caste and religions
-
కుల మతాల ‘అంటు’ లేని కాలం!
మనిషి ఆధునికుడైనకొద్దీ విశాలం కావాల్సింది పోయి, సంకుచితంగా మారుతున్నాడు. తన కులం, తన ప్రాంతం అని గీతలు గీసుకుంటున్నాడు. ఈ మానవ స్వభావాన్ని అడ్డుపెట్టుకొని, దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరింత రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. దీంతో మనకు కులం, మతం అనేవి నిత్య పీడనగా మారిపోయాయి. కానీ ఇలాంటి అడ్డుగోడలు లేని కాలం ఉంటే ఎంత బాగుంటుంది! కేరళలోని ‘పట్టణం’లో జరిపిన తవ్వకాలు ఇది కేవలం ఊహ కాదనీ, చారిత్రక నిజమనీ రుజువు చేస్తున్నాయి. కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ అక్కడ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే. మహాకవులు వేమన, పోతన ఎన్ని జీవన సత్యాలను పోతపోసి పోయారో చెప్పలేం: ‘‘మర్మమెరుగలేక మతములు కల్పించి ఉర్వి దుఃఖులగుదు రొకరికొకరు గాజు ఇంట కుక్క కళవళ పడురీతి’’ అని వేమన అంటే, పోతనా మాత్యుడు: ఈ లోకం నుండి లోకేశులు, లోకస్థులు వెళ్లిపోయిన తరువాత లోకం కాని లోకాన్ని, చివరి ‘అలోకా’న్ని అంటే పెను చీకటిని కూడా దర్శించడమేగాక, ఆ తరువాత వెలుగునిచ్చేవాడినే సరాసరి సేవిస్తా నని ప్రకటించాడు! పోతన వాడిన ‘పెను చీకటి’ అంటే వైజ్ఞానిక శాస్త్రం నిరూపించిన ‘డార్క్ మ్యాటర్’ అనే! కనుకనే వేమన 17వ శతాబ్దం నాటికే ‘నీ శరీరంలోని జీవ తత్వాన్ని తెలుసుకోలేక అదెక్కడో వేరే ఉందని భావించి వెతుకుతావెందుకు వెర్రివాడా’ అని ప్రశ్నించాడు. ‘భానుడు (సూర్యుడు) ఒక వైపున దివ్యంగా కాస్తుండగా, వేరే దీపం పట్టుకొని చూడ్డం దేనికి’ అని మెత్తగా చురక వేశాడు. ఈ పద్ధతి ‘తెలివి’ లేదా మూఢత్వం ఎలా ఉంటుందో కూడా మరో ఉదాహరణ ద్వారా వేమన చూపించాడు: ‘‘తాము నిలుచు చోట దైవము లేదని పామర జనులు తిరుపతుల తిరిగి జోము (ఉన్న సుఖం) వీడి చేతి సొమ్మెల్ల పోజేసి చెడి గృహంబు తాను చేరు వేమ’’! అంతేగాదు, ఈ ప్రపంచాన్ని ‘అణువులే’ శాసిస్తున్నాయన్న ఆధు నిక వైజ్ఞానిక దృష్టిని కూడా ఆనాడే కనబరిచాడు వేమన! ప్రకృతి ఆరాధకులు ఇంత ‘సోది’తో పాఠకులను ఎందుకు విసిగించవలసి వచ్చిందంటే, భారతదేశ చరిత్రలో ఇనుపరాతి యుగం, అనంతర ఇనుప రాతి యుగాలలో కేరళలో కులమతాలతో సంబంధం లేని కాలం... దేవుళ్ళు, ఆయుధాలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రకృతి జీవనంతో పెనవేసుకున్న ప్రజా సామాజిక జీవన వ్యవస్థ విరాజిల్లుతూ వచ్చిందని వెల్లడయ్యింది. ‘పట్టణం’ పేరుగల ఊరిలో జరిపిన తవ్వకాల్లో కొలది రోజుల క్రితం ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతగా కుల, మతాలతో నిమిత్తం లేకుండా ఎదుగుతూ వచ్చిన ఆ కేరళ ‘పట్టణం’ చరిత్ర కేవలం ప్రకృతి ఆరాధనా చరిత్ర! అక్కడ జరిపిన తవ్వకాల ప్రకారం తెలుస్తున్న ఆ ప్రాచీన స్థల చరిత్రను బట్టి,సంస్థాగతమైన కులమతాల చరిత్రకు అది పూర్తి విరుద్ధ ప్రాంతంగా తేలింది! కుల వ్యవస్థలో అంతర్భాగంగా అంతస్థులుగా ఇముడుకు పోయిన అసమానత్వం ఇక్కడ పరిశోధకులకు కనిపించిన దాఖలా లేకపోవడం విశేషం! కాగా, ఈ అసమానతా ధోరణులు, కుల వ్యవస్థ నేటి కేరళలోనూ, మిగతా భారత రాష్ట్రాలలోని ఆధునిక వ్యవస్థల్లోనూ పెచ్చరిల్లడమే ఆశ్చర్యకరమని పరిశోధకులు పి.జె. చెరియన్, పి. దీపక్ రాస్తున్నారు. విభజనల జాడలు లేవు ఇక్కడి తవ్వకాలలో జరిపిన పరిశోధన ప్రకారం, ఇక్కడ దొరికిన లక్షలాది సిరామిక్ (పింగాణీ) ముక్కలు... మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలలో, నైలునది, రెడ్ సీ, భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో లభించిన పింగాణీ ముక్కలను పోలి ఉండటం విశేషం. ఈ అవశేషాలన్నీ క్రీ.పూ. 5వ శతాబ్ది నుంచి క్రీ.శ. 5వ శతాబ్ది మధ్యకాలం నాటివి. అంతేగాదు, ఈనాటి మాదిరిగా కాకుండా ‘పట్టణం’ నివాసులు కుల, మత హద్దులెరుగని శాంతికాముక ప్రజలుగా పరిశోధకులు నిర్ధారించారు. కులపోరులుగానీ, మతయుద్ధాలుగానీ ఆ ప్రజలు ఎరుగరు. ఈ పరిశోధనలో పాల్గొన్న పరిశోధక ఉద్దండులలో ఆక్స్ఫర్డ్ ప్రముఖు లతోపాటు హైదరాబాద్ మాలిక్యులార్ బయాలజీ పరిశోధకులు కూడా ఉన్నారు. ఈనాడు సమాజాన్ని, సామాజిక వ్యవస్థల్ని కుల మతాల విభజనతో కుళ్లబొడిచి చీల్చుతున్న వైనం ‘పట్టణం’ చరిత్రలో మచ్చుకు కూడా మనకు కనిపించదని పరిశోధకులు తేల్చారు. దీనికి కారణం – సంస్థీకృత లేదా వ్యవస్థీకృత కులం, మతం అక్కడ లేక పోవడమే. అంతేగాదు, ఆనాటి ప్రజలు బహుముఖీన వ్యాపక వ్యవస్థలో ఉండి కూడా కులాతీతంగా, మతాతీతంగా జీవనం గడపడం అత్యంత ఆశ్చర్యకరమని పరిశోధకుల నిర్ణయం. దీనికి ప్రధాన కారణం – ప్రజలు తమను ప్రకృతి నుంచి వేరుగా భావించకపోవడమే. అలాంటి సామాజిక వ్యవస్థతో పోల్చుకుంటే, ఈనాటి సమ కాలీన ప్రపంచంలో పెక్కు సమస్యలకు ప్రధాన కారణం ప్రకృతి సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుపోవడమే. ఈ పరిస్థితిని ‘పట్టణం’ లాంటి ఆదర్శ సామాజిక వ్యవస్థ వ్యతిరేకించింది. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. అందుకే ప్రయివేట్ దోపిడీ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు (వాళ్లు ఏ ‘బ్రాండు’కు చెందినా) పెంచి పోషించే వ్యవస్థల్లో ఆ ఆదర్శ కులాతీత, మతాతీత సామాజిక వ్యవస్థలు నిలబడలేవు. ప్రశ్నించే హక్కు మాయం ఎక్కడివరకో అక్కర్లేదు – భారత పార్లమెంట్లో సగానికి (250 మందికి)పైగా అవినీతిపరులున్నారని అవినీతి నిరోధక జాతీయ పరిశోధనా సంస్థ అక్షరసత్యంగా జాబితాతో సహా పేర్కొన్నప్పటికీ వారిపై పాలక వ్యవస్థ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా ఆ ‘మచ్చ’ను రూపుమాపడానికి బదులు తానూ పూసుకొని సిగ్గువిడిచి తిరుగుతోంది. ఈ జాఢ్యం అంతటితో ఆగలేదు. అసలు ప్రశ్నించే హక్కునే దేశ పౌరులకు దూరంచేసి రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సమాచార హక్కు చట్టాన్నే మడిచి మడత పెట్టేసి తిరుగుతున్నారు పాలకులు. చివరికి రాజ్యాంగ చట్టం అనుమతించిన ప్రశ్నించే హక్కును కూడా పౌరులకు దూరం చేసేందుకు సాహసించారు. అలాగే, మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయో బుర్రపెట్టి ఆలోచించుకోమని వివేకానందస్వామి నెత్తిన నోరు పెట్టుకుని అనేక సార్లు బోధించినా, మనస్సుల్ని ‘హిందూత్వ’ మతతత్వానికి తాకట్టు పెట్టుకున్న పాలక వ్యవస్థలు విభిన్న మతాల వారిపై దౌర్జన్యాలను, దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. చివరికి మంత్రుల ‘డిగ్రీ’లను ప్రశ్నించడమే నేరమైపోయింది. రుజువు అడిగినందుకు సమాధానం చెప్పి నోరు మూయించే బదులు, అడిగిన వాడి నోటికి ‘తాళం’ వేసే సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒక ప్రధాని’ అన్న నినాదంతో బయలుదేరిన పాలనా రథం చివరికి సుప్రీం కోర్టును కూడా తాను చెప్పిన జడ్జీలను నియమించాలన్న ఫర్మానాను అమలు పరచాలన్న మంకుపట్టుకు దిగింది. ఇందుకు వ్యతిరేకిస్తున్న సుప్రీంకోర్టుపై కన్నెర్ర చేస్తోంది కేంద్రం. ఈ విపరి ణామాలు దేశానికీ, ప్రజా క్షేమానికీ, నిర్మలమైన పాలనా పద్ధతు లకూ– ఒక్క ముక్కలో ‘భారత ప్రజలమైన మేము’ అన్న విస్పష్ట ప్రకటనతో ప్రజలు రూపొందించుకున్న రిపబ్లికన్ రాజ్యాంగ లక్ష్యాలకే పరమ విరుద్ధమైనవి. ఆ వెరపు ఉంటే దేశ పాలనా వ్యవస్థ తన చేష్టలను సవరించుకుని, ‘పట్టణం’ బాటలోకి రావాలి. గుణపాఠం తీసుకోవాలి. ఎందుకో మళ్లీ వేమన్నే గుర్తుకొస్తున్నాడు: ‘‘అల్పబుద్ధి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగ గొట్టు’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాకులు abkprasad2006@yahoo.co.in -
ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్తో రాయొద్దన్నాం
సాక్షి, విజయవాడ: పిల్లల్లో సమైక్యతా భావాన్ని పెంచేందుకే స్కూల్ రిజిస్టర్లో మార్పులు తెచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమే. చిన్న వయస్సులో పిల్లల్లో కులాలు, మతాల చర్చకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగానే స్కూల్ రిజిస్టర్లో కులం, మతం రాయొద్దని అదేశాలిచ్చాం. ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్తో రాయొద్దని ఆదేశించాం. పిల్లల టీసీలు మాత్రం గతంలో ఇచ్చినట్టే ఇస్తాం. (స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్పై కీలక ఉత్తర్వులు జారీ) సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పథకాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఇస్తున్నాం. సీఎం జగన్ పాలనలో అన్ని కులాలు, మతాలు సమానమే. సీఎం జగన్ గొప్ప మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్లో కుల, మత, లింగ వివక్షకు తావు లేకుండా చూడాలనే సీఎం వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. -
స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్పై కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను రిజిష్టర్లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. -
అంకంపాలెంలో కుల బహిష్కరణ
జీలుగుమిల్లి: మండలంలోని అంకంపాలెం గ్రామంలో కోర్టు కేసులో సాక్ష్యం చెప్పిందనే నేపంతో ఓ మహిళ కుల బహిష్కరణకు గురైంది. తోడ పుట్టిన సోదరుడే అక్కను కులం నుంచి వెలి వేయడంతో మనస్తాపంతో ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘనటపై బాధితురాలి తల్లి నాలి దుర్గమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంకంపాలెం గ్రామానికి చెందిన నాలి రాఘవులు, దుర్గమ్మ దంపతులకు చెందిన 35 ఎకరాల భూమికి ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పరిహారం అందింది. ఆ సొమ్మును ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు పంచి మిగిలిన రూ.70 లక్షలను రాఘవులు, దుర్గమ్మ పేరు మీద బ్యాంక్ ఖాతాలో ఉంచుకున్నారు. ఈ సొమ్మును తల్లిదండ్రులకు తెలియకుండా ఒక కుమారుడు కాజేసి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టులో కూడా కేసు వేశారు. విచారణలో భాగంగా పెద్ద కుమార్తె తోట వెంకటరమణ సోదరుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన సోదరుడు కుల పెద్దలతో ఆమెను కుల బహిష్కరణ చేయించాడు. శనివారం తోట వెంకటరమణ గ్రామంలో వివాహ విందుకు భోజనం చెయ్యడానికి వెళ్ళగా అక్కడకు వచ్చిన ఆమె సోదరులు ఈమెను భోజనానికి ఎవరు పిలిచారంటూ అక్కడివారిని నిలదీశారు. ఈమెను ఇక్కడ నుంచి పంపితేనే కులస్తులంతా భోజనం చేస్తారని చెప్పడంతో.. భోజనం మధ్యలోనే ఆమెను పంపించి వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పట్టించుకోని అధికారులు : గ్రామంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటనపై అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కులపెద్దలు అన్యాయాన్ని ఖండించకుండా నిరపరాదిని శిక్షించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అందరి బతుకమ్మ
తెలంగాణ జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతుకమ్మ. అంటే ‘జీవించు - బ్రతికించు’ అని అర్థం. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. భట్టు నరసింహకవి రచించిన ఈ పాటే ఈ కథకు, బతుకమ్మ పేరుకు ఆధారంగా నిలిచింది. ‘ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో’ ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని యుద్ధంలో ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి పూజలకు సంతోషించిన లక్ష్మీదేవి తానే ఆమెకు కూతురుగా పుట్టిందట. ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవాదిదేవతలు, మహర్షులు వచ్చి ... ‘బతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో సృష్టి బ్రతుకమ్మాయె ఉయ్యాలో...’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అనే నామకరణం చేశారని ఈ జానపద గాథ తెలుపుతుంది. ‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశురాణివై పరగలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ’ అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపై ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అయినట్లే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది. దుసరిచెట్టు తీగలతో అల్లిన శిబ్బి - శిబ్బెం లేదా తాంబాళంలో అడుగున గుమ్మడి, ఆనపు, మోదుగ వంటి పెద్ద ఆకులను ఉపయోగించి కింది పీఠంలా తయారుచేస్తారు. ఆ పీఠంపై వర్తులాకారంగా ఈ కాలంలో దొరికే గుమ్మడి, తంగెడి, గునుగు, గోరింట, గడ్డిపూలు, కలువ, కట్ల, బంతి, బీర, పొట్ల, రుద్రాక్ష, చేమంతి, నీలంకట్ల, పారిజాత, పొన్న, మందార, మల్లె, మొల్ల, గుల్మాల పూలతో మెట్లుమెట్లుగా పేర్చి అందంగా తీర్చిదిద్దుతారు. మొత్తం బతుకమ్మపైన పసుపుముద్దను గౌరీదేవిగా పై స్థానంలో నిల్పుతారు. ఈ మొత్తం దృశ్యం మేరుప్రస్థ శ్రీచక్రంలాగా ఉంటుంది. మహాలయ అమావాస్య బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’, చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మకు ఐదు రకాల సద్దులు పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడితో నైవేద్యం చేసి సమర్పిస్తారు. రకరకాల బతుకమ్మ పాటలతో నృత్యగీతాలాపన కొనసాగుతుంది. ఆటలు పూర్తయ్యాక కొత్త సిబ్బి పాత సిబ్బి అంటూ సద్దులను పంచుకొని తింటారు. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడుతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. ఈ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. శ్రీ మూర్తి అయిన అమ్మవారిని సాటి స్త్రీ మూర్తులే ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహ జీవన తత్వం, ప్రకృతి తాదాత్మ్యం కన్పిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బతుకునివ్వమనీ కోరుకొనే ఈ మహోత్సవాన్ని అందరూ జరుపుకోవాలి. అప్పుడే అందరి బతుకమ్మ అవుతుంది. - డా॥పి. భాస్కరయోగి విదేశీయులనూ అలరిస్తున్న బతుకమ్మ సాంస్కృతిక వైభవం