జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సమయం చిక్కినప్పుడల్లా బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు అగ్ర నేతల మధ్య వైరం తేటతేల్లమైంది. తాజాగా సీఎం గహ్లోత్.. పైలెట్‌పై పరోక్ష విమర్శలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బుధవారం ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీఎం గహ్లోత్ ప్రీ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందని అన్నారు. దీంతో సమావేశంలో నవ్వులు పూచాయి. అయితే ఎక్కడా ఆయన సచిన్ పైలెట్ పేరును ప్రస్తావించలేదు. అయితే ఈ వ్యాఖ్యలు గహ్లోత్ పరోక్షంగా సచిన్‌ను ఉద్ధేశించే అన్నారని, ఆయన్ను కరోనావైరస్‌తో పోలుస్తూ మాట్లాడారని పార్టీ నేతలు భావిస్తున్నారు.
‘నేను సమావేశం ప్రారంభించాను. ఇంతకు ముందు కరోనా వచ్చింది.. తరువాత మన పార్టీలో కూడా పెద్ద కరోనా అడుగుపెట్టింది’ అని సీఎం వ్యాఖ్యానించారు. అంతేగాక రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చినా, రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల మద్దతుతో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిందన్నారు. అయితే ప్రభుత్వంపై పైలట్ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా గహ్లోత్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
కిసాన్ సమ్మేళన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సచిన్ పైలట్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రశ్నపత్రం లీక్‌ల కారణంగా రాష్ట్రంలో పలు పరీక్షలు రద్దు చేయడం, పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టడం వంటి పలు అంశాలపై గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన తనకే అప్పగించాలనే సంకేతాలను చూపుతున్నారు. ‘ఐదేళ్లు కష్టపడ్డాను.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది.. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం విజయం సాధించగలం’ అని సచిన్ పేర్కొన్నారు.
राजस्थान में अलग ही खेल चल रहा है!
पहले कोरोना आ गया फिर एक बड़ा कोरोना और आ गया हमारी पार्टी के अंदर.... - अशोक गहलोत (CM राजस्थान)
(यह बड़ा कोरोना कांग्रेस पार्टी में कौन ??) pic.twitter.com/Kkzl3ODNmH
— Sachin (@Sachin54620442) January 19, 2023
Comments
Please login to add a commentAdd a comment