతో బయలుదేరిన పాలనా రథం చివరికి సుప్రీం కోర్టును కూడా తాను చెప్పిన జడ్జీలను నియమించాలన్న ఫర్మానాను అమలు పరచాలన్న మంకుపట్టుకు దిగింది.

ఇందుకు వ్యతిరేకిస్తున్న సుప్రీంకోర్టుపై కన్నెర్ర చేస్తోంది కేంద్రం. ఈ విపరి ణామాలు దేశానికీ, ప్రజా క్షేమానికీ, నిర్మలమైన పాలనా పద్ధతు లకూ– ఒక్క ముక్కలో ‘భారత ప్రజలమైన మేము’ అన్న విస్పష్ట ప్రకటనతో ప్రజలు రూపొందించుకున్న రిపబ్లికన్‌ రాజ్యాంగ లక్ష్యాలకే పరమ విరుద్ధమైనవి. ఆ వెరపు ఉంటే దేశ పాలనా వ్యవస్థ తన చేష్టలను సవరించుకుని, ‘పట్టణం’ బాటలోకి రావాలి. గుణపాఠం తీసుకోవాలి. ఎందుకో మళ్లీ వేమన్నే గుర్తుకొస్తున్నాడు: 
‘‘అల్పబుద్ధి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ గొట్టు’’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాకులు 
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement