జీలుగుమిల్లి: మండలంలోని అంకంపాలెం గ్రామంలో కోర్టు కేసులో సాక్ష్యం చెప్పిందనే నేపంతో ఓ మహిళ కుల బహిష్కరణకు గురైంది. తోడ పుట్టిన సోదరుడే అక్కను కులం నుంచి వెలి వేయడంతో మనస్తాపంతో ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘనటపై బాధితురాలి తల్లి నాలి దుర్గమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంకంపాలెం గ్రామానికి చెందిన నాలి రాఘవులు, దుర్గమ్మ దంపతులకు చెందిన 35 ఎకరాల భూమికి ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పరిహారం అందింది. ఆ సొమ్మును ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు పంచి మిగిలిన రూ.70 లక్షలను రాఘవులు, దుర్గమ్మ పేరు మీద బ్యాంక్ ఖాతాలో ఉంచుకున్నారు.
ఈ సొమ్మును తల్లిదండ్రులకు తెలియకుండా ఒక కుమారుడు కాజేసి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టులో కూడా కేసు వేశారు. విచారణలో భాగంగా పెద్ద కుమార్తె తోట వెంకటరమణ సోదరుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన సోదరుడు కుల పెద్దలతో ఆమెను కుల బహిష్కరణ చేయించాడు. శనివారం తోట వెంకటరమణ గ్రామంలో వివాహ విందుకు భోజనం చెయ్యడానికి వెళ్ళగా అక్కడకు వచ్చిన ఆమె సోదరులు ఈమెను భోజనానికి ఎవరు పిలిచారంటూ అక్కడివారిని నిలదీశారు.
ఈమెను ఇక్కడ నుంచి పంపితేనే కులస్తులంతా భోజనం చేస్తారని చెప్పడంతో.. భోజనం మధ్యలోనే ఆమెను పంపించి వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పట్టించుకోని అధికారులు : గ్రామంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటనపై అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కులపెద్దలు అన్యాయాన్ని ఖండించకుండా నిరపరాదిని శిక్షించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment