డెబ్భై నాలుగేళ్ల స్వతంత్ర భారత పాలకులు సహితం ప్రజల ప్రాణరక్షణకోసం అవసరమైన మందుల్ని, మాకుల్ని, ప్రాణవాయువును, దాని నిర్వహణా యంత్రాలను సహితం సమకూర్చుకోలేక తిరిగి విదేశాలకు, విదేశీ మందుల కంపెనీలకోసం ఎగబడవలసి రావడం ఇన్నేళ్ల స్వాతంత్య్రానికి తీరని మచ్చను మిగిల్చింది. కరోనా ఒకవైపున ప్రజల ఊపిరిని తోడుకుంటూ శవాలుగా, జీవచ్ఛవాలుగా వదిలి వెళుతున్నా, మరోవైపున పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు కరోనా విజృంభణ దశలోనే ప్రజారోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ, ప్రజల పట్ల అణకువ భావం లేకుండా వివిధ దశల్లో ఎన్నికలను బలవంతంగా నిర్వహించి కరోనాకు సహకరించడం దుస్సహం, దుర్మార్గం! అందుకే మన దేశంలో ఉన్నది డొల్లపాలన, గుల్ల ప్రజాస్వామ్యం అని భావించక తప్పడం లేదు.
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడలేని పాల కులను, పాలనా వ్యవస్థల్ని ‘డొల్ల పాలకులు’ ‘గుల్ల ప్రజాస్వామ్యాలు ’ అని ప్రపంచ ప్రసిద్ధ భాషా వేత్తలలో, చరిత్రకారులలో ఒకరైన నోమ్ చామ్‌స్కీ (అమెరికా) ఏనాడో నిర్వచించాడు! ఆ మాట ఎందుకన్నాడు? అచరణలో పెక్కు పాలనా సంస్థలు– ప్రజాస్వామ్యానికి అవసరమైన సమాచారాన్ని, వారి మధ్య దైనందిన జీవితాలకు సంబంధించిన అంశాలపై చర్చలను తొక్కిపెడుతూ, భిన్నాభిప్రాయాలను అణచివేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను తొక్కిపెట్టడానికి అలవాటు పడినందున ఈ తరహా పాలనా వ్యవస్థను భ్రష్టు (చెడిపోయిన) ప్రజా స్వామ్యా లుగా’’చామస్కీ నామకరణం చేయాల్సి వచ్చింది! మనదేశంలో డెబ్బైనాలుగేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా జనాభాలో 34–35 శాతం ప్రజా బాహుళ్యం రోజుకి ఒక్క డాలర్ (రూ.78) లేదా అంతకన్నా తక్కువ ఆదాయంతో సరిపెట్టుకుంటూ నికృష్ట స్థితిగతుల్లో బతుకు లీడుస్తున్నారని సాధికార అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన మన దేశంలో 40 కోట్ల మందికి పైగా ప్రజాబాహుళ్యం ఎలా అర్ధాకలితో బొటాబొటి జీవితాలు వెల్లబుచ్చుకోవలసి వస్తోందో అర్థమవుతుంది! అందువల్లనే ధనిక వర్గ ‘ప్రజాస్వామ్య’’ వ్యవస్థల్లో ‘‘లోటు’’ బడ్జెట్లతో పాటే ప్రజాస్వామ్యం కూడా ‘‘వోటి’’ కుండలు గానే గడపవలిసివస్తోంది. ఈ వాస్తవాల్ని మరింత వివరంగా శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలయిన కారల్‌మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగెల్స్ కన్నా కొలది రోజులకు ముందే అమెరికా నీగ్రో బానిసల విమోచన ప్రదాత అయిన అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గుండెలోతుల నుంచి ఎంతో ఆర్ద్రంగా ప్రపంచం ముందు చాటాడని మరచిపోరాదు. లింకన్ మహాశయుని మాటల్లోనే విందాం. మార్క్స్ రచనలు చదివే అవ కాశం అప్పటికి లింకన్‌కు ఉందో లేదో మనకు తెలియదు గాని, సామాజిక వాస్తవాలు కొన్నింటిపైన ఈ ఉభయుల అభిప్రాయాలు దాదాపు ఒకటిగానే ఉండటం వల్ల వాటి మధ్య సమకాలీనత సాధ్యపడి ఉండవచ్చు. అబ్రహం లింకన్ కుండ బద్దలు కొట్టి చెప్పిన ఈ కింది వాస్తవాలను నేటి సమకాలీన భారత రాజకీయ పాలకులు, నాయకులూ పట్టించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. లింకన్ ఇలా ప్రకటించాడు:
‘‘ఏ పనిలోనైనా ముందుగా శ్రమ శక్తి విలువకు కొలమానం నిర్ణయించకుండా ఏ మంచిపనికీ తగిన విలువ కట్టకుండా ఆ శ్రమను అనుభవించలేం. సామాజికులు అనుభవించే పెక్కు వస్తువులు ఉత్పత్తి అయ్యేది శ్రమజీవుల శ్రమ శక్తి నుంచేనని మరవరాదు. అలాంటి ఉపయోగకర వస్తుజాలం అంతా శ్రామికుడి శ్రమ ఫలితం. కాని దురదృష్టవశాత్తు అన్ని యుగాలలోనూ జరిగిన దురదృష్టకర పరిణామం– సామాజికుల్లో కొందరే తమ చెమటోడ్చి సరుకులను ఉత్పత్తి చేయడం మిగతా వారు ఇవతల పుల్లని అవతల పెట్టలేని వారు సహితం భారీ స్థాయిలో శ్రమజీవుల శ్రమఫలితాలను తేరగా అనుభవించడం పరిపాటైంది. ఇది దుర్మార్గం, ఈ దుర్మార్గం ఇకనెంత మాత్రం కొనసాగరాదు. శ్రమజీవికి తన యావత్తు శ్రమ ఫలితాన్ని లేదా సాధ్యమైనంత హెచ్చు వాటాను పొంది అనుభవించే హక్కును అనుమతించడం ఏ మంచి ప్రభుత్వానికైనా, పరిపాలనా వ్యవస్థ కయినా ధర్మంగా ఉండాలి!!
కాని, ఈ మహోన్నత లక్ష్యాలు 21వ శతాబ్దం కొలది సంవత్సరాలలో ముగియబోయేనాటికైనా నెరవేరగలవా అన్నది నేటి ‘‘భ్రష్టు ప్రజాస్వామ్య’’ వ్యవస్థలో ‘డొల్ల పాలకుల’ అధ్వర్యంలో సాధ్యపడదని ప్రభుత్వాలను వాటి ఆధ్వర్యంలో ఒక లక్ష్యం, దిక్కు దివాణం లేక నడుస్తూ, ప్రజాతంత్రశక్తుల నోర్లు నొక్కి ప్రజా బాహుళ్యంలోని నిరక్ష్యరాస్యత ఆధారంగా గత 74 ఏళ్లుగానూ పరి పాలన వెలగబెడుతున్న (కాంగ్రెస్/ బీజేపీ లేదా యూపీఏ / ఎన్.డి.ఎ ముద్రల కింద) రాజకీయ నాయకులకు తక్షణం సమీక్షిం చుకొని భ్రష్టు పట్టిన పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ‘‘ఓవర్‌హాల్’’ చేసుకోగల స్తోమత ఉందా? లేక ఇదంతా 74 ఏళ్లుగా సాగించిన ‘జాగరణ’గానే ఇకముందు కొనసాగుతుందా? ప్రసిద్ధ భారత చరిత్రకారులలో ఒకరు, అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ అత్యున్నత ప్రతి ష్టాత్మక బహుమతులు పొందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ రొమిలా థాపర్ ’’స్వతంత్ర భారతంలో ప్రజాబాహుళ్యాన్ని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచించగల విశాల మనస్తత్వం గల పాలక శక్తి ఇంకా ఉదయించవలసి ఉంది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఏ పరిణామాలు ప్రొఫెసర్ థాపర్ లాంటి చరిత్రకారులను ఈ అభి ప్రాయానికి నెట్టి ఉంటాయి?. ఇదే స్వతంత్ర భారతంలో రెండు పరినాలనా వ్యవస్థల్లోనూ (కాంగ్రెస్– బీజేపీ) ఎమర్జెన్సీ ప్రకటన అనంతరం, ఆ తరువాత బీజేపీ హయాంలోనూ, వాక్సభా స్వాతం త్య్రాలను, ప్రజాతంత్ర ఉద్యమాలను, ఉద్యమకారులను (పాత్రికేయులతోసహా) రకరకాల వేధింపులకు ఇప్పటికీ ఆటవిడుపు లేకుండా చేస్తూ వస్తున్న సంగతి ప్రజాబాహుళ్యానికి అనుభవమే. చివరికి మన దేశ సంస్కృతీ సంపదకు, పరిశోధనలకు నిలయమైన భండార్కర్ ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్ (పుణే) సహితం సెన్సార్‌షిప్ నిబంధనలకు తలొగ్గి తన ఉన్నత పరిశోధనా భాండాగారానికి తాళాలు పెట్టి తప్పుకోవలసి వచ్చింది. ఎన్నో పత్రికా సంస్థలు, పత్రికలు మూతపడ్డాయి. ఫైర్, వాటర్, పర్జానియా, రంగ్‌దే బసంతి లాంటి ఉత్తమ చలనచిత్రాలు దాడులకు గురికావలిసి వచ్చింది. ఆ తరువాతి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసి, దేశాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించేరకంగా పెద్ద కరెన్సీ నోట్లను ఉపసంహరించి, వేరే ప్రయోజనాలకు వాటిని మళ్లించి ఉంటారన్న అపవాదునో, నిజవాదనకో బీజేపీ పాలన తెరలేపింది. ఈ పరిణామాల ఫలితంగా జరిగిన, జరుగుతున్న పెక్కు అవకతవకలను సరిదిద్దుకునే బదులు, ఈ ప్రజావ్యతిరేక పరిణామాలను విమర్శించిన వివిధ స్థాయి ప్రజాస్వామ్య పక్షాలపై, ప్రజాజీవనంలో తలలో నాల్కలుగా భావించే ప్రజాస్వామ్య శక్తులైన ప్రొఫెసర్లు, ఉద్యమ కారులైన ప్రసిద్ధ రచయితల పైన, కవులు, కళాకారుల పైన నిర్బంధ విధానాలు అమలులోకి వచ్చాయి. ఎం.ఎఫ్ హుస్సేన్, సురేంద్రన్ నాయక్, భూపేన్ ఖాఖర్, అపితా సింగ్... ఆ తరువాత కాలంలో ప్రజా బాహు ళ్యానికి వెన్నుదన్నుగా నిలిచిన దభోల్కర్ కల్బుర్గి, లంకేష్ లాంటి పలువురు పౌరహక్కుల నాయకులపైన మేధావులపైన నిర్బంధ విధానం అమలులోకి వచ్చింది. అయినా కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అన్న సామెతలాగా, అసమానతల పర్వాన్ని రూపుమాపే ఏకైక శక్తిని నేనే అంటూ విరుచుకుపడిన కరోనా (కోవిడ్–19) మహమ్మారికి ఈ దేశంలో ఎంతటి వాళ్లయినా జోహుకుం అనవలసిన స్థితి వచ్చింది. ఈ దుస్థితిలో 74 ఏళ్ల స్వతంత్ర భారత పాలకులు సహితం ప్రజల ప్రాణరక్షణకోసం అవసరమైన మందుల్ని, మాకుల్ని, చివరికి అవసరమైన ప్రాణవాయువును, దాని నిర్వహణా యంత్రాలను సహితం సమకూర్చుకోలేక తిరిగి విదేశాలకు, విదేశీ మందుల కంపెనీలకోసం ఎగబడవలసి రావడం –– ఇన్నేళ్ల స్వాతంత్య్రానికి తీరని మచ్చను మిగిల్చింది. కానీ కరోనా ఒకవైపున ప్రజల ఊపిరిని తోడుకుంటూ శవాలుగా, జీవచ్ఛవాలుగా వదిలి వెళుతున్నా, మరోవైపున పౌలకులకు, రాజకీయ పార్టీల నాయకులకు కరోనా విజృంభణ దశలోనే ప్రజారోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ, ప్రజల పట్ల అణకువ భావం లేకుండా వివిధ దశల్లో ఎన్నికలను బలవంతంగా నిర్వహించి కరోనాకు సహకరించడం దుస్సహం, దుర్మార్గం! అందుకే మన దేశంలో ఉన్నది డొల్లపాలన, గుల్ల ప్రజా స్వామ్యం అని భావించక తప్పడం లేదు.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment